సాక్షి, ముంబై: ఠాణే రైల్వేస్టేషన్ వద్ద ఈ నెల 15వ తేదీ నుంచి ప్రీపెయిడ్ ఆటోరిక్షాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటివరకు నగరంలోని అనేక ముఖ్య రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నవిషయం తెలిసిందే. అయితే మొదటిసారి ప్రీ పెయిడ్ ఆటోల విధానాన్ని ఠాణే రైల్వేస్టేషన్‌లో ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీవో అధికారి ఒకరు తెలిపారు.
ఇలాంటి సేవలనే నగరంలోని శివారు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నామని తెలిపారు. బోరివలి, అంధేరి, కుర్లా, బాంద్రా టర్మినస్‌లలో చాలా మంది ప్రయాణికులు ప్రీపెయిడ్ ఆటో సేవలను ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ విధానంలో చార్జీలను ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. నిర్వహణ చార్జీలతో సహా ఫిక్స్‌డ్ చార్జీలను వసూలు చేస్తారు. చార్జీలకు గాను రసీదును కూడా జారీ చేస్తారు.
అయితే రెగ్యులర్ చార్జీలకంటే ప్రయాణికులు 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వీటితో పాటు నిర్వహణ కోసం అదనంగా రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. ఠాణేలోనే అత్యంత పురాతనమైన ఆటోరిక్షా యూనియన్ విజ్జు నటేకర్ ఈ సేవలను అందజేయనుంది. దీని నిమిత్తం ఈ స్టేషన్ పశ్చిమ దిశలో రైల్వే అధికారులు, ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ కొంత స్థలాన్ని కేటాయించాయి.
ఈ విధానాన్ని ప్రయాణికులు కూడా స్వాగతించారని అధికారి తెలిపారు. ఠాణేలో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఆగడంతో ఇలాంటి సేవలు ఎంతో ఆవశ్యమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. దూర ప్రాంతాలైన గోడ్‌బందర్ రోడ్, ముంబ్రా, భివండీ తదితర ప్రాంతాలకు తీసుకు వెళ్లేందుకు ఆటోవాలాలు విపరీతంగా చార్జీలు డిమాండ్ చేస్తారని స్థానికులు ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా, కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో సైతం ప్రీపెయిడ్ ఆటోలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారి తెలిపారు. ఇప్పటికే ఈ సేవలకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి అయ్యాయన్నారు. ఠాణే స్టేషన్‌లో ఈ సేవలకు మంచి స్పందన లభిస్తే మరికొన్ని స్టేషన్లలో ఈ సేవలను విస్తరిస్తామని అధికారి తెలిపారు.
ప్రీపెయిడ్ ఆటోలు సిద్ధం!
Published Mon, Dec 8 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement
Advertisement