Thilanga Sumathipala
-
బంగ్లా ఆటగాళ్లపై లంక క్రికెట్ బాస్ ఫైర్
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల తీరుపై శ్రీలంక క్రికెట్ ఛీఫ్ తిలింగా సుమతిపాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగా అంపైర్ల నిర్ణయం పట్ల బంగ్లా ఆటగాళ్లు వ్యవహరించిన తీరు ఆహ్వానించదగినది కాదని, విచారకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఇక ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చివరి ఓవర్లో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. అంపైర్లు నోబాల్ ఇవ్వడం లేదని బంగ్లా ఆటగాళ్లు అసహనానికి లోనయ్యారు. అంతేగాకుండా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాట్స్‌మన్‌ను మైదానం వీడమని సూచించడం మైదానంలో ఉత్కంఠకు తెరలేపింది. ఇక రిజర్వ్ ఆటగాడు నురుల్ లంక కెప్టెన్ పెరీరాతో వాగ్వాదానికి దిగడం గొడవకు మరింత ఆజ్యం పోసినట్లైంది. దీంతో మైదానంలో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. చివరికి బంగ్లా ఓ బంతి మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. అనంతరం బంగ్లా ఆటగాళ్లు నాగినీ డ్యాన్స్‌లతో చిందేశారు. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లతో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక మ్యాచ్ ప్రజెంటేషన్ అనంతరం బంగ్లా డ్రెస్సింగ్ అద్దాలు ధ్వంసమవ్వడంతో దుమారం రేగింది. అయితే ఈ అద్దాలు బంగ్లా ఆటగాళ్లు విజయ సంబరాలు జరుపుకుంటుండగా ధ్వంసమైనట్లు తెలిసింది. ఈ ఘటనపై స్పందించిన ఐసీసీ బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హాసన్, రిజర్వు ఆటగాడు నురుల్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించారు. -
'క్రికెట్ బాస్ పదవికి రాజీనామా చేయను'
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ తనను ఆ దేశ క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలంటూ మాజీ దిగ్గజ క్రికెటర్ అర్జున్ రణతుంగా చేసిన డిమాండ్ ను తిలంగా సుమతిపాల తోసిపుచ్చారు. తాను పదవి నుంచి దిగాల్సిన అవసరం లేదంటూ రణతుంగకు కౌంటర్ ఇచ్చాడు. జట్టు ఆట తీరు బాలేకపోవడంలో క్రికెట్ పరిపాలన విభాగం తప్పిదం లేదనే విషయం తెలుసుకోవాలన్నాడు. 'నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. జట్టు ఆడకపోతే అది మా సమస్య కాదు. ఫీల్డ్ లో ఆడే జట్టు సరైన ప్రదర్శన చేయకపోతే క్రికెట్ పరిపాలన విభాగం ఏం చేస్తుంది. మా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేదు' అని సుమతిపాల అన్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ క్రికెట్ బాస్ పదవికి రాజీనామా చేయనని సుమతిపాల స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీలంక పెట్రోలియం మంత్రిగా ఉన్న అర్జున్ రణతుంగ.. తమ దేశ క్రికెట్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు, ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేసి తాత్కాలికంగా కమిటీ ఏర్పాటు చేయాలని వారికి రణతుంగ విన్నవించారు. ఈ క్రమంలోనే ఎస్ఎల్సీ అవలంభిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు.శ్రీలంక క్రికెట్ పరిపాలనలోఉన్న అసహ్యకర వాతావరణం నెలకొందంటూ విమర్శలు గుప్పించారు.