ఆలయంలో దొంగలుపడ్డారు!
పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయంలో దొంగలుపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి నాలుగు హస్తాలు, ఐదు కిలోల అమ్మవారి కవచం, రెండు కిరీటాలు, ఒక పంచలోహ కిరీటం, రెండు కిలోల పంచలోహ విగ్రహం, అమ్మవారి మంగళసూత్రం, హుండీలను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ప్రాథమిక అంచనా. బుధవారం రాత్రి 12 గంటల వరకు అమ్మవారి ఆలంకరణ కోపం పూలను సిద్ధం చేస్తూ పూజారి సహా భక్తులు ఆలయంలోనే గడిపారు.
ఆ తరువాత ఆలయ తలుపులు మూసివేసి పూజారి, భక్తులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తరువాత దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించి అభరణాలను అపహరించుకుపోయారు. సమాచారం క్షణాల్లో అందరికీ తెలిసిపోవడంతో పోలీసులతో పాటు స్థానికులు ఆలయ పరిసర ప్రాంతాల్లో గాలించారు. పుట్టపర్తికి సమీపాన కర్ణాటక నాగేపల్లి వద్ద గల కంకర మిషన్ వద్ద ముళ్ల పొదల్లో అమ్మవారి ఆలయం హుండీ పడి ఉండడాన్ని అక్కడి ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి పోలీసులు
డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి సహా క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్ రంగంలోకి దిగాయి. ఆధారాలు సేకరించారు. ఆలయ సమీపంలోని ఎస్సీ బాలికల వసతి గృహం ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమరా పుటేజీలను పరిశీలించగా అంబాసిడర్ కారులో దుండగులు వచ్చినట్లు, వీపునకు లగేజీ బ్యాగు ధరించి ఉన్నట్లు కనుగొన్నారు. అమ్మవారి ఆలయంలో అభరణాలు చోరీ చేసిన అనంతరం అక్కడికి వచ్చి ఆ తరువాత కారులో పరారైనట్లు గుర్తించారు. దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు డీఎస్పీ తెలిపారు.