thoothukudi harbor
-
రూ.1000 కోట్లు విలువైన కొకైన్ పట్టివేత
తూత్తుకుడి: విమానాశ్రయాలు బంగారు అక్రమ రవాణాకు అడ్డ అయితే.. ఓడరేవులు డ్రగ్స్ సరఫరాకు అడ్డాగా మారుతున్నాయి. తమిళనాడులో మైండ్ బ్లాంక్ అయ్యేలా భారీ ఎత్తున మత్తు పదార్దాలు పట్టుబడుతున్నాయి. తాజాగా ఇతర దేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా వేలాది కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలోని వీవీఓసీ ఓడరేవు వద్ద విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేసిన రూ.1000 కోట్లు విలువైన కొకైన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి ఓడ ద్వారా రవాణా చేస్తున్న సమయంలో ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల తూత్తుకుడిలోని ఓడరేవు వద్దకు వచ్చిన ఓడ కంటైనర్లను అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు ఈ స్మగ్లింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కలప కంటైనర్‌లోని సంచుల్లో సుమారు 400 కిలోగ్రాముల కొకైన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొకైన్ ఎక్కడ నుంచి వచ్చిందో నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఇంత పెద్ద ఎత్తున భారీగా మాదకద్రవ్యాలను పంపించారో పోలీసులు విచారిస్తున్నారు. కంటైనర్ ఎవరిది? ఇది ఎక్కడ నుండి వచ్చింది.. ఎవరు ఆదేశించారు.. అందులో డ్రగ్స్ ఎవరు పెట్టారో తెలుసుకోవడానికి చెన్నై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పోర్టు ఉద్యోగులు, అటు నౌక సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు బంగారు అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారుతుంటే, ఓడరేవులు మాదకద్రవ్యాల రవాణాకు కేంద్రాలుగా మారుతున్నాయి. తమిళనాడు విమానాశ్రయంలో ఇటీవల జరిపిన సోదాల్లో వందల కిలోల బంగారం అక్రమంగా దొరికింది. షిప్పింగ్ పోర్టులో డ్రగ్స్ రవాణా ఇటీవల పెరిగింది. మాదకద్రవ్యాలను తరచూ రవాణా చేస్తుండగా సీజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడం ఇదే మొదటిసారి. 4 వందల కిలోల కొకైన్ విలువ సుమారు 1000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. చదవండి: ఉరి తాడుగా మారిన ఉయ్యాల -
తూత్తుకూడి హార్బర్‌పై గురి
చెన్నై, సాక్షి ప్రతినిధి : తూత్తుకూడి హార్బర్లో విధ్వంసాలకు లేదా హార్బర్‌గుండా ఐఎస్ఐ తీవ్రవాదుల చొరబాటుకు ప్రయత్నాలు జరిగినట్లు వె ల్లడైంది. ఈనెల 10వ తేదీన పట్టుబడిన శ్రీలంకకు చెందిన పాకిస్తాన్ తీవ్రవాది అరుణ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీ విచారణలో అనేక వివరాలు వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. శ్రీలంక పౌరసత్వాన్ని కలిగి ఉన్న అరుణ్‌సెల్వరాజ్ పాకిస్తాన్ తీవ్రవాదుల ఆదేశాల మేరకు ఐదేళ్ల క్రితం చెన్నైకి మకాం మార్చాడు. రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాల్లో సంచరిస్తూ ఫొటోలు తీసి వాటిని పాకిస్తాన్‌కు చేరవేశాడు. ఈ విషయం పోలీసుల విచారణలో అరుణ్ వెల్లడించాడు. మూడు రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న అరుణ్ సెల్‌ఫోన్‌లోని నంబర్ల నుంచి ప్రధానంగా ఆధారాలు సేకరిస్తున్నారు. తమిళనాడుపై విధ్వం సాలకు కుట్రపన్నే తరుణంలో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శ్రీలంక శరణార్థులకు తరచూ ఫోన్ చేస్తున్నట్లు కనుగొన్నారు. అంతేగాక తూత్తుకూడి హార్బర్‌ను అనేకసార్లు సందర్శించి ఫొటోలను తీసినట్లు వెల్లడైంది. వాటిని పాకిస్తాన్‌కు పంపినట్లు విచారణలో తేలింది. దీంతో అధికారుల బృందం తూత్తుకూడికి చేరుకుంది. హార్బర్ సందర్శనకు అనుమతిచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తోంది. తూత్తుకూడి జిల్లాలోని తాపాత్తీ, కుళత్తువాయ్పట్టీ, తాళముత్తునగర్లలోని శ్రీలంక శరణార్దుల శిబిరాలకు అరుణ్‌ను తీసుకెళ్లింది. అక్కడ ఎవరెవరితో సంభాషించింది ఆరాతీస్తోంది. తీవ్రవాదులు తమ ఆరాచకాలకు తూత్తుకూడిని ఎలా వాడుకోవాలని భావించారు, ఇందుకు ఎవరెవరు అరుణ్‌కు సహకరించారనే కోణంలో విచారిస్తున్నారు. చెన్నైలో కాలుమోపి ఈ ఐదేళ్ల కాలంలో పూనేకూ అనేకసార్లు అరుణ్ ప్రయాణించినట్లు తెలుసుకున్నారు. పూనేలో రహస్యంగా తలదాచుకుని ఉన్న ఐఎస్ఐ తీవ్రవాదులతో అనేకసార్లు మంతనాలు సాగించినట్లు తేలింది. అరుణ్ సెల్వరాజ్ కేసును విచారిస్తున్న జాతీయ ప్రత్యేక భద్రతా దళంలోని ఒక బృందం శనివారం పూనేకి బయలుదేరింది. ఇలా అనేక కోణాల్లో అనేక బృందాల ద్వారా సాగిస్తున్న విచారణలో పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు తమిళనాడుపై పన్నిన కుట్రలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.