'క్రికెట్ బాస్ పదవికి రాజీనామా చేయను'
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ తనను ఆ దేశ క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలంటూ మాజీ దిగ్గజ క్రికెటర్ అర్జున్ రణతుంగా చేసిన డిమాండ్ ను తిలంగా సుమతిపాల తోసిపుచ్చారు. తాను పదవి నుంచి దిగాల్సిన అవసరం లేదంటూ రణతుంగకు కౌంటర్ ఇచ్చాడు. జట్టు ఆట తీరు బాలేకపోవడంలో క్రికెట్ పరిపాలన విభాగం తప్పిదం లేదనే విషయం తెలుసుకోవాలన్నాడు. 'నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. జట్టు ఆడకపోతే అది మా సమస్య కాదు. ఫీల్డ్ లో ఆడే జట్టు సరైన ప్రదర్శన చేయకపోతే క్రికెట్ పరిపాలన విభాగం ఏం చేస్తుంది. మా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేదు' అని సుమతిపాల అన్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ క్రికెట్ బాస్ పదవికి రాజీనామా చేయనని సుమతిపాల స్పష్టం చేశారు.
ప్రస్తుతం శ్రీలంక పెట్రోలియం మంత్రిగా ఉన్న అర్జున్ రణతుంగ.. తమ దేశ క్రికెట్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు, ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేసి తాత్కాలికంగా కమిటీ ఏర్పాటు చేయాలని వారికి రణతుంగ విన్నవించారు. ఈ క్రమంలోనే ఎస్ఎల్సీ అవలంభిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు.శ్రీలంక క్రికెట్ పరిపాలనలోఉన్న అసహ్యకర వాతావరణం నెలకొందంటూ విమర్శలు గుప్పించారు.