సాక్షి, నిర్మల్: ముగ్గురు కలసి సరదాగా గడపాలనుకున్నారు. కలసి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆడారు... పాడారు.. ఆ ఆనంద క్షణాలను భద్రంగా దాచుకోవాలని సెల్ఫీలు తీసుకున్నారు. అయితే ఆ సెల్ఫీలే మృత్యుదారికి తీసుకెళతాయని వారు ఊహించలేదు. నిర్మల్ జిల్లా త నూర్ మండలం సింగన్‌గాం గ్రామానికి చెందిన ఎల్మె దాదారావ్, మంగళబాయి దంపతులకు కూతుళ్లు స్మిత, వైశాలి, కుమారుడు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్మిత, వైశాలి తల్లితో కల సి పొలం వద్దకు వెళ్లగా.. వారి వెంట బంధువుల అమ్మాయి లహుబందే అంజిలి కూడా వెళ్లింది. పొలం వద్ద మంగళబాయితో కాసేపు ఉన్నారు. పొలం వద్దే సెల్ఫీలూ దిగారు.
అనంతరం ఇంటికి వెళ్తున్నామంటూ మంగళబాయికి చెప్పి ముగ్గురు కలిసి అక్కడి నుంచి సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లారు. సెలీ్ఫలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులోని నీటి గుంతలో పడిపోయారు. ఈత రాకపోవడంతో అక్కాచెల్లెళ్లు ఎల్మె స్మిత (17), ఎల్మె వైశాలి (14), లహుబందే అంజిలి (16) నీట మునిగి దుర్మరణం చెందారు. సాయంత్రం మంగళబాయి వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకోగా ముగ్గురూ ఇంటికి రాలేదు. దీంతో ఆమె పొలం వద్దకు వెళ్లి వెతికింది. జాడలేకపోవడంతో బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువుకు వెళ్లి చూడగా నీటి గుంతలో స్మిత, వైశాలి, అంజిలి మృతదేహాలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment