
ముధోల్: భారీ వర్షాలకు సాగుచేసిన పంట మొత్తం పోయింది. దీంతో మనస్తాపం చెందిన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎడ్‌బిడ్ గ్రామానికి చెందిన మంగారపు లక్ష్మణ్(38) తనకున్న రెండెకరాల్లో వానాకాలం సోయా పంట వేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు రావడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నది.
గతేడాది కూడా వర్షాలకు పంట దెబ్బతిని ఆశించిన దిగుబడి రాలేదు. ఆ నష్టాలను పూడ్చుకుందామని ఈ ఏడు వేసిన పంట కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. దీనికితోడు ప్రైవేటుగా చేసిన అప్పులు రూ.80 వేల వరకు ఉన్నాయి. అప్పులు తీర్చేమార్గం లేక లక్ష్మణ్ శుక్రవారం గ్రామ శివారులోకి వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. లక్ష్మణ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment