breaking news
thyagaraja swamy
-
అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం! ఇక్కడ కళ్యాణం..
చెన్నైనగర శివారు ప్రాంతమైన తిరువొట్రియూర్లో అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం ఉంది. అత్యద్భుతమైన శిల్పసౌందర్యంతో, అణువణువునా సొగసైన పనితనం ఉట్టిపడే ఈ ప్రాచీన కట్టడం త్యాగరాజస్వామి ఆలయమైతే, ఈ ఆలయ ప్రాంగణంలోనే పరమశివుడు తన భక్తుడైన సుందరుని కల్యాణాన్ని జరిపించిన వృక్షం నేటికీ భక్తులకు దర్శనమిస్తూ, వారి మనోరథాలను నెరవేరుస్తుంటుంది.స్వామివారి సన్నిధికి కుడివైపునే వడి ఉడై అమ్మన్ ఆలయం ఉంది. ఎడమవైపున జగన్నాథుడు, జగదాంబికల సన్నిధులు నేత్రపర్వం చేస్తుంటాయి. ఆ పక్కనే వినాయకుడు, కుమారస్వామి, బాలపరమేశ్వరుడు, కాళికాంబ సన్నిధులు కనువిందు చేస్తూ, భక్తులకు పరమశివుడి సాన్నిధ్యాన్ని కనులముందు సాక్షాత్కరింపజేస్తుంటాయి. తిరువొట్రియూర్ ఆలయంలోని మరో విశిష్టత ఏమిటంటే, ఇక్కడ నక్షత్రలింగ సన్నిధి అని 27 నక్షత్రాలకు సంబంధించి 27 శివలింగాలున్నాయి. ఈ సన్నిధిలో 27 నక్షత్రాలకు సంబంధించిన భక్తులు తమ జాతక దోషాలను ΄పోగొట్టుకునేందుకు పూజలు చేస్తుంటారు. ఉత్సవమూర్తి అయిన త్యాగరాజస్వామి, మూలవిరాట్టు అయిన ఆదిపురీశ్వరుని విగ్రహాలు భక్తులను ఆనంద పరవశ్యంలో ముంచి వేస్తుంటాయి. సువర్ణకవచాన్ని అలంకరించుకుని ఉన్న మూలవిరాట్టు ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ, భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతుంటుంది. ఎక్కడా లేనివిధంగా ఇక్కడి మూలవిరాట్టు ఆదిపురీశ్వరుడు నిత్యం తైలాభిషేకంలో మునిగి తేలుతుంటాడు. ఆయనకు అభిషేకించిన తైలం పిల్లల మాడుమీద అంటి, నొసట బొట్టులా పెడితే చాలు– బాలారిష్టాలూ, దృష్టిదోషాలూ అంతరించిపోతాయనీ, బాలలు ఆయురారోగ్యాలతో నిత్యం ఆనందంతో కేరింతలు కొడతారని ప్రతీతి. భక్తులు ప్రత్యేక రుసుము చెల్లించడం ద్వారా ఆలయంలో స్వామికి చందనకాప్పు (గంధపు పూత), మంజళ్ కాప్పు (పసుపు పూత), పంచామృతాభిషేకం, క్షీరాభిషేకాలను స్వయంగా నిర్వహించుకోవచ్చు. దోషనివారణ చేసుకోవచ్చు.ఎక్కడ ఉందంటే..?చెన్నై నగరానికి శివారు ప్రాంతంలోనే ఉంది తిరువొట్రియూర్. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి బస్సులు, లోకల్ రైళ్లు ఉన్నాయి. ఆటోలలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు. తిరువొట్రియూరులో తెలుగు వారు తక్కువేమీ కాదు. అందువల్ల తెలుగుమాత్రమే తెలిసిన వాళ్లకు ఇబ్బంది ఏమీ ఉండదు. బస, భోజన వసతులకు కూడా బాగానే ఉంటాయిక్కడ. తిరువొట్రియూరులో కూడా అలాంటి సౌకర్యం ఉంది కాబట్టి యాత్రికులు తిండికోసం ఇబ్బంది పడనక్కరలేదు.అతిపెద్ద ఆలయం... త్యాగరాజస్వామికి తిరువారూరులో అతిపెద్ద ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా పేర్కొనే ఈ గుడి తంజావూరు జిల్లాలోని తిరువారూరులో ఉంది. ఈ గుడికి నాలుగువైపులా నాలుగు గోపురాలున్నాయి. ఈ దేవాలయం 30 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఉంది. దీనికి అనుసంధానంగా పెద్ద కోనేరు ఉంది. కమలాలయం అనే పేరుగల ఈ కోనేరు ఆలయంకన్నా పెద్దగా ఉండటం విశేషం. దక్షిణ భారతదేశంలో ఇదే అతి పెద్ద కోనేరు. చోళరాజుల కాలం నాటి ఈ గుడి శిల్పసౌందర్యానికి పెట్టింది పేరు. అత్యంత విలువైన దివ్యాభరణాలతో అలంకృతమై ఉన్న త్యాగరాజ స్వామివారి విగ్రహం ఈ గుడిలో కనువిందు చేస్తుంది. అంతేకాదు, ఆలయంలో అనేకమైన తైలవర్ణ చిత్రాలున్నాయి. వాటిలో శయనముద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రం చూపు తిప్పుకోనివ్వనంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎదపైన నటరాజస్వామి నర్తిస్తూ ఉన్నట్లు చిత్రించి ఉండటం మరో అద్భుతం. తిరువారూరులో ఏటా బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతుంది. అంతేకాదు, ఇక్కడ కమలాలయం కోనేరులో జరిగే తెప్పోత్సవానికి కూడా మంచి పేరుంది. -
ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
అన్నవరం (ప్రత్తిపాడు) : శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం అన్నవరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం హైస్కూల్ ఎదుట ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి రాత్రి వరకూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు కళాకారులు ఆలపించిన పంచరత్న కీర్తనలు, త్యాగరాజ కృతులు సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని మణి, కర్ణాటక సంగీత కళాకారిణి చాగంటి రమ్య కిరణ్మయి ఆలపించిన కీర్తనలు ఆహూతుల మన్ననలందుకున్నాయి. దేవస్థానం వ్రత పురోహిత సూపర్వైజర్ నాగాభట్ల కామేశ్వరశర్మ ఇంటి వద్ద నుంచి ఉదయం 7 గంటలకు నగర సంకీర్తన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చామర్తి పట్టాభి త్యాగరాజ స్వామి వేషధారణలో అందరినీ అలరించారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లికి చెందిన కె.కళ్యాణి భాగవతారిణి త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనలు, సాయంత్రం ఐదు గంటలకు దేవస్థానం సంగీత విధ్వాంసుడు పెండ్యాల శ్రీనివాస్ నాదస్వర కచేరీ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకూ చాగంటి రమ్య కిరణ్మయి త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. అనంతరం హార్మోనియం విధ్వాంసుడు కాకరపర్తి అప్పారావును ఘనంగా సన్మానించారు. తొమ్మిదేళ్లుగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్న ఇంద్రగంటి త్యాగరాజును పలువురు అభినందించారు. కార్యక్రమంలో వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, యనమండ్ర సూర్యనారాయణ, విశ్రాంత ప్రధానార్చకులు నాగాభట్ల సత్యనారాయణ, వ్రత పురోహితులు చామర్తి కన్నబాబు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు గాడేపల్లి నాని, కందర్ప శ్రీరామచంద్రమూర్తి, ఇంద్రగంటి నరసింహమూర్తి, బుర్రకథ కళాకారుడు మడిపల్లి వెంకట్రావు, పలువురు సంగీతాభిమానులు పాల్గొన్నారు.