pardhi batch
-
మహిళపై ఆగంతకుల దాడి
సారవకోట: మండలంలోని మూగుపురం గ్రామానికి చెందిన బి.ఆదిలక్ష్మిపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి తన కుమార్తెతో కలసి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేందుకు ప్రయత్నించారని, పక్కనే ఉన్న కుమార్తె కేకలు వేయడంతో వారు పారిపోయారనిట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆదిలక్ష్మిని 108 వాహనంలో టెక్కలి ఆస్పత్రికి తరలించి పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పార్ధి గ్యాంగ్‌పై వస్తున్న వదంతుల్లో భాగంగా కొంతమంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారే తప్ప వాస్తవాలు లేవన్నారు. -
పార్థీ గ్యాంగ్ ముసుగులో పాతకక్షలు
‘అదిగో పులి... అంటే ఇదిగో తోక’ అన్నట్టు పుకార్ల సంస్కృతి విస్తరిస్తోంది. జిల్లాలో రోజూ ఏదో ఒకచోట పిల్లల్ని ఎత్తుకెళ్లిన ముఠా సంచరిస్తోందంటూ అబద్ధపు ప్రచారం సాగుతోంది. భాష తెలియని అపరిచితులు జనం ఆగ్రహానికి బలైపోతున్నారు. అమాయకులు... మతిస్థిమితం కోల్పోయేవారు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో ఎలాంటి గ్యాంగ్ లేదంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నా... దాడులు ఆగడంలేదు. ఈ పరిస్థితులు ఎటు దారితీస్తున్నాయన్నది అంతుచిక్కడంలేదు. సాక్షిప్రతినిధి, విజయనగరం : భోగాపురం మండలం, మహారాజుపేట వద్ద గత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. జిల్లాలో పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగులు తిరుగుతున్నాయని భయపడి పిల్లాడ్ని అమ్మమ్మ వాళ్లింట్లో జాగ్రత్తగా దాచిపెట్టడానికి తండ్రి తీసుకువెళుతుండగా ఈ ఘోరం జరిగింది. పూసపాటిరేగ మండలం, చింతపల్లి గ్రామంలో బిక్షాటనకు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో దొంగతనానికి వచ్చాడని భావించిన గ్రామస్తులు కొందరు అతనిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు అతను చనిపోయాడు. నెల్లిమర్ల జూట్ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పరాయి రాష్ట్రానికి చెందినవారిని అనుమానంతో స్థానికులు పట్టుకున్నారు. విషయం తెలుసుకుని వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారించగా వారు పరిశ్రమలో ఉద్యోగులని తేలింది.ఇలాంటి సంఘటనలు గడచిన ఐదు రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తూనే ఉన్నాయి. ఈ దాడులకు కారణం జిల్లా ప్రజల్లో నెలకొన్న అనవసర భయాలే. జిల్లాలో పార్థీ గ్యాంగులు, చెడ్డీ గ్యాంగులుతిరుగుతున్నాయని, బీహార్ దొంగల ముఠావ చ్చిందని, చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి చంపి అవయవాలు అమ్ముకుంటున్నారని, పెద్దవాళ్ల పీకలు కోసేస్తున్నారని, రకరకాల ప్రచారం విస్తరిస్తోంది. ఐదు రోజులుగా సాగుతున్న ఇలాంటి పరిణామాలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడంతో పా టు అమాయకులను శిక్షించేలా చేస్తున్నాయి. తప్పుచేసిందెవరో తెలియకుండా కొత్తవారు కనిపి స్తే చాలు చావగొట్టే పరిస్థితులు నెలకొన్నాయి. కొంప ముంచిన సామాజిక మాధ్యమాలు ఈ అనర్థాలకు ప్రధాన కారణం కొందరు పనీపాటా లేని వ్యక్తులు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో ఎక్కడివో ఫొటోలు, వీడియోలు మన దగ్గరే జరిగినట్లు భ్రమింప జేస్తూ మెసేజ్‌లు పోస్ట్ చేయడమే. అవి నిజమైనవో కావో తెలుసుకోకుండానే మరికొందరు వాటిని షేర్ చేస్తుండటం వల్ల తక్కువ సమయంలోనే జిల్లా అంతటా ఈ ప్రచారం పాకేసింది. వెం టనే తేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు అలాం టి ప్రచారాలు నమ్మవద్దని ప్రకటనలు చేసినా వారి మాటలను పట్టించుకోకుండా ఇంకా అమాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రచారాన్ని కొందరు వ్యక్తులు తమ పాత కక్షలు తీర్చుకోవడానికి అవకాశంగా కూడా తీసుకుంటున్నారు. గరుగుబిల్లి మండలం కొత్తూరులో ఓ వ్యక్తి బహిర్భూమికి వెళితే గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి అతనిని గాయపరిచారు. నెపం మాత్రం గ్యాంగులపై తోసేశారు. అమాయకులు బలి ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలో ఉపాధి, వ్యాపారం, జీవనం కోసం ఎంతోమంది వస్తుంటారు. అలా వచ్చినవారే నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు కార్మికులుగా కూడా పనిచేస్తున్నారు. మంగళవారం వారిని కూడా అనుమానించి స్థానికులు పోలీసులకు అప్పగించారు. వారు తమ కార్మికులేనని మిల్లు యజమాని చెప్పడంతో విడిచిపెట్టారు. గుమ్మలక్ష్మీపురం మండలం అల్లువాడలో దొంగలనే నెపంతో కొందరిని పోలీసుల వద్దకు తీసుకువచ్చారు. వారిని విచారిస్తే బొమ్మలు అమ్ముకునేవారని తేలింది. నాలుగు రోజుల క్రితం విజయనగరంలో ఇద్దరు మతిస్థిమితం లేని వారిని అనుమానించి పోలీసులే స్టేషన్‌కు తీసుకుపోయి విచారించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రోజూ రెండు మూడు సంఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు జనం భయంతో వణికిపోతున్నారు. గ్రామాల్లో యువకులు రాత్రి సమయాల్లో కర్రలు, మారణాయుధాలతో గస్తీ తిరుగుతూ కాపలా కాస్తున్నారు. ఇంకోవైపు పోలీసులు వేరే పనులన్నీ మానుకుని జనానికి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. ఆటోల్లో మైకులు పెట్టి గ్యాంగులేమీ లేవంటూ ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు పంచిపెడుతూ భయపడొద్దని చెబుతున్నారు. అమాయకులపై దాడులు వద్దు మతిస్థిమితం లేనివాళ్లు, అమాయకులపై దాడులు చేయడం సరికాదు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. ఇప్పటికే జిల్లా ఎస్పీ పలుమార్లు ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి మార్పు రాకపోవడం విచారకరం. ప్రజలు కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మానవహక్కులకు భంగం కలిగించరాదు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వండి. – ఎస్.అచ్చిరెడ్డి, మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విజయనగరం పుకార్లు చేసే వారిపై చర్యలు తప్పవు పుకార్లను వైరల్ చేసే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. ఇప్పటికే అదుపులో ఉన్న వ్యక్తుల గురించి నెల్లిమర్ల పోలీసులు విచారణ చేపట్టారు. వారంతా నెల్లిమర్ల జ్యూట్‌మిల్లులో పనిచేస్తున్నారన్నారని మిల్లు మేనేజరు నిర్థారించారు. తెలియని విషయాలను అనవసరంగా ఇతరులకు పంపి, వారిని భయబ్రాంతులకు గురిచేయవద్దు. అనుమానితులు ఎవరైనా కనబడితే వారిపై భౌతిక దాడులకు పాల్పడకుండా, పోలీసులకు అప్పగించాలి. మన ప్రాంతాల్లో ఎటువంటి గ్యాంగులు సంచరించడంలేదు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. పుకార్లు పుట్టించే వారిపై ఇప్పటికే నిఘా ఉంచాం. – జి.పాలరాజు, ఎస్పీ, విజయనగరం. ప్రజల్లో అవగాహన పెరగాలి ప్రజలు సాధారణ విషయాలను నమ్మకపోయినా, ఇటువంటి రూమర్లను బాగా నమ్ముతారు. సామాజిక వెబ్సైట్లలో ఇటువంటి పోస్టింగులు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి. మతిస్థిమితం లేని వాడు ఏమీ మాట్లడలేడు. సమాజంలో వాళ్లే ఒక రకంగా దురదృష్టవంతులు. ఎటువంటి ఆసరా లేక అలా తిరుగుతుంటారు. భాషరాదు, సరిగ్గాచెప్పలేరు. విజయనగరంలో ఎక్కువ మతిస్ధిమితం లేనివారు మన భాష రానివారే ఉన్నారు. ఒడిశా, కలకత్తా, బీహార్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఉన్నారు. ప్రజలు వారిని కాసేపు పరిశీలించాలి. ఏమైనా సందేహం కలిగితే వెంటనే పోలీసులకు అప్పగించాలి. కొట్టే అధికారం ఎవరికీ లేదు. మారణాయుదాలు గానీ ఉంటే తీసుకుని, పెనుగులాడడం సరికాదు. – డాక్టర్ ఎన్.వి.ఎస్.సూర్యనారాయణ, సైకాలజిస్ట్, విజయనగరం -
పార్థి గ్యాంగ్ తిరుగుతుందట నిజమేనా సారూ?
హుస్నాబాద్ మెదక్ : సారూ మా పిల్లలు పదిలమేనా?, పార్థి గ్యాగ్ తిరుతుందంట నిజమేనా? అని హుస్నాబాద్ ఎల్లం బజార్‌కు చెందిన ఓ మహిళ కార్డున్ సెర్చ్ పర్యవేక్షించడానికి వచ్చిన సీపీ జోయల్ డేవిస్ ఎదుట తన భయం వ్యక్తం చేసింది. గ్రామాల్లో పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది నిజమేనా సారు? గుంపుల కొద్ది పోలీసులు వస్తే భయమైతాంది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. స్పందించిన సీపీ జోయల్ డేవీస్ అదేమి లేదమ్మా అలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. మీ ఫోన్లలో వాట్సాప్‌కు వచ్చిన ఫొటోలు ఏమైనా ఉన్నాయా అని సదరు మహిళను ప్రశ్నించారు. తమ వద్ద ఫొటోలు లేవని అందరు అనుకుంటున్నారని ఆమె బదులిచ్చింది. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లంబజార్‌లో సోమవారం ఉదయం పోలీసులు కార్డూన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పిల్లలను ఎత్తుకు పోయేందుకు పార్థి గ్యాంగ్ వంటి ముఠాలు, నేరగాళ్లు, దొంగలు తిరుగుతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అలాంటి సమాచారం, ఆధారాలు పోలీస్‌ల వద్ద లేవని స్థానిక మహిళలకు ధైర్యం చెప్పారు. ఇలాంటి ప్రచారాలను జిల్లా ప్రజలు నమ్మొద్దని సూచించారు. మీ రక్షణకు మేము ఉన్నామని, నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని భరోసానిచ్చారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ మా పోలీసుల బాధ్యత అని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని అనుమానిత ప్రదేశాలు, వ్యక్తులపై మా ప్రత్యేక పోలీస్‌ల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. సీపీ వెంట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ మహేందర్, సీఐలు శ్రీనివాస్‌జీ, రఘు, ఎస్ఐ సుధాకర్ ఉన్నారు. -
మరో ‘పార్థీ’ అనుమానితుడు పట్టివేత
దర్శి: పట్టణంలోని సందువారిపాలెంలో పిల్లలను ఎత్తుకెళ్లే పార్థీ ముఠాకు చెందిన వ్యక్తిగా అని అనుమానించిన వ్యక్తిని స్థానికులు తాళ్లతో బంధించి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. సందువారి పాలెంలో జక్కా శ్రీను నివాసంలోకి వెళ్లి ఐదేళ్ల బాలుడిని చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు రమ్మని తీసుకువెళుతుండగా చుట్టు పక్కల నివాసాల వారు చూసి ఎవరని ప్రశ్నించారు. కానీ అతను సమాధానం చెప్పలేదు. దీంతో స్థానికులు దేహశుద్ధి చేసి కట్టివేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి అప్పజెప్పారు. తనను ఆ వ్యక్తి రమ్మని చెప్పాడంటూ బాలుడు పోలీసులతో చెప్పాడు. అయితే పట్టుబడ్డ వ్యక్తి గడ్డం పెంచుకుని భయానకంగా కనిపిస్తున్నాడు. పోలీసులు ప్రశ్నించగా తన పేరు శీతాకాలం సీతారాముడని, పశ్చిమగోదావరి జిల్లా అని చెప్తున్నాడు. తమలాంటి వాళ్లు 3 వేల మంది ఉన్నామని పిచ్చిగా సమాధానం చెప్తున్నాడు. దీంతో మతి స్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులో ఉంచుకుని విచారిస్తున్నారు. ఆవ్యక్తి గత వారం రోజులుగా దర్శి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. ఎవరు మంచి వారో..ఎవరు చెడ్డవారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. -
అర్ధరాత్రి హైడ్రామాలో... దొంగలు ఎలా దొరికారంటే..
నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీనగర్‌లో మహారాష్ట్రకు చెందిన పార్దీ దొంగల ముఠా హల్చల్ చేసింది. దొంగతనానికి యత్నింస్తుండగా గమనించిన స్థానికుడు చాకచక్యంగా వ్యవహరించడంతో దొంగలు పట్టుబడ్డారు. ఎనిమిది మంది దొంగల ముఠా దొంగతనానికి రాగా, పోలీసులకు నలుగురు పట్టుబడగా, మరో నలుగురు పారిపోయారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. చివరకు పోలీసుల చేతికి దొంగలు చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలం సృష్టించిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రకు చెందిన 8 మంది పార్దీ దొంగల ముఠా గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మహాలక్ష్మీనగర్ రోడ్‌నం. 1 బస్వాగార్డెన్ ఫంక్షన్‌హాల్ వెనుక ఓ ఇంట్లో దొంగతనానికి యత్నించారు. దొంగలు బనియన్లు, నిక్కర్లు వేసుకుని, చెప్పుల శబ్ధం రాకుండా వచ్చారు. దొంగలు టార్చ్లైట్తో బెడ్రూం కిటికీలో నుంచి చూస్తుండగా లోపల నిద్రిస్తున్న ఓ యువతి టార్చ్‌లైట్ వెలుతురు చూసి భయంతో తండ్రికి తెలిపింది. ఆయన వెంటనే కిటికి వద్దకు ఎవరంటూ గట్టిగా అరవడంతో దొంగలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ ఇంటికి దగ్గరే ఉన్న రిటైర్డ్ విద్యుత్‌శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీహరి ఇంట్లో దొంగతనానికి యత్నించారు. శ్రీహరి రెండు నెలల క్రితం అమెరికాలోని కొడుకు వద్దకు వెళ్లారు. ఆ ఇంట్లో ఆయన కూతురు, ఆమె భర్త, పాప ఉంటున్నారు. బుధవారం రాత్రి వారు మాస్టర్ బెడ్రూంలో కాకుండా మరో బెడ్రూంలో పడుకున్నారు. అయితే మాస్టర్ బెడ్రూం కిటికీ తలుపులు తెరిచి ఉండడడంతో దొంగలు ఇనుప గ్రిల్‌ను తొలగిస్తుండగా ఇంటి వెనకవైపు ఇంట్లో ఉండే ఒకరు బయట నుంచి శబ్దం వస్తుండడాన్ని గమనించాడు. కిటికిలో నుంచి చూడగా దొంగలు గ్రిల్‌ను తొలగించడం కనిపించింది. వెంటనే విషయాన్ని నాల్గో టౌన్ పోలీసులకు తెలిపాడు. అనంతరం ఇంటి చుట్టుపక్కల వారందరికి ఫోన్లో సమాచారం ఇచ్చి అలర్టుగా ఉండాలని, బయటకు రావాలని చెప్పాడు. 15 నిమిషాలైనా పోలీసులు రాకపోవడంతో కుమారుడిని లేపి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులను తీసుకురావాలని సూచించాడు. దాంతో కుమారుడు శబ్ధం రాకుండా బైక్‌ను గేట్ బయటకు తీసి కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లి బైక్‌ను స్టార్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయాన్ని తెలిపాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులను రప్పించారు. అప్పటి వరకు దొంగలు గ్రిల్‌ను తొలగించే పనిలో ఉన్నారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటి చుట్టూ భద్రత ఏర్పాటు చేశారు. దొంగలు గ్రిల్‌ను తొలగించి ఇంట్లోకి ప్రవేశిస్తుండగా దొంగల వద్దకు పరుగెత్తుకు వచ్చారు. దీంతో దొంగలు పారిపోయేందుకు యత్నించగా ఇద్దరు గోడదూకుతూ దొరికిపోయారు. ఇంటి వెనుక చెట్ల పొదల్లో దాక్కున్న మరొక దొంగను సైతం పట్టుకున్నారు. ఇంకో దొంగ కొద్ది దూరంలో ఓ ఇంటి వద్ద వాచ్మెన్ల నటిస్తూ దుప్పటి కప్పుకుని పడుకోగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. మరో నలుగురు దొంగలు పోలీసుల చేతికి చిక్కకుండా పారిపోయారు. దొంగలను పట్టుకునే క్రమంలో సంజీవ్, మరో కానిస్టేబుల్ ఇద్దరికి గాయాలయ్యాయి. డీఎస్పీ ఆనంద్‌కుమార్, నగర సీఐ నర్సింగ్‌యాదవ్, ఎస్సైలు శంకర్, ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చాకచక్యంగా వ్యవహరించడంతోనే.. దొంగల ముఠా శ్రీహరి ఇంట్లో దొంగతనానికి యత్నిస్తున్న విషయాన్ని గమనించిన స్థానికుడు కంగారు పడకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో దొంగలు పోలీసుల చేతికి చిక్కారు. దొంగలను చూసిన ఆయన ఒకవేళ గట్టిగా కేకలు పెట్టి ఉంటే దొంగలు అక్కడి నుంచి పారిపోయేవారు. కానీ ఆయన అలా చేయకుండా పోలీసులకు, ఇంటిచుట్టు పక్కల వారికి దొంగలు వచ్చిన విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపారు. కొంతమంది స్థానికులు, పోలీసులు కలిసి ముఠాలోని నలుగురిని పట్టుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన సదరు వ్యక్తి, అతని కొడుకులను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. సదరు వ్యక్తికి పోలీస్‌శాఖ తరపున రివార్డు అందజేయనున్నట్లు తెలిసింది.