క్యుములో నింబస్ మేఘాల వల్లే పిడుగుల వర్షం
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో అకాల పిడుగులకు క్యూములో నింబస్ మేఘాలే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏకకాలంలో అటు కోస్తాంధ్ర మీదుగా, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి... ఇటు వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
వీటికితోడు నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటున్నాయని, ఉదయపు వేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండడంతో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నట్టు వివరించారు. ఈ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడానికి దోహదపడుతున్నాయని వివరించారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లకిందకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.