'దుర్గం'లో ఐటీ దాడులు
రాయదుర్గం : రాయదుర్గంలోని వినాయక సర్కిల్ సమీపాన నివాసముంటున్న తల్లం కాశీనాథ్ అనే హోల్‌సేల్ వ్యాపారి ఇంట్లో గుంటూరు, తిరుపతి, గుంతకల్లుకు చెందిన ఇన్‌కంట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు సోదాలు నిర్వహించిన అనంతపురం ఐటీఓ ఎస్పీఎన్ కుమార్ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. మద్యాహ్నం 3 గంటలకని, 5కని, రాత్రి 9 గంటలకని విలేకర్లను తప్పుదోవ పట్టించే యత్నాలు చేశారు.
చివరికి 9 గంటలకెళితే సోదాలు ఎంతసేపు పడతాయో తెలియదు అర్ధరాత్రి కావచ్చు, అంతవరకు ఉంటే చెబుతాం అంటూ సమాధానమిచ్చారు. సోదాలపై సమగ్రంగా జాయింట్ కమిషనర్ కు నివేదిక ఇస్తామని మాత్రం తెలిపారు. ఈ సోదాల్లో విశాఖపట్టణానికి చెందిన ఐటీఓ భావన్నారాయణ, ఇన్స్పెక్టర్లు వీరబాబు, కిరణ్ కుమార్, సూర్యబాబు నాయక్ పాల్గొన్నట్లు చెప్పారు. గుంటూరులో తయారయ్యే త్రిపుల్ ఎక్స్, సరిగమ సబ్బుల ఏజెన్సీ తీసుకుని, ట్యాక్స్ కట్టకుండా జీరో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం అందడంతోనే అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది.