హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
ప్రొద్దుటూరు క్రై ం:
ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన గరుడయ్యగారి పెద్దిరెడ్డి (47) హత్యకేసులో నలుగురికి ప్రొద్దుటూరు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసుకు సంబంధించి కుట్రదారుడు కింద 5వ ముద్దాయిగా ఉన్న రాయపాటి వెంకటరెడ్డిపై కేసును కోర్టు కొట్టివేసింది. పెద్దిరెడ్డి 2009లో క్రషర్ మిషన్ వద్ద నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ప్రత్యర్థులు అతన్ని దారుణంగా హత్య చేశారు. ఏపీపీ మార్తల సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు .. ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డికి రైల్వే కాంట్రాక్టు వచ్చింది. ఇందుకోసమై ఆయన కొర్రపాడు గ్రామ పంచాయతీలోని గంగాదేవిపల్లె పంట పొలాల్లో క్రషర్ మిషన్‌ను ఏర్పాటు చేశాడు. పెద్దిరెడ్డి భార్య అపర్ణ ఆ సమయంలో కొర్రపాడు గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. రైల్వే కాంట్రాక్టు దక్కించుకోవడమే గాక క్రషర్ మిషన్‌ను తమ గ్రామ పంట పొలాల్లో పెట్టుకునేందుకు గాను వెన్నపూస యుగంధర్‌రెడ్డి, అతని సోదరులు కొంత డబ్బు ఇవ్వమని పెద్దిరెడ్డిని అడిగారు. అయితే అతను ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఇలా పలు సార్లు డబ్బు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో యుగంధర్‌రెడ్డి సోదరులు ఆయనపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే 2009 డిసెంబర్ 24న పెద్దిరెడ్డి క్రషర్ మిషన్ వద్ద నుంచి తన సమీప బంధువు జగన్మోహన్రెడ్డితో కలిసి మోటార్ బైక్‌లో ఇంటికి బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగానే బైక్‌ను ఆపిన యుగంధర్‌రెడ్డి, అతని సోదరులు గొడ్డలితో పెద్దిరెడ్డి మెడపై నరికారు. దీంతో జగన్మోహన్రెడ్డి బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. తర్వాత తీవ్రగాయాలైన పెద్దిరెడ్డి కూడా పారిపోతుండగా యుగంధర్‌రెడ్డి, సోదరులు వెంటపడి పెద్ద రాయితో అతని తలపై వేశారు. దీంతో గరుడయ్యగారి పెద్దిరెడ్డి అక్కడికక్కడే మతి చెందాడు. ఈ సంఘటనపై అదే రోజు ముద్దనూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పటి సీఐ రామాంజినాయక్ వెన్నపూస యుగంధర్‌రెడ్డితోపాటు సోదరులు గంగాధర్‌రెడ్డి, చిన్నారెడ్డి, వేమిరెడ్డి బాలచిన్నారెడ్డి, కోడిగాండ్లపల్లెకు చెందిన రాయపాటి వెంకటరెడ్డిపై 164/209 క్రై ం నెంబర్ కింద కేసు నమోదు చేశారు. ఈ హత్యకేసుకు సంబంధించి 2012 నుంచి ప్రొద్దుటూరు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. నేరం రుజువు కావడంతో సోమవారం రెండవ అదనపు జిల్లా జడ్జి జి.మనోహర్‌రెడ్డి ముద్దాయిలు యుగంధర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, చిన్నారెడ్డి, వేమిరెడ్డి బాల చిన్నారెడ్డిలకు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. అంతేగాక రూ.5వేలు జరిమానా విధించారు. కాగా కుట్రదారుని కింద 5వ ముద్దాయిగా ఉన్న రాయపాటి వెంకటరెడ్డిపై నమోదైన కేసును కొట్టివేశారు. విషయం తెలియడంతో ముద్దనూరు మండలం నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు కోర్టు వద్దకు చేరుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు గిరిధర్‌రెడ్డి కూడా కోర్టు వద్దకు వచ్చారు. సాయంత్రం శిక్ష పడిన ముద్దాయిలను కడప సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. సీఐ సుధాకర్‌రెడ్డి, సిబ్బంది వారి వెంట వెళ్లారు.