..ఆ మూడింటిపైనే నజర్!
⇒ క్షేత్రస్థాయి నుంచి రాజధాని వరకు సమీక్షలు
⇒ వర్షాకాలం ఆరంభం వరకు లక్ష్యాల సాధనపై దృష్టి
⇒నేడు మంత్రి పోచారం, ఎంపీ కవిత సమీక్ష
⇒ హరితహారం, మిషన్ కాకతీయ, ‘భగీరథ’ కీలకం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు పథకాల అమలుపై అందరూ దృష్టిసారించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం అమలు ప్రజాప్రతినిధులు, అధికారులకు కీలకంగా మారింది. జూన్ 15 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్పటికే మిషన్ కాకతీయ 1 పనులు పూర్తి చేయడం.. హరితహారం కింద మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఉధృతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మిషన్ భగీరథ కింద జిల్లాలో అన్ని గ్రామాలకు దశలవారీగా మంచినీరు అందించాలన్నది లక్ష్యం కాగా.. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు మొదటి విడతగా తాగునీరు అందించే పనులు కూడా వేగం అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ఇప్పటికే హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించగా.. మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు రెండు దఫాలుగా సమీక్షించారు. అంతకంటే ముందు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధికారులతో రివ్యూ చేశారు. నిన్నటి వరకు పార్లమెంట్ సెషన్స్‌కు హాజరైన ఆమె జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పసుపు మద్దతు ధర, పసుపు పరిశోధన కేంద్రాల పునరుద్ధరణ, పసుపు బోర్డు ఏర్పాటుపై ఢిల్లీలో కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌లను కలిశారు. మంగళవారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎంపీ కవిత హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపైన ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల వేగం పెరగాలి..
మిషన్ భగీరథ కోసం ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ పునర్విభజన ద్వారా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు (టీడీడబ్ల్యూఎస్పీ)ని ఏర్పాటు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 25,78,324 మందికి వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా రక్షిత మంచినీటి ఇంటింటికి నల్లా ద్వారా అందించడం లక్ష్యం. గ్రామీ ణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్లు, ము న్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్ల చొప్పున సరఫరా చేయాలనేది నిర్ణయం. ఈ పథకా న్ని రెండు గ్రిడ్లుగా విభజించిన అధికారులు ఒక గ్రిడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, మరొకటి సింగూరు ప్రాజెక్టు ఆధారంగా నీటి సరఫరా జరుగుతుంది.
ఎస్సారెస్పీ ద్వారా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, కామారె డ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 20 మండలాలు, 860 గ్రామాలు, నిజామాబాద్ కార్పొరేషన్, కామారె డ్డి మున్సిపాలిటీల్లోని 16,34,982 మందికి నీటి సరఫ రా అవుతోంది. అలాగే జుక్కల్, బాన్సువాడ, బోధన్లతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కొన్ని గ్రా మాలు కలిపి మొత్తం 785 గ్రామాలకు సింగూరు ప్రా జెక్టు నుంచి నీటి సరఫరా చేస్తారు. ఎస్సారెస్పీ నుంచి 1.88 టీఎంసీలు, సింగూరు నుంచి 1.36 టీఎంసీలు కలిపి మొత్తం 3.24 టీఎంసీల నీరును తరలిస్తారు. ఈ నీటిని నిర్దేశించిన అన్ని గ్రామాలకు నల్లాల ద్వారా అందించేందుకు పల్లెపల్లెకు కొత్తగా పైపులైన్లు నిర్మిం చనున్నారు. మొదట రూ.3,475 కోట్లు అంచనా కాగా రూ.1,350 కోట్లు విడుదలయ్యాయి.
అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. అయితే మరో నెలలో వ ర్షాకాలం రాబోతున్నందున వ్యవసాయ క్షేత్రాల్లో జరి గే పనులను ఈ లోపే పూర్తి చేయాలి. అదే విధంగా మిషన్ కాకతీయ 1 పనులు మార్చిలోనే పూర్తి కావా ల్సి ఉండగా.. ఇప్పటికీ 83.55 శాతమే పూర్తయ్యాయి. 658 చెరువుల పునరుద్ధరణ పనులకు అగ్రిమెంట్ జరి గితే 554 చెరువులే 100 శాతం పూర్తి కాగా, పెంచిన గ డువు ప్రకారం ఈ నెలాఖరులోగా 104 చెరువులు పూ ర్తి కావాల్సి ఉంది. మొదటి విడత పనులు పూర్తి కాకపోవడం వల్ల రెండో విడతపై ప్రభావం చూపుతుంది.
వచ్చేది వర్షాకాలం... అధిక ప్రాధాన్యం హరితహారం..
తెలంగాణ రాష్ట్రంలో అటవీశాఖ లెక్కల ప్రకారం భౌగోళిక విస్తీర్ణం 1,02,018 చదరపు కిలోమీటర్లు. అందులో 19,149 చదరపు కిలోమీటర్లలో అటవీ విస్తీర్ణం ఉంది. అంటే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం సగటున 16.69 శాతం. ఏ రాష్ట్రంలోనైనా భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 33 శాతం తగ్గకుండా అడవులు ఉంటే.. ఆ రాష్ట్రంలో, ప్రాంతంలో పర్యావరణ, ప్రకతి వైఫరీత్యాల సమస్య ఉండదని శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా సగటున 16.69 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. అంటే కనీసం 16.31 శాతం అడవుల పెంపకం అత్యవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం ద్వారా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటాలన్నది లక్ష్యంతో గతేడాది వారం రోజులపాటు హరితహారం కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలోనే మూడేళ్లలో నిజామాబాద్ జిల్లాలో అడవులు 35.83 శాతంకు పెరిగేందుకు ఏటా జిల్లాలో 3.35 కోట్ల మొక్కలు నాటేందుకు వీలుగా జిల్లాలో 411 నర్సరీలను ఏర్పాటు చేశారు. అనుకున్నట్లుగా మొక్కల పెంపకం, నాటడం జరిగితే ఒకే ఏడాదిలో అటవీ విస్తీర్ణం 21.46 శాతం పెరగనుండగా.. రిజర్వు ఫారెస్టు ఏకంగా 3 శాతం అభివృద్ధి చెందనుందనేది అప్పటి అంచనా. ఇదే తరహాలో మూడేళ్లు హరితహారం కొనసాగితే 11.37 శాతం కొత్తగా అటవీ విస్తీర్ణం పెరగనుండగా.. జిల్లాలో అడవుల శాతం 35.83కు చేరనుంది.
కాగా అడవులు అంతరిస్తే వాటి దుష్ఫరిణామాలు అందరికీ తెలిసిందే. పర్యావరణ సమతూల్యత దెబ్బతిని అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాను కరువు మేఘాలు కమ్ముకున్నాయి. జిల్లాలో వరుసగా ఐదేళ్ల నుంచి వర్షభావ పరిస్థితులు వెంటాడుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి జూన్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంటుండగా, ముందస్తుగా హరితహారంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవితలు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష జరపనున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం పథకాల వేగం పెంచేందుకు వారు మంగళవారం అధికారులతో రివ్యూ చేయనున్నారు.