
SL Vs Zim: శ్రీలంకకు జింబాబ్వే షాక్... 94 బంతుల్లో 102 పరుగులు.. కానీ పాపం కెప్టెన్..
Zimbabwe Defeat Sri Lanka By 22 Runs In 2nd ODI: జింబాబ్వే జట్టు శ్రీలంకకు షాకిచ్చింది. రెండో వన్డేలో ఆతిథ్య జట్టును 22 పరుగుల తేడాతో ఓడించి సత్తా చాటింది. కాగా మూడు వన్డేలు ఆడే నిమిత్తం జింబాబ్వే శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి మ్యాచ్‌లో లంక 5 వికెట్ల తేడాతో గెలుపొందగా... రెండో వన్డేలో జింబాబ్వే పైచేయి సాధించింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఇద్దరు కెప్టెన్లు రాణించారు.. కానీ..
పల్లెకెలె వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ 91 పరుగులతో రాణించగా... రజా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లు కూడా మెరుగైన స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో జింబాబ్వే 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిశంక, కుశాల్ మెండిస్ శుభారంభం అందించలేకపోయారు. కమిందు మెండిస్ అర్ధ సెంచరీ చేయగా... కెప్టెన్ దసున్ శనక 102 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 280 పరుగులకే లంక కథ ముగిసిపోయింది. దీంతో పర్యాటక జట్టు చేతిలో భంగపాటు తప్పలేదు.
జింబాబ్వే బౌలర్లలో టెండాయి చటారా, బ్లెసింగ్ ముజరబాని మూడేసి వికెట్లు తీశారు. వెస్లీ, రిచర్డ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక జింబాబ్వే కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
స్కోర్లు: జింబాబ్వే- 302/8 (50)
శ్రీలంక- 280/9 (50)
చదవండి: Ind Vs Sa 1st ODI: భారీ స్కోరుకు అవకాశం.. టాస్ గెలిస్తే...
BBL: ‘బిగ్‌బాష్’ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా...