తోట నరసింహం పీఏపై లైంగిక వేధింపుల కేసు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం పీఎ శర్మ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. రాయుడు పాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న తనపై శర్మ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ మహిళ కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సర్పవరం పోలీసులు శర్మపై కేసు రిజిస్టర్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 509, 506 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శర్మ స్నేహితుడి నివాసంలో తాను కొన్నాళ్లుగా అద్దెకు ఉంటున్నానని, ఆ ఇల్లు ఖాళీ చేయాలని శర్మ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శర్మ తనను రకరకాలుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తూ స్పందించలేదని, తర్వాత కేసు నమోదు చేసినట్లు తెలిపింది. మరోవైపు ఈ కేసుపై మీడియాతో మాట్లాడేందుకు సర్పవరం పోలీసులు నిరాకరించారు. కాగా శర్మ కూడా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు. తన సోదరి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, తాను ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనని ఆయన తెలిపారు.