సాక్షి, హైదరాబాద్:
- వెస్ట్ మారేడ్‌పల్లిలోని అశ్వినినగర్‌కు చెందిన గౌడి శివశంకర్ పదో తరగతి మధ్యలోనే మానేశాడు. సంజీవయ్యనగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి గుగ్గిలం కార్తీక్ ఇతడి స్నేహితుడు. వీరిద్దరూ తరచూ మారేడ్‌పల్లి ప్రాంతంలో కలుసుకుంటూ మద్యం తాగేవాళ్లు. ఓ రోజు నిషా తలకెక్కడంతో అర్ధరాత్రి వేళ వాకింగ్‌కు వెళ్లి కనిపించిన వారిపై దాడి చేసి సెల్‌ఫోన్లు దోచుకుంటూ పోలీసులకు చిక్కారు.
- కొత్తపేట నివాసి ఎం.అరుణ్‌కుమార్ సికింద్రాబాద్‌లోని ఓ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో డిగ్రీ విద్యార్థి. అతడి స్నేహితుడు అభిల్ మరో విద్యాసంస్థలో ఇంటర్ చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి మౌలాలీలో ఉంటున్న మనీష్ ఉపాధ్యాయ, తుకారాంగేట్‌కు చెందిన టమాటో సంజయ్‌సింగ్ ఇంకో విద్యాసంస్థలో ఇంటర్ స్టూడెంట్స్. ఈ నలుగురూ గంజాయి తాగేందుకు నేరాలు చేస్తూ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కారు.
- మంగళ్‌హట్ ప్రాంతానికి చెందిన సునీల్‌సింగ్ విద్యార్థి. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. మూడు నెలలుగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ బుకీగా మారాడు. సెల్‌ఫోన్‌లోనే ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారానే దందా చేస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరికాడు.
ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. జల్సాల కోసం నేరాలకు పాల్పడుతున్న యువత, విద్యార్థుల వ్యవహారాలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వీరు చేస్తున్న నేరాల్లో స్నాచింగ్స్, వాహన దొంగతనాలు, చోరీలతో పాటు సైబర్ నేరాలు అధికంగా ఉంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. జీవన విధానంలో మార్పులు, సాంకేతిక విప్లవం కారణంగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్టీ అఫెన్సులకు పాల్పడి ఏటా పోలీసులకు చిక్కుతున్న వారిలో 70 శాతానికి పైగా కొత్తవారు ఉండడం గమనార్హం.
అలా మొదలై...
సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందినవారు కూడా నేరాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఈ పరిణామం పోలీసులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పేరుమోసిన దొంగలు, ముఠాలకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరిపై కన్నేసి ఉంచుతారు. అయితే కొత్తగా పుట్టుకొస్తున్న ఈ దొంగల కారణంగా కేసుల దర్యాప్తు కూడా మందకొడిగా సాగి, కొలిక్కితేవడం కష్టసాధ్యంగా మారుతోందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వారు తొలుత చిన్నాచితకా చోరీలతో ప్రారంభించి జైలుకు వెళ్లడం ద్వారా రాటుదేలుతున్నారని, ఆపై నేరాలు చేయడమే వృత్తిగా మార్చుకొని జల్సారాయుళ్లుగా బతికేస్తున్నారని కొన్ని కేస్ స్టడీస్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.
బెరుగ్గా.. భేషుగ్గా
ఇలాంటి నేరగాళ్లు తమ బలహీనతలు, వ్యసనాలతో నేరబాట పడుతున్నా తొలినాళ్లలో బెరుగ్గానే చేస్తున్నారు. ఒక నేరం చేసిన తర్వాత ఈజీ మనీకి అలవాటు పడిపోయి పట్టుబడే వరకు వరుసగా నేరాలు చేస్తున్నారు. పోలీసులకు చిక్కి జైలుకు వెళ్తున్నా చట్టాల్లోని లోపాలు, తేలిగ్గా బెయిల్ దొరుకుతున్న విధానం, తీర్పులు వెలువడడంలో జాప్యం తదితర వారు అదే బాటలో కొనసాగేలా పురిగొల్పుతున్నాయి. నివాస ప్రాంతాలు, పేర్లను తరచూ మార్చుకుంటూ భేషుగ్గా నేరాలు కొనసాగిస్తున్నారు. వీరికి సంబంధించిన పూర్తి రికార్డులు సైతం పోలీసుల వద్ద ఉండకపోవడం, మౌలిక వసతుల కొరత నేపథ్యంలో ప్రతినిత్యం నిఘా ఉంచడం కూడా సాధ్యం కాకపోవడం వీరికి కలిసొస్తోంది.
‘ప్రతీకారం’తో సైబర్ నేరాలు
ప్రాపర్టీ నేరాలు చేసే వారిలో అత్యధికులు జల్సాల కోసం చేస్తుండగా... సైబర్ నేరాలకు పాల్పడే విద్యాధికుల్లో ఎక్కువ మంది ‘ప్రతీకారం’తోనే ఆ పని చేస్తున్నారు. పాత స్నేహితులు, ప్రేమను నిరాకరించినవారు, మాజీ సంస్థలకు చెందిన ఉన్నతోద్యోగులు తదితరులపై అనేక కారణాల నేపథ్యంలో కక్ష పెంచుకుంటున్న యువకులు, విద్యాధికులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సెల్‌ఫోన్ నుంచి నెట్ కేఫ్ వరకు ఎక్కడపడితే అక్కడ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో పాటు ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ నేరాలు చేసి కటకటాల్లోకి వెళ్తున్నారు.
కారణాలు అనేకం...
యువతలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడానికి సామాజిక, ఆర్థిక, కుటుంబ పరంగా అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో విలాసాలు అనేవి ఒకప్పుడు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనం, సెల్‌ఫోన్లు, పార్టీలు కాలక్రమంలో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. గ్రామాల నుంచి నగరాలకు వస్తున్నవారు, సిటీలో నివసిస్తున్న మధ్యతరగతి వారు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒకసారి విలాసాలకు అలవాటుపడి పదేపదే అలాంటి జీవితం కోసం ఈజీమనీ వైపు మొగ్గి నేరాల బాటపడుతున్నారు. నగర యువత కూడా గర్ల్‌ఫ్రెండ్స్, స్నేహితురాళ్లతో షికార్ల కోసం, వారిని మెప్పించేలా ఖర్చులు చేయడం కోసం నేరగాళ్లుగా మారుతున్నారు.
అజమాయిషీ లేకపోవడంతో..
నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. చదువులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు అనేక మంది వలస వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి పెరిగింది. ఇలా వస్తున్న యువత తల్లిదండ్రులు, కుటుంబాలకు దూరంగా సహోద్యోగులు, మిత్రులతో కలిసో, ఒంటరిగానో జీవిస్తున్నారు. దీంతో ఏం చేసినా పట్టించుకునేవారు లేకుండాపోతున్నారు. నగరంలోనూ మారిన జీవన విధానం, చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న యువకుల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట.
Comments
Please login to add a commentAdd a comment