బంగ్లాదేశ్-శ్రీలంక ఆటగాళ్ల వాగ్వాదం (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల తీరుపై శ్రీలంక క్రికెట్ ఛీఫ్ తిలింగా సుమతిపాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగా అంపైర్ల నిర్ణయం పట్ల బంగ్లా ఆటగాళ్లు వ్యవహరించిన తీరు ఆహ్వానించదగినది కాదని, విచారకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఇక ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చివరి ఓవర్లో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే.
అంపైర్లు నోబాల్ ఇవ్వడం లేదని బంగ్లా ఆటగాళ్లు అసహనానికి లోనయ్యారు. అంతేగాకుండా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాట్స్‌మన్‌ను మైదానం వీడమని సూచించడం మైదానంలో ఉత్కంఠకు తెరలేపింది. ఇక రిజర్వ్ ఆటగాడు నురుల్ లంక కెప్టెన్ పెరీరాతో వాగ్వాదానికి దిగడం గొడవకు మరింత ఆజ్యం పోసినట్లైంది. దీంతో మైదానంలో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. చివరికి బంగ్లా ఓ బంతి మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. అనంతరం బంగ్లా ఆటగాళ్లు నాగినీ డ్యాన్స్‌లతో చిందేశారు. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లతో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక మ్యాచ్ ప్రజెంటేషన్ అనంతరం బంగ్లా డ్రెస్సింగ్ అద్దాలు ధ్వంసమవ్వడంతో దుమారం రేగింది. అయితే ఈ అద్దాలు బంగ్లా ఆటగాళ్లు విజయ సంబరాలు జరుపుకుంటుండగా ధ్వంసమైనట్లు తెలిసింది.
ఈ ఘటనపై స్పందించిన ఐసీసీ బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హాసన్, రిజర్వు ఆటగాడు నురుల్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment