దర్శి: పట్టణంలోని సందువారిపాలెంలో పిల్లలను ఎత్తుకెళ్లే పార్థీ ముఠాకు చెందిన వ్యక్తిగా అని అనుమానించిన వ్యక్తిని స్థానికులు తాళ్లతో బంధించి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. సందువారి పాలెంలో జక్కా శ్రీను నివాసంలోకి వెళ్లి ఐదేళ్ల బాలుడిని చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు రమ్మని తీసుకువెళుతుండగా చుట్టు పక్కల నివాసాల వారు చూసి ఎవరని ప్రశ్నించారు. కానీ అతను సమాధానం చెప్పలేదు. దీంతో స్థానికులు దేహశుద్ధి చేసి కట్టివేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి అప్పజెప్పారు. తనను ఆ వ్యక్తి రమ్మని చెప్పాడంటూ బాలుడు పోలీసులతో చెప్పాడు.
అయితే పట్టుబడ్డ వ్యక్తి గడ్డం పెంచుకుని భయానకంగా కనిపిస్తున్నాడు. పోలీసులు ప్రశ్నించగా తన పేరు శీతాకాలం సీతారాముడని, పశ్చిమగోదావరి జిల్లా అని చెప్తున్నాడు. తమలాంటి వాళ్లు 3 వేల మంది ఉన్నామని పిచ్చిగా సమాధానం చెప్తున్నాడు. దీంతో మతి స్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులో ఉంచుకుని విచారిస్తున్నారు. ఆవ్యక్తి గత వారం రోజులుగా దర్శి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. ఎవరు మంచి వారో..ఎవరు చెడ్డవారో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment