ఐపీఎల్-2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. హసరంగ ప్రస్తుతం ఎడమ కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకుని త్వరలోనే సన్‌రైజర్స్ జట్టుతో చేరుతాడని అంతా భావించారు.
కానీ హసరంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలిగనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా ధ్రువీకరించారు.
"పాడియాట్రిస్ట్‌ను కలిసిన హసరంగా వారి సలహా మేరకు మరి కొన్ని రోజుల పాటు పునరావాసంలో ఉండనున్నాడు. దీంతో అతడు ఐపీఎల్‌లో పాల్గొనడం లేదు. అతడి మడమలో వాపు ఉంది. వనిందు ప్రస్తుతం ఇంజెక్షన్లను తీసుకుంటున్నాడు. వరల్డ్‌కప్‌కు ముందు పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని హసరంగా నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో అతడు ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలన్న తన నిర్ణయాన్ని మాకు తెలియజేశాడని" డి సిల్వా సండే టైమ్స్ అనే వార్తా పత్రికతో పేర్కొన్నాడు. ఐపీఎల్-2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హసరంగను రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment