అర్ధరాత్రి హైడ్రామాలో... దొంగలు ఎలా దొరికారంటే.. | mid night hydrama | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి హైడ్రామాలో... దొంగలు ఎలా దొరికారంటే..

Published Fri, Aug 5 2016 9:49 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

అర్ధరాత్రి హైడ్రామాలో... దొంగలు ఎలా దొరికారంటే.. - Sakshi

అర్ధరాత్రి హైడ్రామాలో... దొంగలు ఎలా దొరికారంటే..

నిజామాబాద్‌: జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీనగర్‌లో మహారాష్ట్రకు చెందిన పార్దీ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. దొంగతనానికి యత్నింస్తుండగా గమనించిన స్థానికుడు చాకచక్యంగా వ్యవహరించడంతో దొంగలు పట్టుబడ్డారు. ఎనిమిది మంది దొంగల ముఠా దొంగతనానికి రాగా, పోలీసులకు నలుగురు పట్టుబడగా, మరో నలుగురు పారిపోయారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. చివరకు పోలీసుల చేతికి దొంగలు చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లా కేంద్రంలోని నాల్గో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సంచలం సృష్టించిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రకు చెందిన 8 మంది పార్దీ దొంగల ముఠా గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మహాలక్ష్మీనగర్‌ రోడ్‌నం. 1 బస్వాగార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌ వెనుక ఓ ఇంట్లో దొంగతనానికి యత్నించారు. దొంగలు బనియన్లు, నిక్కర్లు వేసుకుని, చెప్పుల శబ్ధం రాకుండా వచ్చారు. దొంగలు టార్చ్‌లైట్‌తో బెడ్‌రూం కిటికీలో నుంచి చూస్తుండగా లోపల నిద్రిస్తున్న ఓ యువతి టార్చ్‌లైట్‌ వెలుతురు చూసి భయంతో తండ్రికి తెలిపింది. ఆయన వెంటనే కిటికి వద్దకు ఎవరంటూ గట్టిగా అరవడంతో దొంగలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ ఇంటికి దగ్గరే ఉన్న రిటైర్డ్‌ విద్యుత్‌శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ శ్రీహరి ఇంట్లో దొంగతనానికి యత్నించారు.

శ్రీహరి రెండు నెలల క్రితం అమెరికాలోని కొడుకు వద్దకు వెళ్లారు. ఆ ఇంట్లో ఆయన కూతురు, ఆమె భర్త, పాప ఉంటున్నారు. బుధవారం రాత్రి వారు మాస్టర్‌ బెడ్‌రూంలో కాకుండా మరో బెడ్‌రూంలో పడుకున్నారు. అయితే మాస్టర్‌ బెడ్‌రూం కిటికీ తలుపులు తెరిచి ఉండడడంతో దొంగలు ఇనుప గ్రిల్‌ను తొలగిస్తుండగా ఇంటి వెనకవైపు ఇంట్లో ఉండే ఒకరు బయట నుంచి శబ్దం వస్తుండడాన్ని గమనించాడు. కిటికిలో నుంచి చూడగా దొంగలు గ్రిల్‌ను తొలగించడం కనిపించింది. వెంటనే విషయాన్ని నాల్గో టౌన్‌ పోలీసులకు తెలిపాడు. అనంతరం ఇంటి చుట్టుపక్కల వారందరికి ఫోన్‌లో సమాచారం ఇచ్చి అలర్టుగా ఉండాలని, బయటకు రావాలని చెప్పాడు.

15 నిమిషాలైనా పోలీసులు రాకపోవడంతో కుమారుడిని లేపి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులను తీసుకురావాలని సూచించాడు. దాంతో కుమారుడు శబ్ధం రాకుండా బైక్‌ను గేట్‌ బయటకు తీసి కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లి బైక్‌ను స్టార్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయాన్ని తెలిపాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్‌ పార్టీ పోలీసులను రప్పించారు. అప్పటి వరకు దొంగలు గ్రిల్‌ను తొలగించే పనిలో ఉన్నారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటి చుట్టూ భద్రత ఏర్పాటు చేశారు. దొంగలు గ్రిల్‌ను తొలగించి ఇంట్లోకి ప్రవేశిస్తుండగా దొంగల వద్దకు పరుగెత్తుకు వచ్చారు. దీంతో దొంగలు పారిపోయేందుకు యత్నించగా ఇద్దరు గోడదూకుతూ దొరికిపోయారు. ఇంటి వెనుక చెట్ల పొదల్లో దాక్కున్న మరొక దొంగను సైతం పట్టుకున్నారు. ఇంకో దొంగ కొద్ది దూరంలో ఓ ఇంటి వద్ద వాచ్‌మెన్‌ల నటిస్తూ దుప్పటి కప్పుకుని పడుకోగా పోలీసులు అతడిని పట్టుకున్నారు.

మరో నలుగురు దొంగలు పోలీసుల చేతికి చిక్కకుండా పారిపోయారు. దొంగలను పట్టుకునే క్రమంలో సంజీవ్, మరో కానిస్టేబుల్‌ ఇద్దరికి గాయాలయ్యాయి. డీఎస్పీ ఆనంద్‌కుమార్, నగర సీఐ నర్సింగ్‌యాదవ్, ఎస్సైలు శంకర్, ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
 
చాకచక్యంగా వ్యవహరించడంతోనే..
దొంగల ముఠా శ్రీహరి ఇంట్లో దొంగతనానికి యత్నిస్తున్న విషయాన్ని గమనించిన స్థానికుడు కంగారు పడకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో దొంగలు పోలీసుల చేతికి చిక్కారు. దొంగలను చూసిన ఆయన ఒకవేళ గట్టిగా కేకలు పెట్టి ఉంటే దొంగలు అక్కడి నుంచి పారిపోయేవారు. కానీ ఆయన అలా చేయకుండా పోలీసులకు, ఇంటిచుట్టు పక్కల వారికి దొంగలు వచ్చిన విషయాన్ని ఫోన్‌ ద్వారా తెలిపారు. కొంతమంది స్థానికులు, పోలీసులు కలిసి ముఠాలోని నలుగురిని పట్టుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన సదరు వ్యక్తి, అతని కొడుకులను పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు. సదరు వ్యక్తికి పోలీస్‌శాఖ తరపున రివార్డు అందజేయనున్నట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement