షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లి‍ద్దరు! లంక బోర్డు ప్రకటన | Sri Lanka Preliminary Squads for Zimbabwe Series Kusal Hasaranga New Captains | Sakshi
Sakshi News home page

SL Vs Zim: దసున్‌ షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లి‍ద్దరు! లంక బోర్డు ప్రకటన

Published Sat, Dec 30 2023 3:12 PM | Last Updated on Sat, Dec 30 2023 3:58 PM

Sri Lanka Preliminary Squads for Zimbabwe Series Kusal Hasaranga New Captains - Sakshi

Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రీలంక కెప్టెన్‌గా దసున్‌ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్‌లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్‌ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది.

దసున్‌ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్‌ మెండిస్‌కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. 

వన్డే వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శన
కాగా దసున్‌ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్‌-2023 తర్వాత సీన్‌ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

ఆ తర్వాత భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్‌ మెండిస్‌ అతడి స్థానంలో కెప్టెన్‌ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా దసున్‌ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్‌ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది.

జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు:
కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్‌ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్‌, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర.

జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు:
వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్‌ నిస్సాంకా, కుశాల్‌ మెండిస్‌, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్‌, ధనంజయ డి సిల్వా, మహీశ్‌ తీక్షణ, కుశాల్‌ జనిత్‌ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్‌, దునిత్‌ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్‌ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్‌ తుషార, ప్రమోద్‌ మదుషాన్‌, మతీశ పతిరణ.

చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement