theafs
-
ఎమ్మెల్యే కారులో రూ.2కోట్లు చోరీ
తిరువొత్తియూరు: తిరుచ్చిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే కారులోని రూ.2 కోట్ల నగదుతో పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తిరుచ్చి–కరూర్ రోడ్డులోని బెట్టవాయితలైలో మార్చి 22న రెండు కార్లలో వచ్చిన కొందరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి రావడంతో ఒక కారులో వచ్చిన వారు పారిపోయారు. ఎమ్మెల్యే పాసుతో ఉన్న కారులో తనిఖీ చేయగా గోనె సంచిలో రూ.కోటి నగదు కనిపించింది. మద్యం మత్తులో ఉన్న ముసిరికి చెందిన అన్నాడీఎంకే నేతలు రవిచంద్రన్(55), సత్యరాజా (43), జయశీల (46), డ్రైవర్ కుమార్ (36)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేయగా ఎమ్మెల్యేకు చెందిన రూ.2కోట్లను మరో కారులో దిలీప్‌కుమార్ (31), ప్రకాష్ (31), మణికంఠ (29), శివ అలియాస్ గుణశేఖరన్ (30), రాజ్‌కుమార్ (30), సురేష్ తీసుకుని పారిపోయినట్లు తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఆ నగదును తిరుచ్చికి చెందిన రౌడీ షీటర్ స్వామి రవి అపహరించుకుని వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి రవి కోసం గాలిస్తున్నారు. చదవండి: ప్రాణాలు తీసిన పుచ్చకాయ! -
తొట్టిగ్యాంగ్ గుట్టు రట్టు..
సాక్షి, విజయవాడ: అవసరాలు తీర్చుకొనేందుకు దొంగలుగా అవతారం ఎత్తిన తొట్టిగ్యాంగ్ గుట్టు రట్టయింది. వరుసచోరీలకు పాల్పడి బెంబేలెత్తించిన ముఠా నిఘా కెమెరాల్లో చిక్కి బుక్కైంది. మంగళవారం పోలీసుల చేతికి చిక్కి కటకటాల ఊచలు లెక్కపెడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖానికి ముసుగులు ధరించి ఉన్న ఈ ముఠాలో దాసరి దుర్గారావు, జగన్నాధం షణ్ముఖలు ఇద్దరూ విజయవాడలోని రాజరాజేశ్వరీపేటకు చెందినవారు. వీరికి చదువు అబ్బకపోవటంతో చెడు దారిపట్టి వ్యసనాలకు బానిసలయ్యారు. అవసరాలు తీర్చుకొనేందుకు దొంగతనంపై దృష్టిపెట్టారు. దొంగతనాలు, దోపిడీలు చేసి తమ అవసరాలు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము ఉన్న ప్రాంత పరిసరాల్లో చేతివాటం ప్రదర్శించి ఇప్పటికే చాలాసార్లు పట్టుబడ్డారు. కాగా జైలుకి వెళ్లి వచ్చినా వారిలో ఏమాత్రం మార్పు రాకపోగ మళ్లీ దొంగతనాలకు తెగబడ్డారు. మరో ఇద్దరు మైనర్లని తమ ముఠాలో చేర్చుకుని.. దొంగతనాలు ఏలాచేయాలో తర్ఫీదు ఇచ్చారు. వారు ఎంపిక చేసుకొన్న షాపులోల డబ్బు అవసరమైనప్పుడు కన్నం వేయాలని స్కెచ్ వేశారు. అనుకున్నట్టే ఈ నెల ఒకటో తేదీ రాత్రి అజిత్‌సింగ్‌నగర్‌లోని మూడు దుకాణాల్లో చొరబడ్డారు. హెచ్‌పీ గ్యాస్, సంగం డైరీ, గురుసాయి మెడికల్ అండ్ ఫాన్సీ షాపుల్లో చోరి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్త బృందాన్ని రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. మైనర్లు కూడా దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకొని తమ దైనశైలిలో విచారించారు. వారిని నడిపిస్తున్న తోడుదొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
తీగ లాగితే డొంక కదిలింది
సాక్షి, అనంతపురం: తీగలాగితే డొంక కదిలింది. నెలన్నర క్రితం నల్లమాడ మండల కేంద్రంలో జరిగిన మద్యం దుకాణం చోరీ కేసును తాడిపత్రి, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా చేధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక యువకుడు, మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరి నుంచి రూ. 10.84 లక్షల నగదు, రెండు ద్విచక్రవాహనాలు, 9 సెల్ఫోన్లు, ఒక డీవీఆర్, సీపీయూ, మూడు కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.16 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను లోతుగా విచారిస్తే మరో రెండు దొంగతనాల కేసులు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు వెల్లడించారు. కదిరి పట్టణం గజ్జెలరెడ్డిపల్లికి చెందిన పోతుల శివకుమార్(23)తో పాటు మరో ఇద్దరు మైనర్లు ఈ ఏడాది జూన్ 20న అర్ధరాత్రి నల్లమాడలోని మద్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఆ దుకాణం పైకప్పు రేకును కత్తిరించి లోపలికి ప్రవేశించారు. అందులో రూ. 12లక్షల నగదు, డీవీఆర్ బాక్సును ఎత్తుకెళ్ళారు. దీంతో పాటు తాడిపత్రి పట్టణంలోని సీబీరోడ్డులో ఓ సెల్‌ఫోన్ దుకాణంలో ఈ ఏడాది జూన్ 6న దొంగతనానికి పాల్పడ్డారు. గతంలో 2017లో అనంతపురం మార్కెట్‌యార్డు సమీపంలో ఓ ఫొటో స్టుడియోలో కెమెరాలు దొంగిలించారు. చోరీ సొత్తును సమానంగా పంచుకొని జల్సాలు చేసేవారు. ప్రధాన నిందితుడు పాత నేరస్తుడు ప్రధాన నిందితుడు పోతుల శివకుమార్ పాత నేరస్తుడు. 2014 నుంచి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాతో పాటు తిరుపతి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో రిమాండ్ అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి నేరప్రవృత్తిని కొనసాగిస్తూ వస్తున్నాడు. నల్లమాడ, తాడిపత్రిలో జరిగిన దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన సీసీఎస్, తాడిపత్రి పోలీసులు నిందితులను తాడిపత్రి పట్టణంలోని ఫ్లై ఓవర్ సమీపంలో అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐలు తేజోమూర్తి, నరసింహారావు, శ్యాంరావు, ఎస్ఐలు శంకర్‌రెడ్డి, జగదీష్, జనార్దన్, చలపతి, సిబ్బంది రఘు, గోవిందు, ప్రవీణ్, ఫరూక్, శ్రీనివాసులు, రంజిత్, మల్లికార్జున, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
జల్సా దొంగలు
సాక్షి, హైదరాబాద్: వెస్ట్ మారేడ్‌పల్లిలోని అశ్వినినగర్‌కు చెందిన గౌడి శివశంకర్ పదో తరగతి మధ్యలోనే మానేశాడు. సంజీవయ్యనగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి గుగ్గిలం కార్తీక్ ఇతడి స్నేహితుడు. వీరిద్దరూ తరచూ మారేడ్‌పల్లి ప్రాంతంలో కలుసుకుంటూ మద్యం తాగేవాళ్లు. ఓ రోజు నిషా తలకెక్కడంతో అర్ధరాత్రి వేళ వాకింగ్‌కు వెళ్లి కనిపించిన వారిపై దాడి చేసి సెల్ఫోన్లు దోచుకుంటూ పోలీసులకు చిక్కారు. కొత్తపేట నివాసి ఎం.అరుణ్‌కుమార్ సికింద్రాబాద్‌లోని ఓ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో డిగ్రీ విద్యార్థి. అతడి స్నేహితుడు అభిల్ మరో విద్యాసంస్థలో ఇంటర్ చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి మౌలాలీలో ఉంటున్న మనీష్ ఉపాధ్యాయ, తుకారాంగేట్‌కు చెందిన టమాటో సంజయ్‌సింగ్ ఇంకో విద్యాసంస్థలో ఇంటర్ స్టూడెంట్స్. ఈ నలుగురూ గంజాయి తాగేందుకు నేరాలు చేస్తూ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కారు. మంగళ్‌హట్ ప్రాంతానికి చెందిన సునీల్‌సింగ్ విద్యార్థి. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. మూడు నెలలుగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ బుకీగా మారాడు. సెల్ఫోన్లోనే ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారానే దందా చేస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరికాడు. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. జల్సాల కోసం నేరాలకు పాల్పడుతున్న యువత, విద్యార్థుల వ్యవహారాలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వీరు చేస్తున్న నేరాల్లో స్నాచింగ్స్, వాహన దొంగతనాలు, చోరీలతో పాటు సైబర్ నేరాలు అధికంగా ఉంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. జీవన విధానంలో మార్పులు, సాంకేతిక విప్లవం కారణంగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్టీ అఫెన్సులకు పాల్పడి ఏటా పోలీసులకు చిక్కుతున్న వారిలో 70 శాతానికి పైగా కొత్తవారు ఉండడం గమనార్హం. అలా మొదలై... సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందినవారు కూడా నేరాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఈ పరిణామం పోలీసులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పేరుమోసిన దొంగలు, ముఠాలకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరిపై కన్నేసి ఉంచుతారు. అయితే కొత్తగా పుట్టుకొస్తున్న ఈ దొంగల కారణంగా కేసుల దర్యాప్తు కూడా మందకొడిగా సాగి, కొలిక్కితేవడం కష్టసాధ్యంగా మారుతోందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వారు తొలుత చిన్నాచితకా చోరీలతో ప్రారంభించి జైలుకు వెళ్లడం ద్వారా రాటుదేలుతున్నారని, ఆపై నేరాలు చేయడమే వృత్తిగా మార్చుకొని జల్సారాయుళ్లుగా బతికేస్తున్నారని కొన్ని కేస్ స్టడీస్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. బెరుగ్గా.. భేషుగ్గా ఇలాంటి నేరగాళ్లు తమ బలహీనతలు, వ్యసనాలతో నేరబాట పడుతున్నా తొలినాళ్లలో బెరుగ్గానే చేస్తున్నారు. ఒక నేరం చేసిన తర్వాత ఈజీ మనీకి అలవాటు పడిపోయి పట్టుబడే వరకు వరుసగా నేరాలు చేస్తున్నారు. పోలీసులకు చిక్కి జైలుకు వెళ్తున్నా చట్టాల్లోని లోపాలు, తేలిగ్గా బెయిల్ దొరుకుతున్న విధానం, తీర్పులు వెలువడడంలో జాప్యం తదితర వారు అదే బాటలో కొనసాగేలా పురిగొల్పుతున్నాయి. నివాస ప్రాంతాలు, పేర్లను తరచూ మార్చుకుంటూ భేషుగ్గా నేరాలు కొనసాగిస్తున్నారు. వీరికి సంబంధించిన పూర్తి రికార్డులు సైతం పోలీసుల వద్ద ఉండకపోవడం, మౌలిక వసతుల కొరత నేపథ్యంలో ప్రతినిత్యం నిఘా ఉంచడం కూడా సాధ్యం కాకపోవడం వీరికి కలిసొస్తోంది. ‘ప్రతీకారం’తో సైబర్ నేరాలు ప్రాపర్టీ నేరాలు చేసే వారిలో అత్యధికులు జల్సాల కోసం చేస్తుండగా... సైబర్ నేరాలకు పాల్పడే విద్యాధికుల్లో ఎక్కువ మంది ‘ప్రతీకారం’తోనే ఆ పని చేస్తున్నారు. పాత స్నేహితులు, ప్రేమను నిరాకరించినవారు, మాజీ సంస్థలకు చెందిన ఉన్నతోద్యోగులు తదితరులపై అనేక కారణాల నేపథ్యంలో కక్ష పెంచుకుంటున్న యువకులు, విద్యాధికులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సెల్‌ఫోన్ నుంచి నెట్ కేఫ్ వరకు ఎక్కడపడితే అక్కడ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో పాటు ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ నేరాలు చేసి కటకటాల్లోకి వెళ్తున్నారు. కారణాలు అనేకం... యువతలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడానికి సామాజిక, ఆర్థిక, కుటుంబ పరంగా అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో విలాసాలు అనేవి ఒకప్పుడు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనం, సెల్ఫోన్లు, పార్టీలు కాలక్రమంలో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. గ్రామాల నుంచి నగరాలకు వస్తున్నవారు, సిటీలో నివసిస్తున్న మధ్యతరగతి వారు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒకసారి విలాసాలకు అలవాటుపడి పదేపదే అలాంటి జీవితం కోసం ఈజీమనీ వైపు మొగ్గి నేరాల బాటపడుతున్నారు. నగర యువత కూడా గర్ల్‌ఫ్రెండ్స్, స్నేహితురాళ్లతో షికార్ల కోసం, వారిని మెప్పించేలా ఖర్చులు చేయడం కోసం నేరగాళ్లుగా మారుతున్నారు. అజమాయిషీ లేకపోవడంతో.. నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. చదువులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు అనేక మంది వలస వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి పెరిగింది. ఇలా వస్తున్న యువత తల్లిదండ్రులు, కుటుంబాలకు దూరంగా సహోద్యోగులు, మిత్రులతో కలిసో, ఒంటరిగానో జీవిస్తున్నారు. దీంతో ఏం చేసినా పట్టించుకునేవారు లేకుండాపోతున్నారు. నగరంలోనూ మారిన జీవన విధానం, చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న యువకుల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట. -
కసుమూరు దర్గాలో దొంగలు పడ్డారు
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలీ దర్గా హుండీ వేలం వాయిదా పడడం దోపిడీదారులకు వరంగా మారింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా వక్ఫ్ బోర్డు అధికారులు, కొందరు వ్యక్తులు హుండీలో భక్తులు వేసిన నగదును దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. వక్ఫ్ బోర్డులోని కొందరికి వాటాలు వెళుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, వెంకటాచలం: మండలంలోని కసుమూరులో కాలేషాపీర్ మస్తాన్‌వలీ దర్గా ఉంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వక్ఫ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో దర్గా కార్యకలాపాలు సాగుతుంటాయి. వేలం పాటలు నిర్వహించి దర్గా హుండీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు. వేలంపాట వాయిదా పడితే హుండీ నగదును వక్ఫ్ బోర్డు, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో లెక్కించాల్సి ఉంది. గతేడాది హుండీ వేలంపాట జరగ్గా రూ.1.50 కోట్లకు వేలంపాటదారులు దక్కించుకున్నారు. దీని గడువు ఈ ఏడాది జనవరి 5వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి వక్ఫ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలోనే హుండీ నిర్వహణ సాగుతోంది. చర్యలు చేపట్టలేదు జనవరి 5వ తేదీ తర్వాత హుండీ వేలం గురించి వక్ఫ్ బోర్డు అధికారులు దృష్టి సారించలేదు. వేలం నిర్వహణకు సంబంధించి పలువురు కాంట్రాక్టర్లు వక్ఫ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. హుండీలో భక్తులు కానుకలుగా వేసిన నగదును తొలిసారి 53 రోజులకు వక్ఫ్‌బోర్డు అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపు ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించారనే విమర్శలున్నాయి. ఈ లెక్కింపులో రూ.7.50 లక్షలు వచ్చినట్లు బోర్డు అధికారులు చెప్పడంతో స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గోప్యంగా ఉంచడంతో.. రెండో దఫాగా ఈనెల 12వ తేదీన 70 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. అయితే లెక్కింపు ప్రారంభమైన తర్వాత స్థానికులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకుని వక్ఫ్ బోర్డు అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హుండీ నగదును పక్కదారి పట్టించేందుకే రహస్యంగా లెక్కింపు చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. స్థానికులు ఆందోళన చేస్తున్న సమయంలోనే హుండీ లెక్కింపు వీడియో తీసుకున్న ప్రైవేట్ వ్యక్తికి బోర్డు సూపరింటెండెంట్ రూ.5 వేలు నగదు ఇవ్వగా ఇతరుల చేత ఆ నగదును బయటకు పంపించడం జరిగింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు, వీఆర్వోకు చెప్పడంతో ఆ నగదును వెనక్కి తీసుకువచ్చారు. మరో ఘటనలో.. ఓ వ్యక్తి హుండీ నుంచి కిందపోసిన నగదులో ఓ కట్టను తీసుకుని బయటకు వెళ్లగా స్థానికులు వెంబడించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని నగదును లెక్కింపు వద్దకు చేర్చారు. ఈ విషయాల ఆధారంగా హుండీ నగదు దోచేస్తున్నారని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హుండీ వేలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రతి ఏటా జనవరి నుంచి మే నెల వరకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నగదు వచ్చేదని పలువురు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది జనవరి ఐదో తేదీ నుంచి మే నెల 12వ తేదీ వరకు కేవలం రూ.19.75 లక్షలు వచ్చినట్లు చూపడంతో హండీ నగదు దోపిడీ చేస్తున్నారని అనేకమంది ఆరోపిస్తున్నారు. లెక్కింపు సమయంలో తప్పిదాలపై వక్ఫ్ బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోర్డులోని కొందరు ఉన్నతాధికారులకు వాటా పంపుతుండడంతో వారు పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేయించాలని భక్తులు కోరుతున్నారు. పోలీసులు విచారిస్తున్నారు హుండీ లెక్కింపు సమయంలో ఓ వ్యక్తి నగదు కట్ట తీసుకెళ్లిన విషయం వాస్తవమే. పోలీసులు అదుపులోకి తీసుకుని నగదు వెనక్కి తీసుకువచ్చారు. ఈ విషయంపై విచారిస్తున్నారు. హుండీ నగదు దోపిడీపై నాపై వచ్చే ఆరోపణలు అవాస్తవం. కెమెరామెన్‌కు రూ.5 వేలు ఇచ్చిన విషయం వాస్తవమే. కానీ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తీసుకున్నాం. – అహ్మద్‌బాషా, దర్గా సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయలేదు హుండీ లెక్కింపు వద్దకు పోలీస్ సిబ్బందిని పంపాం. అక్కడ ఏం జరిగిందనే విషయంపై వక్ఫ్ బోర్డు అధికారులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అందువల్ల విచారణ జరపలేదు. – షేక్ కరీముల్లా, ఎస్సై -
హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్ హల్చల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హైదరాబాద్‌లో హల్చల్ చేస్తోంది. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడతోంది. గొల్కొండ, ఆల్ కరీం కాలనిల్లోకి ఈ నెల 15న రాత్రి చెడ్డి గ్యాంగ్ చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజ్ సాయంతో దొంగలను గుర్తించారు. చెడ్డి గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు బనియన్, నిక్కరు ధరించి రాత్రి వేళల్లో దొంగతనం చేయడం చెడ్డిగ్యాంగ్ ప్రత్యేకత. చోరీ సమయంలో ఎవరికీ పట్టుబడకుండా చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ఒళ్లంతా నూనె రాసుకుంటారు. దొంగతనానికి పాల్పడే సమయంలో అవసరమైతే హత్యకు కూడా చెడ్డీగ్యాంగ్ వెనుకాడదు. -
ఆ దొంగల రూటే సెపరేటు
సాక్షి,సిటీబ్యూరో: బంగారం వ్యాపారుల్ని ఆన్లైన్లో గుర్తిస్తారు... తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామంటూ ఎర వేస్తారు... తమ స్వస్థలాలకు రప్పించి అందినకాడికి దండుకుని మోసం చేస్తుంటారు... ఈ పంథాలో దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న గుజరాత్ ముఠాకు నగర పోలీసులు చెక్ చెప్పారు. నలుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్‌లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సోమవారం తెలిపారు. సికింద్రాబాద్‌లోని పాట్ మార్కెట్‌కు చెందిన ఎం.సంపత్‌కుమార్ బంగారం వ్యాపారి. గతేడాది సెప్టెంబర్‌లో ఇతడికి ఆన్లైన్లో అహ్మదాబాద్‌కు చెందిన వావల్ సోనీగా చెప్పుకున్న వ్యక్తితో పరిచయమైంది. కొన్నాళ్లు సంప్రదింపులు జరిపిన సోనీ ఆపై తమ ప్రాంతంలో తక్కువ ధరకు బంగారం దొరుకుతుందని చెప్పాడు. ఖరీదు చేయడానికి సంపత్ ఆసక్తి చూపడంతో గుజరాత్‌లోని భుజ్ ప్రాంతానికి రమ్మని చెప్పాడు. దీంతో సంపత్ గతేడాది అక్టోబర్‌లో అక్కడకు వెళ్ళి సోనీని కలిశాడు. ఇతడికి బషీర్, తౌఫీఖ్ అనే వ్యక్తులకు పరిచయం చేసిన సోనీ... వారే బంగారం అమ్ముతారని చెప్పాడు. తొలి విడతలో అరకేజీ బంగారం ఖరీదు చేయడానికి సంపత్ ఆసక్తి చూపడంతో రూ.13 లక్షలకు బేరం కుదిరింది. ఆ డబ్బు తీసుకురావడానికి కొంత సమయం కోరిన సంపత్ హైదరాబాద్ వచ్చేశాడు. ఈ నెల 13న తన స్నేహితుడైన భరత్‌కుమార్‌తో కలిసి భుజ్ వెళ్ళిన సంపత్ రూ.13 లక్షలు వారికి చెల్లించాడు. అయితే తమ కదలికలపై కస్టమ్స్ అధికారులు కన్నేశారని చెప్పిన బషీర్, తౌఫీఖ్ బంగారం అప్పగించడానికి ఓ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మీరు సాధారణ ప్రయాణికుల మాదిరిగా బస్సుల్లో తిరుగు ప్రయాణం అవ్వాలని, తమ మనిషి అదే బస్సులో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో అదును చూసుకుని బంగారం అందిస్తాడని చెప్పారు. అందుకు అంగీకరించిన సంపత్ తన స్నేహితుడితో కలిసి భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బస్సుల్లో ప్రయాణించినా ఎవరూ బంగారం అందించలేదు. వారిని సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సీసీఎస్ స్పెషల్ టీమ్ అధికారుల సాయంతో మార్కెట్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. బషీర్‌గా నటించిన కకల్ హుస్సేన్, తౌఫీఖ్‌గా నటించిన జునేజ లతీఫ్ మహ్మద్‌లను పట్టుకున్నారు. భుజ్‌కు చెందిన వీరిద్దరూ సమీప బంధువులే. వీరి విచారణలోనే సోనీగా నటించింది అహ్మదాబాద్‌కు చెందిన గణేష్‌గా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇతడితో పాటు పరారీలో ఉన్న మరో నిందితుడు కుమార్ కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. -
రాగివైరు దొంగలకు జైలు
ఆదిలాబాద్ క్రై ం : ట్రాన్స్‌ఫార్లర్లను పగలగొట్టి అందులోని రాగివైరును చోరీ చేసిన కేసులో నలుగురు వ్యక్తులకు బుధవారం రెండు నెలల జైలు శిక్ష విధించారు. జిల్లా మొదటి అదనపు జడ్జీ కుంచాల సునీత తీర్పు వెల్లడించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి తెలిపారు. 2014లో నెలలో నిర్మల్, ఆదిలాబాద్ డివిజన్లలో అకారపు శివకుమార్, మహ్మద్ అవేజ్ఖాన్, దీప్‌సింగ్, అస్లంఖాన్‌లు పంటపొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లోని రాగివైరు దొంగతనం చేసి అమ్ముకున్నారు. ఈ రెండు డివిజన్లలో వీరిపై 35 కేసులు నమోదయ్యాయి. 2014 డిసెంబర్ 11న అప్పటి సోన్ ఎసై ్స మహేందర్ అర్ధరాత్రి వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఆటోలో రాగివైరును తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో పలు ప్రాంతాల్లో రాగి వైరుదొంగతనం చేసి అమ్ముకున్నట్లు ఒప్పుకున్నారు. అమ్మిన దుకాణాల్లోంచి 7 క్వింటాళ్ల రాగివైరును రికవరీ చేశారు. దుండగులపై నమోదైన కేసుల్లో అదనపు పీపీ ముస్కు రమణారెడ్డి సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువైనందున నేరస్తులకు రెండు నెలల జైలు శిక్ష విధించి, రాగి వైరును ఫిర్యాదుదారులకు ఇవ్వాలని మొదటి అదనపు జిల్లా జడ్జి కుంచాల సునీత తీర్పు వెల్లడించారు.