Thrown Off Bus
-
మేకప్ తెచ్చిన తంటా.. బస్సులోంచి దించేశారు
లండన్: ఓ అమ్మాయి శృతిమించి మేకప్ వేసుకోవడం వల్ల ఊహించని కష్టం వచ్చింది. ఈ టీనేజర్‌కు జరిమానా వేయడంతో పాటు బస్సులోంచి దించేశారు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో గతవారం 15 ఏళ్ల అమ్మాయి సినిమాకు వెళ్లేందుకు స్నేహితులతో కలసి బస్సు ఎక్కింది. ఆ అమ్మాయి తన వయసును బట్టి చిన్న పిల్లల టికెట్ తీసుకుంది. అయితే మహిళా బస్సు కండెక్టర్ ఈ టికెట్ చెల్లదని చెప్పింది. 15 ఏళ్ల అమ్మాయిలా కనిపించడంలేదని, చిన్న పిల్లలా ఉండటం కోసం ఎక్కువగా మేకప్ వేసుకున్నావని కండెక్టర్ వాదించింది. బస్సులోంచి దిగాలని ఆ అమ్మాయికి చెప్పింది. అంతేగాక 3500 రూపాయల జరిమానా విధించింది. తాను అబద్ధం చెప్పలేదని, అసలు వయసు చెప్పినా కండెక్టర్ నమ్మలేదని ఆ అమ్మాయి వాపోయింది. ఇలాంటి సంఘటన ఎదురవుతుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చింది. తన వయసును నిరూపించుకునేందుకు ఏవైనా సర్టిఫికెట్లు చూపాలని కండెక్టర్ అడిగిందని, వాటిని వెంటపెట్టుకుని వెళ్లరు కదా అని వాపోయింది. పాపం ఎక్కువగా మేకప్ వేసుకున్నందుకు ఆ అమ్మాయికి జరిమానాతో పాటు నడక తప్పలేదు. -
కదులుతున్న బస్సులోంచి తోసేశారు
మోగా: తమ కూతురుపై ఆకృత్యాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకున్నందుకు కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో కూతురు చనిపోగా కన్నతల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. మోగా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ తల్లి, పద్నాలుగేళ్ల కూతురు, కుమారుడు కలిసి గురుద్వారా దర్శనానికి ప్రైవేట్ బస్సులో బయలు దేరారు. పది కిలో మీటర్లు వెళ్లాక బస్సులోని కొందరు వ్యక్తులు తమ కూతురుతో తప్పుడుగా ప్రవర్తించడం గుర్తించిన తల్లి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి మొదట ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కండక్టర్‌కు ఫిర్యాదు చేయగా అతడు కూడా చెడుగా ప్రవర్తించినవారితో జతకట్టి అందరూకలిసి తల్లిని కూతురుని తిట్టడం మొదలుపెట్టారు. భయంతో ఆ తల్లి బస్సు డ్రైవర్ వద్దకు వెళ్లి బస్సు ఆపాల్సిందిగా బతిమిలాడుకున్నా.. అతడు ఆపకుండా నడిపాడు. అలా పదిహేను నిమిషాల పాటు వారిని బస్సులో ఇబ్బంది పెట్టి కిందికి తోసేశారు. దీంతో రోడ్డు మీద పడి బలమైన గాయాల పాలయిన బాలిక.. గంటలపాటు ఎవరి సాయం అందక నడిరోడ్డుపైనే ప్రాణాలుకోల్పోయింది. గాయాలపాలయిన తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బస్సును గుర్తించిన పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.