Thiruvanthipuram
-
వీధి కుక్క మృతి.. కాలనీలో వెలసిన పోస్టర్లు
తిరువనంతపురం: మానవుడికి జంతువులకు మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న శునకానికి ఆదరణ మిగతావాటికన్నా ఎక్కువే. చాలా మంది వాటిని పేరు పెట్టి పిలుస్తూ సాకుతారు. వాటికి క్యూట్ క్యూట్ పేర్లు పెట్టి ముద్దాడుతుంటారు. అలాంటి ఓ కుక్క ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కేరళలో ఓ వీధి వీదంతా విషాదంలో మునిగింది. ఆ వీధిలోని వ్యాపారులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కుక్క పేరుతో కాలనీలో పోస్టర్లు వేసి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. ఈ విశేష ఘటన కేరళలోని పథానంతిట్ట జిల్లా మనక్కాల పట్టణంలో జరిగింది. పట్టణంలోని కాలేజ్ జంక్షన్ ప్రాంతంలో ఒక పంచాయతీ వారు ఒక కుక్కను వదిలివెళ్లారు. దీంతో స్థానికులు ఆ కుక్కకు తిండిపెట్టి ఆదరించారు. దానికి రేమణి అని పేరు కూడా పెట్టారు. కాలనీవాసులు ఆహారం అందిస్తుండడంతో రేమణి కాలనీకి, దుకాణాలకు కాపలాగా నిలవడం మొదలుపెట్టింది. దాని అరుపులకు ఆ ప్రాంతంలోకి అపరిచితులు వెళ్లాలంటే హడలిపోయేవారు. కాలనీవాసులు ఎవరైనా రాత్రిళ్లు ఆలస్యంగా వస్తే వారికి తోడుగా రేమణి వచ్చేదని టైర్ల వ్యాపారం నిర్వహించే ప్రదీప్ తెలిపారు. అయితే గతవారం వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య రేమణి పరుగెత్తడంతో ప్రమాదానికి గురై మృతి చెందింది. రేమణి మృతితో ఆ కాలనీ షాక్కు గురైంది. ముఖ్యంగా దుకాణదారులు, వ్యాపారులు రేమణి మృతిని తట్టుకోలేకపోయారు. తమ వ్యాపారాలకు రక్షణగా నిలిచిన రేమణిని గుర్తు చేసుకుంటున్నారు. వియ్ లవ్ యూ.. మిస్ యూ.. రిప్ టు రేమణి అంటూ సోషల్ మీడియాలోనూ కామెంట్లు చేస్తున్నారు. -
రాజకీయాల్లోకి మిజోరం గవర్నర్!
తిరువనంతపురం: మిజోరం గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ తన పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కేరళ నుంచి ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజశేఖరన్ గతేడాది మేలో మిజోరం గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ముద్రపడ్డ రాజశేఖరన్ త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీ చేసే అవకాశముందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీచేసిన రాజశేఖరన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ చేతిలో ఓడిపోయారు. -
తిరువనంతపురం నుంచి శ్రీశాంత్ పోటీ
తిరువనంతపురం: కెరీర్ ప్రారంభంలోనే అద్భుత ప్రతిభకనబర్చి 'కేరళ స్పీడ్ స్టర్'గా ఖ్యాతిపొంది, అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటకు దూరమైన క్రికెటర్ శ్రీశాంత్ జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. రాజకీయ అరంగేట్రంపై కొద్దిరోజులుగా వినిపిస్తోన్న ఊహగానాలకు తెరదించుతూ శ్రీశాంత్ శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. కేరళ బీజేపీ చీఫ్ కుమ్మనన్ రాజశేఖరన్, ఇంకొందరు ముఖ్యనేతల కమలం కండువవా కప్పి శ్రీశాంత్ ను పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తోన్న బీజేపీ తొలి విడతగా 51 మంది అభ్యర్థుల జాబితాను విడుదలచేసింది. కీలకమైన తిరువనంతపురం స్థానం నుంచి శ్రీశాంత్ బరిలోకి దిగుతున్నాడు. సిటీలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండటంతోపాటు యువతరం ఓట్లను కొల్లగొట్టగలడనే నమ్మకంతోనే శ్రీశాంత్ కు తిరువనంతపురం టికెట్ ఇచ్చినట్లు తెలిసింది.