ఆ దొంగల రూటే సెపరేటు | these thieves route separate for the theft | Sakshi
Sakshi News home page

ఆ దొంగల రూటే సెపరేటు

Published Tue, Jan 30 2018 8:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

these thieves route separate for the theft - Sakshi

జునేజ లతీఫ్, కకల్‌ హుస్సేన్‌

సాక్షి,సిటీబ్యూరో: బంగారం వ్యాపారుల్ని ఆన్‌లైన్‌లో గుర్తిస్తారు... తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామంటూ ఎర వేస్తారు... తమ స్వస్థలాలకు రప్పించి అందినకాడికి దండుకుని మోసం చేస్తుంటారు... ఈ పంథాలో దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న గుజరాత్‌ ముఠాకు నగర పోలీసులు చెక్‌ చెప్పారు. నలుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్‌లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి సోమవారం తెలిపారు. సికింద్రాబాద్‌లోని పాట్‌ మార్కెట్‌కు చెందిన ఎం.సంపత్‌కుమార్‌ బంగారం వ్యాపారి. గతేడాది సెప్టెంబర్‌లో ఇతడికి ఆన్‌లైన్‌లో అహ్మదాబాద్‌కు చెందిన వావల్‌ సోనీగా చెప్పుకున్న వ్యక్తితో పరిచయమైంది. కొన్నాళ్లు సంప్రదింపులు జరిపిన సోనీ ఆపై తమ ప్రాంతంలో తక్కువ ధరకు బంగారం దొరుకుతుందని చెప్పాడు. ఖరీదు చేయడానికి సంపత్‌ ఆసక్తి చూపడంతో గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతానికి రమ్మని చెప్పాడు. 

దీంతో సంపత్‌ గతేడాది అక్టోబర్‌లో అక్కడకు వెళ్ళి సోనీని కలిశాడు. ఇతడికి బషీర్, తౌఫీఖ్‌ అనే వ్యక్తులకు పరిచయం చేసిన సోనీ... వారే బంగారం అమ్ముతారని చెప్పాడు. తొలి విడతలో అరకేజీ బంగారం ఖరీదు చేయడానికి సంపత్‌ ఆసక్తి చూపడంతో రూ.13 లక్షలకు బేరం కుదిరింది. ఆ డబ్బు తీసుకురావడానికి కొంత సమయం కోరిన సంపత్‌ హైదరాబాద్‌ వచ్చేశాడు. ఈ నెల 13న తన స్నేహితుడైన భరత్‌కుమార్‌తో కలిసి భుజ్‌ వెళ్ళిన సంపత్‌ రూ.13 లక్షలు వారికి చెల్లించాడు. అయితే తమ కదలికలపై కస్టమ్స్‌ అధికారులు కన్నేశారని చెప్పిన బషీర్, తౌఫీఖ్‌ బంగారం అప్పగించడానికి ఓ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మీరు సాధారణ ప్రయాణికుల మాదిరిగా బస్సుల్లో తిరుగు ప్రయాణం అవ్వాలని, తమ మనిషి అదే బస్సులో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో అదును చూసుకుని బంగారం అందిస్తాడని చెప్పారు. 

అందుకు అంగీకరించిన సంపత్‌ తన స్నేహితుడితో కలిసి భుజ్‌ నుంచి అహ్మదాబాద్‌కు, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బస్సుల్లో ప్రయాణించినా ఎవరూ బంగారం అందించలేదు. వారిని సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సీసీఎస్‌ స్పెషల్‌ టీమ్‌ అధికారుల సాయంతో మార్కెట్‌ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. బషీర్‌గా నటించిన కకల్‌ హుస్సేన్, తౌఫీఖ్‌గా నటించిన జునేజ లతీఫ్‌ మహ్మద్‌లను పట్టుకున్నారు. భుజ్‌కు చెందిన వీరిద్దరూ సమీప బంధువులే. వీరి విచారణలోనే సోనీగా నటించింది అహ్మదాబాద్‌కు చెందిన గణేష్‌గా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇతడితో పాటు పరారీలో ఉన్న మరో నిందితుడు కుమార్‌ కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement