thanur
-
సెల్ఫీ సరదా ప్రాణం తీసింది: ముగ్గురు విద్యార్థినుల దుర్మరణం
సాక్షి, నిర్మల్: ముగ్గురు కలసి సరదాగా గడపాలనుకున్నారు. కలసి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆడారు... పాడారు.. ఆ ఆనంద క్షణాలను భద్రంగా దాచుకోవాలని సెల్ఫీలు తీసుకున్నారు. అయితే ఆ సెల్ఫీలే మృత్యుదారికి తీసుకెళతాయని వారు ఊహించలేదు. నిర్మల్ జిల్లా త నూర్ మండలం సింగన్‌గాం గ్రామానికి చెందిన ఎల్మె దాదారావ్, మంగళబాయి దంపతులకు కూతుళ్లు స్మిత, వైశాలి, కుమారుడు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్మిత, వైశాలి తల్లితో కల సి పొలం వద్దకు వెళ్లగా.. వారి వెంట బంధువుల అమ్మాయి లహుబందే అంజిలి కూడా వెళ్లింది. పొలం వద్ద మంగళబాయితో కాసేపు ఉన్నారు. పొలం వద్దే సెల్ఫీలూ దిగారు. అనంతరం ఇంటికి వెళ్తున్నామంటూ మంగళబాయికి చెప్పి ముగ్గురు కలిసి అక్కడి నుంచి సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లారు. సెలీ్ఫలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులోని నీటి గుంతలో పడిపోయారు. ఈత రాకపోవడంతో అక్కాచెల్లెళ్లు ఎల్మె స్మిత (17), ఎల్మె వైశాలి (14), లహుబందే అంజిలి (16) నీట మునిగి దుర్మరణం చెందారు. సాయంత్రం మంగళబాయి వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకోగా ముగ్గురూ ఇంటికి రాలేదు. దీంతో ఆమె పొలం వద్దకు వెళ్లి వెతికింది. జాడలేకపోవడంతో బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువుకు వెళ్లి చూడగా నీటి గుంతలో స్మిత, వైశాలి, అంజిలి మృతదేహాలు లభించాయి. -
సింగన్గావ్ చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాల లభ్యం
-
సమ్మర్లో కూల్ కూల్‌గా...
సాక్షి, తానూరు(ముథోల్): ఎండాకాలం రాగానే మనందరికీ గుర్తొచ్చేవి కూలర్లే. ఎండ నుంచి ఉపశమనానికి, వేసవి తాపం నుంచి రక్షణకు ప్రతీ ఇంట్లో కూలర్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో కూలర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుంచే ఎండలు తమ ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో కూలర్లకోసం ప్రత్యేకమైన దుకాణాలు వెలుస్తుండగా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రికల్ షాపులో వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. వీటి ధర రూ.1600 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయి. గత పక్షం రోజులుగా ఎండలు అధికం కావడంతో వీటి కొనుగోళ్లు అధికమయ్యాయి. ఎక్కడ చూసిన కూలర్ల దుకాణాలే.. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో కూలర్ షాపులు అధికంగా కనిపిస్తున్నాయి. గతంలో వాడిన కూలర్లకు మరమ్మతు చేయడంతోపాటు కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రజలు దుకాణాల బాట పడుతున్నారు. కొంతమంది ఎండలు ముదిరితే కూలర్ల రేట్లు పెరుగుతాయని ముందుగానే కొంటున్నారు. ఫైబర్, ఇనుప కూలర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కూలర్లను మహారాష్ట్రలోని నాగపూర్, ఔరంగాబాద్, నాందేడ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు నెలలే వ్యాపారం.. ఎండాకాలంలో నాలుగు నెలలు కూలర్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఏటా సీజన్లో 10 నుంచి 20వేల కూలర్లు అమ్ముడవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో పక్క పెళ్లిళ్ల సీజన్ కావడం.. కట్నకానుకల జాబితాలో కూడా కూలర్ చేరడంతో వేసవిలో వీటికి డిమాండ్ పెరిగింది. టేబుల్‌పై ఉంచుకునే పర్సనల్ కూలర్‌తోపాటు పెళ్లిళ్ల సందర్భంలో ఫంక్షన్హాల్లో, హోటళ్లలో వినియోగించే జంబో కూలర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. యువకులకు ఉపాధి.. ఎండాకాలం రావడంతో పట్టణాల్లో ఉన్న షాపు యాజమాన్యాలు దుకాణాల్లో మరమ్మతు కోసం యువకులను పెట్టుకుంటున్నారు. దీంతో ఉపాధి లభిస్తోంది. నాలుగు నెలలపాటు ఈ వ్యాపారం కొనసాగడంతో యువకులు దుకాణాల్లో వ్యాపారం సాగిస్తున్నారు. నాలుగు నెలలపాటు ఉపాధి లభిస్తుందని యువకులు చెబుతున్నారు. ఇనుప కూలర్ల తయారీ.. పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో వ్యాపారులు ఇనుప కూలర్లు తయారు చేస్తున్నారు. కూలర్ల తయారీలో వినియోగించే ముడి సరుకును హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్, పూణే నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కూలర్ల తయారీకి ఐరన్ స్డాండ్, ఐరన్ ఫీల్స్, పంపులు, మోటార్, గడ్డి, కలర్ స్విచ్‌లు, వాటర్ సప్లై పైపులు వాడుతున్నారు. స్టాండర్ట్ ఐరన్ వాడటంతో రెడీమేడ్ కూలర్ల కన్నా అవి నాణ్యతగా ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. వీటి ధర నాణ్యతను బట్టి రూ.3 వేల నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. -
తానూరులో ఆన్లైన్ మోసం
ఫోన్ వస్తుందన్న ఆశతో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు తానూరు : తానూరుకు చెందిన యువకుడు గంగాధర్ ఆన్లైన్లో మోసపోయాడు. అతడి సెల్‌కి ఇటీవలే ఓ కాల్ వచ్చింది. మీరు సామ్సాంగ్ జీ–7 మెుబైల్ గెలుచుకున్నారని ముందస్తుగా అభినందనలు తెలిపారు. గెలుచుకున్న ఫోన్ మీకు పంపుతున్నామని అందుకోసం సర్వీస్ చార్జీల కింద రూ.4 వేలు ఇచ్చి ఫోన్ పార్సిల్‌ను తీసుకోవాలని సూచించారు. ఫోన్లో అవతలి వైపు నుంచి వచ్చిన మాటలు విన్న యువకుడు తన వివరాలు నమోదు చేయించాడు. యువకుడి అడ్రస్‌పై పోస్టాఫీసులో ఓ పార్సిల్ వచ్చింది. పోస్టాఫీసులో పార్సిల్ కోసం రూ.4 వేలు చెల్లించాడు. తీరా ఇంటికి వెళ్లి పార్సిల్ ఓపెన్ చేస్తే అందులో పాత పేపర్లను కట్టకట్టి ప్యాక్ చేసి పంపారు. ప్యాకింగ్ తెరవగానే కాగితాల కట్ట బయటపడింది. దీంతో సదరు యువకుడు మోసపోయినట్లు గ్రహించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే నంబర్లతో ఫోన్ చేశాడు తాను ఫోన్ గెలుచుకున్నట్లు 9136501769, 9136967080, 7065175123 నంబర్లతో ఫోన్లు వచ్చాయని బాధిత యువకుడు గంగాధర్ తెలిపాడు. ఈ నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేస్తానని వివరించాడు.