Thyagaraja
-
తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!
తెలుగు తల్లీ, అదుగోనమ్మా త్యాగయ్య నాదోపాసన రవళిస్తున్నది నీకు భూపాలమై! కర్ణాటక సంగీతం ముమ్మూర్తుల్లో ఒకరైన శ్రీమాన్ త్యాగరాజు 177వ ఆరాధనోత్సవాలు తిరవైయ్యారులో ఘనంగా జరిగాయి. "విదులకు మ్రొక్కెద సంగీత కోవిదులకు మ్రొక్కెద" అంటూ నాదోపాసనతో నిధికన్నా రాముని సన్నిధి చాల సుఖమని అనుకుని ఆపై "ఏ నోము ఫలమో నీ నామామృత / పానము అను సోపానము దొరికెను" అని తెలుసుకుని జీవించారు; నాదబ్రహ్మమై జీవిస్తున్నారు త్యాగరాజు. వారు పాడింది మనం వినలేకపోయాం. వారి సంగీతం సుఖమైంది మనకు చదువయింది. "సామగాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ అమృతవర్షిణి రాగంలో రూపక తాళంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక కీర్తన చేశారు. కర్ణాటకసంగీతం త్యాగయ్య వల్ల పరిపుష్టమైంది. తెలుగుకు గర్వకారణమైంది. "చల్లని భక్తి", "స్మరణే సుఖము", "కులములెల్ల కడతేఱినట్లు", "పరమానందమనే కమలముపై" వంటివి అన్న త్యాగరాజు గొప్పకవి కూడా. వారు రాసింది చదవగలిగే భాగ్యం మనకు అందింది. సంగీతం కోసమే అన్నా వారి నోటి వెంట గొప్ప కవిత్వమూ పలికింది. "భావాభావ మహానుభావ శ్రీరామచంద్ర భావజనక నా భావము తెలిసియు..." "తన తలుపు తీసినట్టి ఒకరింటికి తాఁ గుక్కల తోలు రీతిగాదో" "తవిటికి రంకాడబోతె కూటి తపిల కోతి కొంపోయినట్టుగాదో" "రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన యోగము మఱి యనురాగము లేని భాగవతు లుదర శయనులేగాని..." "మనసు స్వాధీనమైన యా ఘనునికి మఱి మంత్రతంత్రములేల" "యజ్ఞాదులు సుఖమను వారికి సము లజ్ఞానులు కలరా ఓ మనసా" "చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర మెలఁగుచుండే బిరుదు వహించిన సీతారామ..." "ఏఱు నిండి పాఱిన పాత్రకు తగు నీరు వచ్చుగాని" "లేమి దెల్ప పెద్దలెవరు లేరో" (ఇది ఇవాళ్టి తెలుగు కవిత్వానికి, భాషకు, సమాజానికి ఈ మాట సరిగ్గా పొసుగుతుంది) "శాంతము లేక సౌఖ్యము లేదు" ఇవి, ఇలాంటివి ఇంకొన్నీ అన్న వాగ్గాన (వాగ్గేయ) కారులు త్యాగరాజు. రాముణ్ణి "సప్తస్వర నాదాచల దీపం" గా పరిగణించి ఆ వెలుగులో "సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా" అని అన్న త్యాగరాజు తెలుగుభాషకు సంగీతం పరంగానే కాదు కవిత్వం పరంగానూ వరవరం. "సామ గాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ మంగళంపల్లి బాలమురళికృష్ణ నుతిస్తే తెలుగువాళ్లం మనం "కవన సాగర పూర్ణసోమ స్వామి త్యాగరాజ నామ" అంటూ కూడా త్యాగరాజును స్తుతిద్దాం. --రోచిష్మాన్, 9444012279 (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
కీర్తనల్లో...ద్రాక్ష, అరటి, కొబ్బరి
దక్షిణాదిన ఒక నానుడి ఉంది. త్యాగరాజ కీర్తనలు ద్రాక్షపళ్ళలాంటివి...నోట్లో వేసుకుని చిదిమితే చాలు, పులకించిపోతాం. శ్యామశాస్త్రి గారి కీర్తనలు కదళీఫలం లాంటివి. కొంచెం కొంచెంగా తొక్క ఒలుచుకుని తింటుంటేనే అరటి పండును ఆసాంతం సంతృప్తిగా ఆస్వాదించగలం. ముత్తుస్వామి దీక్షితులు గారి కీర్తనలు నారికేళ పాకం లాంటివి. కొబ్బరి బోండాం తెచ్చి, పీచు తీసి, పగుల కొట్టి, కొబ్బరి తీసి, తురిమి, పాకం పట్టించి తింటే తప్ప ఆ ఆనందం తెలియదు. దంతసిరి కూడా ఉండాలి. లేకపోతే పళ్ళమధ్య ఇరుక్కుపోతున్నవాటిని సభా గౌరవం కూడా పాటించకుండా పుల్లలతో గుచ్చుకుంటుండాలి. అంటే ముగ్గురివి అటువంటి స్థాయి కలిగిన కీర్తనలు. శ్యామశాస్త్రి గారికి శ్రీవిద్యా సంప్రదాయం అంటే కరతలామలకం. సాక్షాత్ అమ్మవారిని ఉద్దేశించి చేసిన కీర్తనలో ఎన్ని రహస్యాలు దాచారో.. అదొక అద్భుత కీర్తన...‘‘హేమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే/సుమేరు మధ్య వాసినీ అంబ శ్రీకామాక్షి/శ్యామకృష్ణ సోదరీ గౌరీ పరమేశ్వరీ గిరిజా/అలమేలవేణీకీరవాణీ శ్రీలలితే.....’’ పాహిమాం వరదే పరదేవతే అని చిట్టచివరి చరణంలోకి వెళ్ళేటప్పటికి శ్రీలలితే అని చేసారు. ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు. రాజగోపురంలో కూర్చుని ఒళ్ళు మరిచి సంకీర్తన చేస్తుంటే... అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఒంటినిండా నగలు ధరించి చేత్తో పాలు పట్టుకొచ్చి..‘అన్నయ్యా! అన్నయ్యా!!!’ అని పిలిచి ఇచ్చేది. అవి తాగేవారు ఆయన. ఇంటికొచ్చి వారి అమ్మనడిగేవారు..‘‘చెల్లిని ఎందుకు పంపావు ?’’ అని.‘నీ చెల్లీ రాలేదు, నేనూ పంపలేదు’ అని ఆమె అనేవారట. అందుకే ఎక్కువగా ఆయన కీర్తనలలో చివర ‘శ్యామకృష్ణ సహోదరీ’ అని చేర్చారు. ఒక అర్థంలో కామాక్షీదేవిని వాళ్ళ ఇంటి ఆడపడుచు–అని, మరొక అర్థంలో విష్ణు సహోదరి అయిన అమ్మవారు– అని అర్థం వచ్చేలా ఉంటుంది. త్యాగరాజుగారు ‘త్యాగరాజనుత’ అని వేసుకున్నట్లుగానే, శ్యామశాస్త్రిగారు ‘శ్యామకృష్ణ సహోదరి’ అనీ, ‘శ్యామకృష్ణ పూజిత’ అని వేసుకున్నారు.అనేకమంది మహర్షులకు నిలయం హిమవత్ పర్వతం. ఎందరో అక్కడ ధ్యానం చేస్తుంటారు. అటువంటి హిమవత్ పర్వత రాజయిన హిమవంతుడి భార్య మేనక. దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిగా ఉండి హిమాలయాల్లో సంచరిస్తుండగా ఆమెను చూసిన మేనక –‘నాకు ఇటువంటి కుమార్తె ఉంటే బాగుండును’ అనుకున్న కారణంగా ఆమె హైమవతి గా జన్మించింది. ప్రపంచంలోని పర్వతాలన్నింటిలోకి శ్రేష్టమయినదిగా పిలవబడే హిమవత్పర్వతం... దానికి రాజయిన హిమవంతుడికి కుమార్తె అయిన దానా... వరదే.. అంటే వరములిచ్చేది... ఇక్కడ ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరాలు కాదట. ఏ ఆనందాన్ని అనుభవించడం చేత అటువంటి సుఖం కలుగుతుందో అటువంటి ఆనందం కేవలం పరమేశ్వరుని పాదాలనుంచి స్రవించే అమృతంలో తప్ప మరొక దానిలో లేదు. అటువంటి పాదసేవ కోర్కెను తీర్చగలిగే తల్లి కనుక ‘వరదే’ అన్నారు. అంటే లౌకికమైన స్థితినుంచి అలౌకికమైన స్థితిని పెంచడానికి అవకాశమున్న భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తునిగా చేయగలిగిన దానివి. అందుకని .. వరదే.. అన్నారు. ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరం కాదు. ఆ వరానికి ‘కాదంబరి’ అన్న నామంతో సంబంధం ఉంది. ఈ కీర్తన గొప్పతనం ఎంతంటే.. .అది ప్రతిరోజూ విన్నంత మాత్రం చేత అద్భుతమైన వాక్శక్తినీ, వాఙ్మయ ధారను అమ్మవారు కటాక్షించ గలుగుతుంది. -
నిధి చాల సుఖమా!
త్యాగరాజు జీవితంలో ఎన్నడూ ఉద్యోగం చేయలేదు. ఒకరి దగ్గరకు వెళ్ళి చేయిచాపలేదు. తెల్లవారిలేస్తే సంధ్యావందనం చేసుకోవడం, కావేరీ నది ఒడ్డుకు వెళ్ళడం, అక్కడినుంచి వచ్చి భాగవత, రామాయణాలు, భగవద్గీతలు చదువుకోవడం. మధ్యాహ్నమయిన తరువాత కీర్తనలు చేసుకుంటూ ఉంఛవృత్తి చేసుకోవడం... అంటే తనవద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదరపోషణకు సరిపడా పదార్థాల్ని సేకరించడానికి ఎన్ని ఇళ్ళ ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ళ వద్దకు వెళ్ళి కీర్తనలు చేయడం, పెట్టినవారూ ఒకటే, పెట్టనివారూ ఒకటే. పదార్థాలు సరిపడా సమకూరాయనిపించగానే తిరిగి వచ్చి భార్య కమల (పెద్దభార్య పార్వతి శరీరం విడిచి పెట్టిన తరువాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెలు కమలను చేసుకున్నారు. వారికి ఒకే సంతానం –సీతామహాలక్ష్మి) వాటిని వండి సిద్ధం చేసేది. దానిని త్యాగరాజుగారు రామచంద్రమూర్తికి నివేదించి తాను, తన కుటుంబం, శిష్యులు స్వీకరించేవారు. దాచుకోవడం చేతకాదు. చెట్టును ఆశ్రయిస్తే, గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతివారికీ సంగీత విద్యను నేర్పేవారు. అలా జీవించిన త్యాగరాజు గారికి ఏం లోటు? ఎందరో మహారాజులు ఎలాగయినా వారిని తమ సన్నిధానానికి తెచ్చుకోవడానికి విఫల యత్నాలు చేసారు. తంజావూరు మహారాజయితే మారువేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తూండేవారు. ఒకరోజు ఆయన జోలెపట్టి వెడుతుంటే దానిలో బంగారు కాసులు వేసారు, ఏం చేస్తారో చూద్దామని. బంగారు కాసులు పడడం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమయిందని త్యాగరాజు దానిని మొత్తం తీసుకెళ్ళి చెత్తకుప్పలో వేసారు. ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా...’’ అని కీర్తన చేసారు. పక్కింట్లోనే అన్నగారు జపేశుడు ఉండేవారు. ఎంతసేపటికీ ఈ విగ్రహాలు పెట్టుకుని, మహారాజులు బహుమతులు ఇచ్చినా పుచ్చుకోనంటున్నాడని కోపమొచ్చి ఆ విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదని ఎవరూ చూడకుండా వాటిని తీసుకెళ్ళి కావేరీనదిలో పారేసాడు. వాటికోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు పరితపించిపోయి ‘నిన్ను ఎందని వెదకను హరీ...’’ అని కీర్తన చేసాడు. తన ఇష్టదైవం కలలో కనపడి కావేరీ నదిదగ్గరకు రమ్మనమని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చాయి విగ్రహాలు. వంద రెండొందల సంవత్సరాల క్రితం నాటివి ఈ సంఘటనలు.పరమేశ్వరుడున్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరి జీవితాలు. మనమయితే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజచేస్తే... కేవలం విగ్రహంగానే చూస్తాం. దీపం వెలిగించేటప్పడు పొరబాటున చెయ్యి తగిలి విగ్రహం కింద పడ్డా తిరిగి నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం. త్యాగరాజు అలాకాదు. ఆ విగ్రహాలు కావేరీ నదిమీద తేలుతూ వస్తే...‘‘సుకుమార రఘువీర రారా మా ఇంటికి’’...అని ఆర్తితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్ళారు. త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహూకరించాడు. అది చూసి కన్నీటి పర్యంతమయిన త్యాగయ్య నాకోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామీ, నీ కాళ్ళెంత సొక్కిపోయాయో...అంటూ ‘‘నను పాలింపగ నడచి వచ్చితివా...’’అని కీర్తన చేసారు. త్యాగరాజు గారికి ‘సర్వం రామమయం జగత్’. -
అలరించిన ఆర్తి, అర్చనల గానామృతం
తిరుపతి కల్చరల్: త్యాగరాజ సంగీతోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి త్యాగరాజ మండపంలో కవలలైన ఆర్తి, అర్చనల గానామృతం కమనీయంగా సాగింది. సద్గురు శ్రీత్యాగరాజస్వామి 250వ జయంతి సందర్భంగా త్యాగరాజు ఉత్సవ కమిటీ74వ వార్షిక సంగీతోత్సవాలు సోమవారంతో 8వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రులైన కవలలు శాస్త్రీయ కర్ణాటక సంగీతంతో శ్రోతల హృదయాలను రంజింపజేశారు. శ్రీరాగంలో వందే వాసుదేవం, విజయశ్రీ రాగంలో వరనారద నారాయణ., భైరవి రాగంలో తనయుని బ్రోబ జనని వచ్చునో వంటి అపూర్వ కృతులను ఆలపించి ప్రేక్షకుల హర్ష««ధ్వానాలు అందుకున్నారు. వీరికి వయోలిన్‌పై రాజీవ్, మృందంగంపై ప్రవీణ్ చక్కటి సహకారం అందించారు. అనంతరం చెన్నైకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, సప్తగిరి సంగీత విద్వన్మణి అరుణాసాయిరామ్ గాత్ర కచేరి సాగింది. తోడిరాగంలో కద్దను వారికి కద్దు కద్దు.., హిరణ్మయి లక్ష్మీ లలిత వంటి అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితులు, వనానందకరంగా ఆలపించి ప్రేక్షులను మైమరిపించారు. వీరికి వయోలిన్‌పై ఎంఏ.కృష్ణస్వామి, మృదంగంపై వైద్యనాథన్, ఘటంపై మురళి సహకారం అందించారు. ఈ సందర్భంగా సంగీత విద్యాంసులను త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు భీమాస్ రఘు, కంచి రఘురామ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోహనసుందరం, ప్రభాకర్, వేణుగోపాల్‌రెడ్డి, దొరైరాజ్ పాల్గొన్నారు. -
గుండెపోటుతో ఉద్యమకారుడు మృతి
ఆదోని రూరల్, న్యూస్‌లైన్: మదిరె గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు త్యాగరాజు (55) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతిరోజూ పాల్గొన్నాడు. ఉద్యమ వార్తలు టీవీలో ఎక్కువగా చూసేవాడు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై తరచుగా పిల్లలతో చర్చించేవాడు. ఈ క్రమంలో బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య పుల్లమ్మ, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. త్యాగరాజు మృతి పట్ల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రజనీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, గ్రామసేవకుల సంఘం నాయకులు, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.