Zimbabwe vs Afghanistan, 2nd ODI: అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.
ఇందులో భాగంగా తొలుత హరారేలో టీ20 సిరీస్ జరుగగా.. అఫ్గనిస్తాన్ 2-1తో నెగ్గింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై మంగళవారం వన్డే సిరీస్ మొదలైంది. అయితే, వర్షం కారణంగా తొలి వన్డే ఫలితం తేలకుండానే ముగిసిపోయింది.
అతల్ సెంచరీ
ఈ నేపథ్యంలో జింబాబ్వే- అఫ్గనిస్తాన్ మధ్య గురువారం రెండో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. అఫ్గన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు సెదికుల్లా అతల్ సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ మాలిక్ అర్ధ శతకంతో మెరిశాడు. అటల్ 128 బంతుల్లో 104 పరుగులు చేయగా.. అబ్దుల్ 101 బంతుల్లో 84 పరుగులు రాబట్టాడు.
ఇలా ఓపెనర్లు బలమైన పునాది వేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా(5), నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(1) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది(30 బంతుల్లో 29 నాటౌట్) బ్యాట్ ఝులిపించగా.. మహ్మద్ నబీ(16 బంతుల్లో 18) అతడికి సహకారం అందించాడు. వికెట్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ 5 పరుగులు చేశాడు.
54 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో అఫ్గన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో జింబాబ్వే 54 పరుగులకే(17.5 ఓవర్లలో) కుప్పకూలింది. దీంతో ఏకంగా 232 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ జయభేరి మోగించింది.
తద్వారా.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా సాధించిన 19 పరుగులే టాప్ స్కోర్. అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
సింగిల్ డిజిట్ స్కోర్లు
ఓపెనర్లు బెన్ కర్రన్(0), తాడివనాషి మరుమాణి(3).. అదే విధంగా మిగతా ఆటగాళ్లలో డియాన్ మైయర్స్(1), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(4), బ్రియాన్ బెనెట్(0), న్యూమన్ నియామురి(1), రిచర్డ్ ఎంగర్వ(8), ట్రెవర్ గ్వాండు(0), టినోడెండా మపోసా(0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సీన్ విలియమ్స్ 16 పరుగులు చేయగలిగాడు.
ఇక అఫ్గనిస్తాన్ బౌలర్లలో ఘజన్‌ఫర్, నవీద్ జద్రాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఫజల్‌హక్ ఫారూకీ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. సెంచరీ వీరుడు సెదికుల్లా అతల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శనివారం మూడో వన్డే జరుగనుంది.
చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’
Comments
Please login to add a commentAdd a comment