theves
-
బండి కనిపిస్తే మాయం చేస్తారు
జియాగూడ: నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి వాహనాలను స్వాదీనం చేసుకున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డావిస్ అన్నారు. శనివారం షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో గోషామహాల్ ఏసీపీ ఆర్.సతీస్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. నగరంలోని వెస్ట్, సౌత్, ఈస్ట్, సెంట్రల్ జోన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం జరుగుతున్నాయి. దీంతో షాహినాయత్ గంజ్ పోలీసుల క్రైమ్ టీమ్ నిందితులను పట్టుకున్నారన్నారు. జహనుమాకు చెందిన అబ్దుల్ వాహిద్(63), వారసిగూడలోని మహిమూద్‌గూడకు చెందిన మహ్మద్ సోయేల్ హుల్‌హక్ (28)లు రాత్రి వేళల్లో బస్తీలలో ఇంటి బయట పార్కు చేసిన యాక్టివా ద్విచక్ర వాహనాలను నకిలీ తాళాలతో ఓపెన్ చేసి ఎత్తుకువెళ్లేవారు. వాటిని మెకానిక్ షాపులు, స్క్రాబ్ దుకాణాలలో విక్రయించే వారు. అనుమానం రాకుండా కుటుంబ సభ్యులకు వైద్యం కోసం డబ్బులు అవసరం అయ్యాయని నమ్మిస్తూ ఆధార్‌కార్డు కూడా ఇచ్చేవారు. షాహినాయత్‌గంజ్ సీ.ఐ. వై.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో డీఎస్ఐ. జి.రాజేశ్వర్ రెడ్డి, క్రైమ్ టీం సిబ్బందితో కలిసి బేగంబజార్ నుండి చంద్రాయణగుట్ట వరకు గల వివిధ దారుల్లో, బస్తీల్లో వందకు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులు దొంగిలించిన వాహనాలను స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ జోయల్ డావిస్ క్రైమ్ టీమ్‌ను అభినందించారు. -
దొంగను పట్టించిన బావి!
దంతాలపల్లి(డోర్నకల్) : బావి.. దొంగను పట్టించడం ఏమిటని ఆలోచిస్తున్నారా! ఈ సంఘటన గురువారం రాత్రి నిజంగానే జరిగింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన రైతు మెంచు మల్లయ్య తన వ్యవసాయబావి వద్ద నాటుకోళ్లు పెంచుతున్నాడు. కోళ్లను దొంగిలించేందుకు ఇదే మండలం దాట్ల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ, బోర శ్రీను గురువారం రాత్రి వచ్చారు. కాపలాగా ఉన్న రైతు మల్లయ్య అలికిడి విని వెంటనే లేవగా ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో శ్రీను, తప్పించుకోగా రఫీ సమీపంలోని వ్యవసాయ బావిలో పడిపోయాడు. అందులో నుంచి పైకి ఎక్కేందుకు అవకాశం లేకపోయింది. గ్రామస్తులు రాత్రే చూసి అతడిని పైకి లాగకుండా రాత్రంతా అందులోనే ఉంచారు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన తర్వాత రఫీని పైకి లాగి అదుపులోకి తీసుకున్నారు. కాగా రైతు మల్లయ్య ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నందీప్ పేర్కొన్నారు. -
ఇద్దరు బ్యాటరీ దొంగల అరెస్టు
కడ్తాల్(కల్వకుర్తి): గత కొంతకాలంగా జిల్లాలోని కడ్తాల్ షాద్‌నగర్‌తో పాటు, ఐజ, గద్వాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా తదితర ప్రాంతాల్లో పలు వాహనాల బ్యాటరీలు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు షాద్‌నగర్ సబ్ డివిజన్ ఏసీపీ సురేందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో షాద్‌నగర్ టౌన్ సీఐ అశోక్‌కుమార్, కడ్తాల్ ఎస్‌హెచ్‌వో సుందరయ్యతో కలిసి ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన కావేటి శ్రీనివాస్ అలియాస్ శ్రీను, జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం తప్పట్ల నర్సు గ్రామానికి చెందిన దేవరేటి తిమ్మప్ప అలియాస్ శివ స్నేహితులు. వీరిద్దరూ రాత్రి వేళల్లో నిలిపి ఉన్న వాహనాల బ్యాటరీలు చోరీ చేసి హైదరాబాద్, బుద్వేలు, రాజేంద్రర్నగర్ తదితర ప్రాంతాల్లో దాచిపెడుతున్నారు. ఇటీవల జిల్లాలోని కడ్తాల్, షాద్‌నగర్ ప్రాంతాలతో పాటు, ఐజ, గద్వాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా తదితర ప్రాంతాల్లో 80 వరకు వాహనాల బ్యాటరీలు చోరీ అయ్యాయి. ఇదిలా ఉండగా గత మార్చి 28న కడ్తాల్‌లో, 29న షాద్‌నగర్ రెండు ప్రదేశాలలో పలు వాహనాల బ్యాటరీలు మాయం కావడంతో సంబంధిత వాహనాల యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాహన తనిఖీలలో భాగంగా మంగళవారం ఉదయం కడ్తాల్ ఎస్‌హెచ్‌వో సుందరయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తలకొండపల్లి చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న టాటా ఏస్ వాహనంలో 8 బ్యాటరీలను గుర్తించిన పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేసి విచారించగా వారు బ్యాటరీల దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. పోలీసుల విచారణలో రూ.4.23లక్షల విలువ చేసే80 బ్యాటరీలను చోరీ చేసి హైదరాబాద్, బుద్వేలు, రాజేంద్రర్నగర్ తదితర ప్రాంతాల్లో దాచిపెట్టామని తెలిపారు. ఇదిలా ఉండగా రూ. 3.75 లక్షల విలువ చేసే 71బ్యాటరీలను, వివిధ ప్రాంతాలలో స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ సురేందర్ తెలిపారు. చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులలో కావేటి శ్రీనుపై గతంలో పలు పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులున్నట్లు చెప్పారు. స్వాధీన పరుచుకున్న బ్యాటరీలను కోర్టుకు సమర్పించి, నిందితులిద్దర్నీ రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బందికి ప్రశంస.. బ్యాటరీల చోరీ కేసును స్వల్ప కాలంలో ఛేదించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ సురేందర్ ప్రత్యేకంగా అభినందించారు. షాద్‌నగర్ సీఐ అశోక్‌కుమార్, కడ్తాల్ ఎస్‌హెచ్‌వో సుందరయ్యలతో పాటు, ఆమనగల్లు, కొందుర్గు, నందిగామ, తలకొండపల్లి, షాద్‌నగర్, కడ్తాల్ పోలీస్ స్టేషన్లలో క్రైమ్ డిపార్టుమెంట్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్లా, గురుప్రసాద్, శేఖర్, రవీందర్, శివకుమార్, యాదగిరిలను అభినందించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు బృందానికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల డీఎస్పీ భద్రయ్య అన్నారు. శుక్రవారం పట్టణపోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు పంచలోహ విగ్రహాల దొంగలను అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెం దిన వడ్లూరి నాగరాజు, జగిత్యాల గాంధీనగర్‌కు చెందిన మహబూబ్, ధరూర్‌కు చెందిన గడ్డం ప్రసాద్ పాతనేరస్తులు. జైలులో పరిచయమై స్నేహితులుగా మారారు. ఈనెల 22న వడ్లూరి నాగరాజు వేములవాడలో ద్విచక్రవాహనం చోరీ చేశాడు. అక్కడి నుంచి జగిత్యాలకు వచ్చి మహబూబ్‌ను కలిశాడు. ఈ నెల 23న కొడిమ్యాల మండలం నల్లగొండ నృసింహుడి ఆలయ తాళాలు పగులగొట్టి స్వామివారి కోరమీసాలు, రెండు చైన్లు, ఇత్తడి గంటలు, దీపాంతాలు చోరీ చేశారు. అదేరోజు జగిత్యాలకు వచ్చి గడ్డం రమేష్‌ను కలిశారు. ముగ్గురు కలిసి రాంబజార్‌లో ఓ ద్విచక్రవాహనం చోరీ చేశారు. రాత్రి కోరుట్లకు వెళ్లి సాయిరాంపురాలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు దొంగిలించారు. శుక్రవారం పట్టణశివారులోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించగా దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ ప్రకాష్, ఎస్సై ప్రసాద్ ఉన్నారు. -
ఆలయంలో దొంగలుపడ్డారు!
పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయంలో దొంగలుపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి నాలుగు హస్తాలు, ఐదు కిలోల అమ్మవారి కవచం, రెండు కిరీటాలు, ఒక పంచలోహ కిరీటం, రెండు కిలోల పంచలోహ విగ్రహం, అమ్మవారి మంగళసూత్రం, హుండీలను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ప్రాథమిక అంచనా. బుధవారం రాత్రి 12 గంటల వరకు అమ్మవారి ఆలంకరణ కోపం పూలను సిద్ధం చేస్తూ పూజారి సహా భక్తులు ఆలయంలోనే గడిపారు. ఆ తరువాత ఆలయ తలుపులు మూసివేసి పూజారి, భక్తులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తరువాత దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించి అభరణాలను అపహరించుకుపోయారు. సమాచారం క్షణాల్లో అందరికీ తెలిసిపోవడంతో పోలీసులతో పాటు స్థానికులు ఆలయ పరిసర ప్రాంతాల్లో గాలించారు. పుట్టపర్తికి సమీపాన కర్ణాటక నాగేపల్లి వద్ద గల కంకర మిషన్ వద్ద ముళ్ల పొదల్లో అమ్మవారి ఆలయం హుండీ పడి ఉండడాన్ని అక్కడి ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి పోలీసులు డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి సహా క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్ రంగంలోకి దిగాయి. ఆధారాలు సేకరించారు. ఆలయ సమీపంలోని ఎస్సీ బాలికల వసతి గృహం ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమరా పుటేజీలను పరిశీలించగా అంబాసిడర్ కారులో దుండగులు వచ్చినట్లు, వీపునకు లగేజీ బ్యాగు ధరించి ఉన్నట్లు కనుగొన్నారు. అమ్మవారి ఆలయంలో అభరణాలు చోరీ చేసిన అనంతరం అక్కడికి వచ్చి ఆ తరువాత కారులో పరారైనట్లు గుర్తించారు. దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు డీఎస్పీ తెలిపారు. -
అర్ధరాత్రి హైడ్రామాలో... దొంగలు ఎలా దొరికారంటే..
నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీనగర్‌లో మహారాష్ట్రకు చెందిన పార్దీ దొంగల ముఠా హల్చల్ చేసింది. దొంగతనానికి యత్నింస్తుండగా గమనించిన స్థానికుడు చాకచక్యంగా వ్యవహరించడంతో దొంగలు పట్టుబడ్డారు. ఎనిమిది మంది దొంగల ముఠా దొంగతనానికి రాగా, పోలీసులకు నలుగురు పట్టుబడగా, మరో నలుగురు పారిపోయారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. చివరకు పోలీసుల చేతికి దొంగలు చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలం సృష్టించిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రకు చెందిన 8 మంది పార్దీ దొంగల ముఠా గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మహాలక్ష్మీనగర్ రోడ్‌నం. 1 బస్వాగార్డెన్ ఫంక్షన్‌హాల్ వెనుక ఓ ఇంట్లో దొంగతనానికి యత్నించారు. దొంగలు బనియన్లు, నిక్కర్లు వేసుకుని, చెప్పుల శబ్ధం రాకుండా వచ్చారు. దొంగలు టార్చ్లైట్తో బెడ్రూం కిటికీలో నుంచి చూస్తుండగా లోపల నిద్రిస్తున్న ఓ యువతి టార్చ్‌లైట్ వెలుతురు చూసి భయంతో తండ్రికి తెలిపింది. ఆయన వెంటనే కిటికి వద్దకు ఎవరంటూ గట్టిగా అరవడంతో దొంగలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ ఇంటికి దగ్గరే ఉన్న రిటైర్డ్ విద్యుత్‌శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీహరి ఇంట్లో దొంగతనానికి యత్నించారు. శ్రీహరి రెండు నెలల క్రితం అమెరికాలోని కొడుకు వద్దకు వెళ్లారు. ఆ ఇంట్లో ఆయన కూతురు, ఆమె భర్త, పాప ఉంటున్నారు. బుధవారం రాత్రి వారు మాస్టర్ బెడ్రూంలో కాకుండా మరో బెడ్రూంలో పడుకున్నారు. అయితే మాస్టర్ బెడ్రూం కిటికీ తలుపులు తెరిచి ఉండడడంతో దొంగలు ఇనుప గ్రిల్‌ను తొలగిస్తుండగా ఇంటి వెనకవైపు ఇంట్లో ఉండే ఒకరు బయట నుంచి శబ్దం వస్తుండడాన్ని గమనించాడు. కిటికిలో నుంచి చూడగా దొంగలు గ్రిల్‌ను తొలగించడం కనిపించింది. వెంటనే విషయాన్ని నాల్గో టౌన్ పోలీసులకు తెలిపాడు. అనంతరం ఇంటి చుట్టుపక్కల వారందరికి ఫోన్లో సమాచారం ఇచ్చి అలర్టుగా ఉండాలని, బయటకు రావాలని చెప్పాడు. 15 నిమిషాలైనా పోలీసులు రాకపోవడంతో కుమారుడిని లేపి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులను తీసుకురావాలని సూచించాడు. దాంతో కుమారుడు శబ్ధం రాకుండా బైక్‌ను గేట్ బయటకు తీసి కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లి బైక్‌ను స్టార్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయాన్ని తెలిపాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులను రప్పించారు. అప్పటి వరకు దొంగలు గ్రిల్‌ను తొలగించే పనిలో ఉన్నారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటి చుట్టూ భద్రత ఏర్పాటు చేశారు. దొంగలు గ్రిల్‌ను తొలగించి ఇంట్లోకి ప్రవేశిస్తుండగా దొంగల వద్దకు పరుగెత్తుకు వచ్చారు. దీంతో దొంగలు పారిపోయేందుకు యత్నించగా ఇద్దరు గోడదూకుతూ దొరికిపోయారు. ఇంటి వెనుక చెట్ల పొదల్లో దాక్కున్న మరొక దొంగను సైతం పట్టుకున్నారు. ఇంకో దొంగ కొద్ది దూరంలో ఓ ఇంటి వద్ద వాచ్మెన్ల నటిస్తూ దుప్పటి కప్పుకుని పడుకోగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. మరో నలుగురు దొంగలు పోలీసుల చేతికి చిక్కకుండా పారిపోయారు. దొంగలను పట్టుకునే క్రమంలో సంజీవ్, మరో కానిస్టేబుల్ ఇద్దరికి గాయాలయ్యాయి. డీఎస్పీ ఆనంద్‌కుమార్, నగర సీఐ నర్సింగ్‌యాదవ్, ఎస్సైలు శంకర్, ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చాకచక్యంగా వ్యవహరించడంతోనే.. దొంగల ముఠా శ్రీహరి ఇంట్లో దొంగతనానికి యత్నిస్తున్న విషయాన్ని గమనించిన స్థానికుడు కంగారు పడకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో దొంగలు పోలీసుల చేతికి చిక్కారు. దొంగలను చూసిన ఆయన ఒకవేళ గట్టిగా కేకలు పెట్టి ఉంటే దొంగలు అక్కడి నుంచి పారిపోయేవారు. కానీ ఆయన అలా చేయకుండా పోలీసులకు, ఇంటిచుట్టు పక్కల వారికి దొంగలు వచ్చిన విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపారు. కొంతమంది స్థానికులు, పోలీసులు కలిసి ముఠాలోని నలుగురిని పట్టుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన సదరు వ్యక్తి, అతని కొడుకులను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. సదరు వ్యక్తికి పోలీస్‌శాఖ తరపున రివార్డు అందజేయనున్నట్లు తెలిసింది. -
ప్రొద్దుటూరులో రెండు దుకాణాల్లో చోరీ
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక పప్పుల బజార్‌లోని రెండు దుకాణాల్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు వర్రా ప్రభాకర్, చాడబోయిన కొండయ్యలు గత కొన్నేళ్ల నుంచి పప్పుల వ్యాపారం చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగలు వారి దుకాణాలకు వేసిన తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ప్రభాకర్ దుకాణంలో రూ.28 వేలు, కొండయ్య దుకాణంలో రూ.25 వేలు దోచుకొని వెళ్లారు. తర్వాత కొద్ది సేపటికే ఆ వీధిలో తిరుగున్న కాపలాదారుడు దుకాణ తలుపులు తెరచి ఉండటం చూసి చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో అతను వెంటనే దుకాణ దారులకు, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంటనే నిందితుల కోసం పట్టణ మంతా పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దుకాణ యజమానులు ప్రభాకర్, కొండయ్యలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.