సన్‌రైజర్స్ స్టార్ స్పిన్నర్, శ్రీలంక టీ20 జట్లు కెప్టెన్ వనిందు హసరంగ విషయంలో అనుకున్నదే అయ్యింది. గాయం (ఎడమ కాలు మడమ) కారణంగా ఈ ఆటగాడు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరిస్తూ బీసీసీఐకి లేఖ రాసింది. గాయం తాలుకా చికిత్స నిమిత్తం హసరంగ దుబాయ్‌లో ఉన్నాడని లంక బోర్డు పేర్కొంది.
చికిత్స అనంతరం హసరంగ స్వదేశంలో రిహాబ్‌లో ఉంటాడని తెలిపింది. డాక్టర్లు హసరంగను కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది.
కాగా, కొద్ది రోజుల ముందు వరకు సన్‌రైజర్స్ యాజమాన్యం హసరంగపై ఆశలు పెట్టుకుని ఉండింది. సీజన్ ఆఖరి మ్యాచ్‌లకైనా అందుబాటులోకి వస్తాడని అనుకుంది. లంక బోర్డు తాజా ప్రకటన నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతికే పనిలో పడింది.
గాయం లేదు ఏమీ లేదు అంతా డ్రామా..
హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం వెనక గాయం కాకుండా వేరే కారణాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం జరుగుతుంది. వేలంలో అతనికి సరైన రెమ్యూనరేషన్ దక్కకపోడం వల్లే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. హసరంగను గత సీజన్‌లో (2023) ఆర్సీబీ 10.75 కోట్లకు దక్కించుకోగా.. ఈ సీజన్ వేలంలో అతన్ని సన్‌రైజర్స్ కేవలం 1.5 కోట్లకే సొంతం చేసుకుంది. వేలంలో అనుకున్న ధర లభించకపోతే చాలా మంది విదేశీ ఆటగాళ్లు రకరకాల కారణాలు చూపి పోటీ నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది.
ఇదిలా ఉంటే, హసరంగ ఉన్నా లేకపోయిన ప్రస్తుత సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతుంది. తాజాగా కమిన్స్ సేన సొంత మైదానంలో (ఉప్పల్) ఫైవ్ టైమ్ ఛాంపియన్ సీఎస్‌కేను మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, రెండు పరాజయాలను మూటగట్టుకుంది. సన్‌రైజర్స్ ఏప్రిల్ 9న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment