Thane railway station
-
భవన శిథిలాల కింద 12 మంది సమాధి
థానే: థానే రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం వేకుజామున భవనం కూలి ఒకే కుటుంబంలో నలుగురు సహా మొత్తం 12 మంది మృతి చెందారు. పదిమందికిపైగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నివారణ దళం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి 12 మంది వరకు రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. కూలిన భవనం 50 ఏళ్ల కింద కట్టినదని, ప్రమాదకర భవనాల జాబితాలో చేర్చినదని మునిసిపల్ అదనపు కమిషనర్ సునీల్ చవాన్ చెప్పారు. సహాయక చర్యలను జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏక్నాథ్ షిండే, జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రీపెయిడ్ ఆటోలు సిద్ధం!
సాక్షి, ముంబై: ఠాణే రైల్వేస్టేషన్ వద్ద ఈ నెల 15వ తేదీ నుంచి ప్రీపెయిడ్ ఆటోరిక్షాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటివరకు నగరంలోని అనేక ముఖ్య రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నవిషయం తెలిసిందే. అయితే మొదటిసారి ప్రీ పెయిడ్ ఆటోల విధానాన్ని ఠాణే రైల్వేస్టేషన్లో ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీవో అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి సేవలనే నగరంలోని శివారు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నామని తెలిపారు. బోరివలి, అంధేరి, కుర్లా, బాంద్రా టర్మినస్లలో చాలా మంది ప్రయాణికులు ప్రీపెయిడ్ ఆటో సేవలను ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ విధానంలో చార్జీలను ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. నిర్వహణ చార్జీలతో సహా ఫిక్స్డ్ చార్జీలను వసూలు చేస్తారు. చార్జీలకు గాను రసీదును కూడా జారీ చేస్తారు. అయితే రెగ్యులర్ చార్జీలకంటే ప్రయాణికులు 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వీటితో పాటు నిర్వహణ కోసం అదనంగా రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. ఠాణేలోనే అత్యంత పురాతనమైన ఆటోరిక్షా యూనియన్ విజ్జు నటేకర్ ఈ సేవలను అందజేయనుంది. దీని నిమిత్తం ఈ స్టేషన్ పశ్చిమ దిశలో రైల్వే అధికారులు, ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ కొంత స్థలాన్ని కేటాయించాయి. ఈ విధానాన్ని ప్రయాణికులు కూడా స్వాగతించారని అధికారి తెలిపారు. ఠాణేలో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఆగడంతో ఇలాంటి సేవలు ఎంతో ఆవశ్యమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. దూర ప్రాంతాలైన గోడ్బందర్ రోడ్, ముంబ్రా, భివండీ తదితర ప్రాంతాలకు తీసుకు వెళ్లేందుకు ఆటోవాలాలు విపరీతంగా చార్జీలు డిమాండ్ చేస్తారని స్థానికులు ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా, కల్యాణ్ రైల్వే స్టేషన్లో సైతం ప్రీపెయిడ్ ఆటోలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారి తెలిపారు. ఇప్పటికే ఈ సేవలకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి అయ్యాయన్నారు. ఠాణే స్టేషన్లో ఈ సేవలకు మంచి స్పందన లభిస్తే మరికొన్ని స్టేషన్లలో ఈ సేవలను విస్తరిస్తామని అధికారి తెలిపారు. -
ఠాణేలో ‘తెలుగు’ రైళ్లు ఆపండి సారూ..
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లను ఠాణే రైల్వేస్టేషన్లో నిలపాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అనేక తెలుగు సంఘాలు తమ వంతు యత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల మహారాష్ట్ర టైలర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో తెలుగు ప్రజల బృందం సెంట్రల్ రైల్వే ఆపరేషన్స్ చీఫ్ మెనేజర్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్బంగా వీరు ముఖ్యంగా కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు (17221-17222)ను ఠాణే రైల్వేస్టేషన్లో నిలపాలని డిమాండ్ చేశారు. లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) - కాకినాడ పోర్ట్‌ల మధ్య నడిచే ఈ రైలుతోపాటు ఎల్టీటీ - విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్‌లకు ఠాణేలో హాల్ట్ లేదు. జిల్లా కేంద్రమైన ఠాణే చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు.అయితే ఇక్కడ రైళ్లు ఆగకపోవడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించి వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లు ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఠాణేలో నిలపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు వినతి పత్రాన్ని సెంట్రల్ రైల్వే ఆపరేషన్స్ చీఫ్ మేనేజర్‌కు అందచేశారు. మానవహక్కుల సంఘం సభ్యుడు సురేష్ కుమార్‌తోపాటు మహారాష్ట్ర టైలర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు దాసర్ భాస్కర్‌రావు, ప్రధాన కార్యదర్శి కడలి రామలింగేశ్వర్రావు, గుత్తుల సాహెబ్రావు, శ్రీనివాస్, గోపాలకృష్ణ, డి.రమణ, బాలం సత్యనారాయణ తదితరులున్నారు.