అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం! ఇక్కడ కళ్యాణం.. | Thiruvarur Tamilnadu: Thyagarajaswamy Temple History | Sakshi
Sakshi News home page

అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం! ఇక్కడ కళ్యాణం..

Published Sun, Sep 8 2024 2:30 PM | Last Updated on Sun, Sep 8 2024 2:31 PM

Thiruvarur Tamilnadu: Thyagarajaswamy Temple History

చెన్నైనగర శివారు ప్రాంతమైన తిరువొట్రియూర్‌లో అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం ఉంది. అత్యద్భుతమైన శిల్పసౌందర్యంతో, అణువణువునా సొగసైన పనితనం ఉట్టిపడే ఈ ప్రాచీన కట్టడం త్యాగరాజస్వామి ఆలయమైతే, ఈ ఆలయ ప్రాంగణంలోనే పరమశివుడు తన భక్తుడైన సుందరుని కల్యాణాన్ని జరిపించిన వృక్షం నేటికీ భక్తులకు దర్శనమిస్తూ, వారి మనోరథాలను నెరవేరుస్తుంటుంది.

స్వామివారి సన్నిధికి కుడివైపునే వడి ఉడై అమ్మన్‌ ఆలయం ఉంది. ఎడమవైపున జగన్నాథుడు, జగదాంబికల సన్నిధులు నేత్రపర్వం చేస్తుంటాయి. ఆ పక్కనే వినాయకుడు, కుమారస్వామి, బాలపరమేశ్వరుడు, కాళికాంబ సన్నిధులు కనువిందు చేస్తూ, భక్తులకు పరమశివుడి సాన్నిధ్యాన్ని కనులముందు సాక్షాత్కరింపజేస్తుంటాయి. తిరువొట్రియూర్‌ ఆలయంలోని మరో విశిష్టత ఏమిటంటే, ఇక్కడ నక్షత్రలింగ సన్నిధి అని 27 నక్షత్రాలకు సంబంధించి 27 శివలింగాలున్నాయి. ఈ సన్నిధిలో 27 నక్షత్రాలకు సంబంధించిన భక్తులు తమ జాతక దోషాలను ΄పోగొట్టుకునేందుకు పూజలు చేస్తుంటారు. ఉత్సవమూర్తి అయిన త్యాగరాజస్వామి, మూలవిరాట్టు అయిన ఆదిపురీశ్వరుని విగ్రహాలు భక్తులను ఆనంద పరవశ్యంలో ముంచి వేస్తుంటాయి. 

సువర్ణకవచాన్ని అలంకరించుకుని ఉన్న మూలవిరాట్టు ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ, భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతుంటుంది. ఎక్కడా లేనివిధంగా ఇక్కడి మూలవిరాట్టు ఆదిపురీశ్వరుడు నిత్యం తైలాభిషేకంలో మునిగి తేలుతుంటాడు. ఆయనకు అభిషేకించిన తైలం పిల్లల మాడుమీద అంటి, నొసట బొట్టులా పెడితే చాలు– బాలారిష్టాలూ, దృష్టిదోషాలూ అంతరించిపోతాయనీ, బాలలు ఆయురారోగ్యాలతో నిత్యం ఆనందంతో కేరింతలు కొడతారని ప్రతీతి. భక్తులు ప్రత్యేక రుసుము చెల్లించడం ద్వారా ఆలయంలో స్వామికి చందనకాప్పు (గంధపు పూత), మంజళ్‌ కాప్పు (పసుపు పూత), పంచామృతాభిషేకం, క్షీరాభిషేకాలను స్వయంగా నిర్వహించుకోవచ్చు. దోషనివారణ చేసుకోవచ్చు.

ఎక్కడ ఉందంటే..?
చెన్నై నగరానికి శివారు ప్రాంతంలోనే ఉంది తిరువొట్రియూర్‌. చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బస్సులు, లోకల్‌ రైళ్లు ఉన్నాయి. ఆటోలలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు. తిరువొట్రియూరులో తెలుగు వారు తక్కువేమీ కాదు. అందువల్ల తెలుగుమాత్రమే తెలిసిన వాళ్లకు ఇబ్బంది ఏమీ ఉండదు. బస, భోజన వసతులకు కూడా బాగానే ఉంటాయిక్కడ. తిరువొట్రియూరులో కూడా అలాంటి సౌకర్యం ఉంది కాబట్టి యాత్రికులు తిండికోసం ఇబ్బంది పడనక్కరలేదు.

అతిపెద్ద ఆలయం... 
త్యాగరాజస్వామికి తిరువారూరులో అతిపెద్ద ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా పేర్కొనే ఈ గుడి తంజావూరు జిల్లాలోని తిరువారూరులో ఉంది. ఈ గుడికి నాలుగువైపులా నాలుగు గోపురాలున్నాయి. ఈ దేవాలయం 30 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఉంది. దీనికి అనుసంధానంగా పెద్ద కోనేరు ఉంది. కమలాలయం అనే పేరుగల ఈ కోనేరు ఆలయంకన్నా పెద్దగా ఉండటం విశేషం. దక్షిణ భారతదేశంలో ఇదే అతి పెద్ద కోనేరు. చోళరాజుల కాలం నాటి ఈ గుడి శిల్పసౌందర్యానికి పెట్టింది పేరు. 

అత్యంత విలువైన దివ్యాభరణాలతో అలంకృతమై ఉన్న త్యాగరాజ స్వామివారి విగ్రహం ఈ గుడిలో కనువిందు చేస్తుంది. అంతేకాదు, ఆలయంలో అనేకమైన తైలవర్ణ చిత్రాలున్నాయి. వాటిలో శయనముద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రం చూపు తిప్పుకోనివ్వనంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎదపైన నటరాజస్వామి నర్తిస్తూ ఉన్నట్లు చిత్రించి ఉండటం మరో అద్భుతం. తిరువారూరులో ఏటా బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతుంది. అంతేకాదు, ఇక్కడ కమలాలయం కోనేరులో జరిగే తెప్పోత్సవానికి కూడా మంచి పేరుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement