తూత్తుకూడి హార్బర్‌పై గురి | Pakistan terrorist focus on thoothukudi harbor | Sakshi
Sakshi News home page

తూత్తుకూడి హార్బర్‌పై గురి

Published Sat, Sep 20 2014 11:39 PM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

Pakistan terrorist focus on thoothukudi harbor

 చెన్నై, సాక్షి ప్రతినిధి : తూత్తుకూడి హార్బర్‌లో విధ్వంసాలకు లేదా హార్బర్‌గుండా ఐఎస్‌ఐ తీవ్రవాదుల చొరబాటుకు ప్రయత్నాలు జరిగినట్లు వె ల్లడైంది. ఈనెల 10వ తేదీన పట్టుబడిన శ్రీలంకకు చెందిన పాకిస్తాన్ తీవ్రవాది అరుణ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీ విచారణలో అనేక వివరాలు వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. శ్రీలంక పౌరసత్వాన్ని కలిగి ఉన్న అరుణ్‌సెల్వరాజ్ పాకిస్తాన్ తీవ్రవాదుల ఆదేశాల మేరకు ఐదేళ్ల క్రితం చెన్నైకి మకాం మార్చాడు. రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాల్లో సంచరిస్తూ ఫొటోలు తీసి వాటిని పాకిస్తాన్‌కు చేరవేశాడు. ఈ విషయం పోలీసుల విచారణలో అరుణ్ వెల్లడించాడు. మూడు రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న అరుణ్ సెల్‌ఫోన్‌లోని నంబర్ల నుంచి ప్రధానంగా ఆధారాలు సేకరిస్తున్నారు.
 
  తమిళనాడుపై విధ్వం సాలకు కుట్రపన్నే తరుణంలో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శ్రీలంక శరణార్థులకు తరచూ ఫోన్ చేస్తున్నట్లు కనుగొన్నారు. అంతేగాక తూత్తుకూడి హార్బర్‌ను అనేకసార్లు సందర్శించి ఫొటోలను తీసినట్లు వెల్లడైంది. వాటిని పాకిస్తాన్‌కు పంపినట్లు విచారణలో తేలింది. దీంతో అధికారుల బృందం తూత్తుకూడికి చేరుకుంది. హార్బర్ సందర్శనకు అనుమతిచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తోంది. తూత్తుకూడి జిల్లాలోని తాపాత్తీ, కుళత్తువాయ్‌పట్టీ, తాళముత్తునగర్‌లలోని శ్రీలంక శరణార్దుల శిబిరాలకు అరుణ్‌ను తీసుకెళ్లింది. అక్కడ ఎవరెవరితో సంభాషించింది ఆరాతీస్తోంది. తీవ్రవాదులు తమ ఆరాచకాలకు తూత్తుకూడిని ఎలా వాడుకోవాలని భావించారు, ఇందుకు ఎవరెవరు అరుణ్‌కు సహకరించారనే కోణంలో విచారిస్తున్నారు.
 
  చెన్నైలో కాలుమోపి ఈ ఐదేళ్ల కాలంలో పూనేకూ అనేకసార్లు అరుణ్ ప్రయాణించినట్లు తెలుసుకున్నారు. పూనేలో రహస్యంగా తలదాచుకుని ఉన్న ఐఎస్‌ఐ తీవ్రవాదులతో అనేకసార్లు మంతనాలు సాగించినట్లు తేలింది. అరుణ్ సెల్వరాజ్ కేసును విచారిస్తున్న జాతీయ ప్రత్యేక భద్రతా దళంలోని ఒక బృందం శనివారం పూనేకి బయలుదేరింది. ఇలా అనేక కోణాల్లో అనేక బృందాల ద్వారా సాగిస్తున్న విచారణలో పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు తమిళనాడుపై పన్నిన కుట్రలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement