ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
Published Tue, Jan 17 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
అన్నవరం (ప్రత్తిపాడు) :
శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం అన్నవరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం హైస్కూల్ ఎదుట ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి రాత్రి వరకూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు కళాకారులు ఆలపించిన పంచరత్న కీర్తనలు, త్యాగరాజ కృతులు సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని మణి, కర్ణాటక సంగీత కళాకారిణి చాగంటి రమ్య కిరణ్మయి ఆలపించిన కీర్తనలు ఆహూతుల మన్ననలందుకున్నాయి. దేవస్థానం వ్రత పురోహిత సూపర్‌వైజర్ నాగాభట్ల కామేశ్వరశర్మ ఇంటి వద్ద నుంచి ఉదయం 7 గంటలకు నగర సంకీర్తన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చామర్తి పట్టాభి త్యాగరాజ స్వామి వేషధారణలో అందరినీ అలరించారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లికి చెందిన కె.కళ్యాణి భాగవతారిణి త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనలు, సాయంత్రం ఐదు గంటలకు దేవస్థానం సంగీత విధ్వాంసుడు పెండ్యాల శ్రీనివాస్ నాదస్వర కచేరీ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకూ చాగంటి రమ్య కిరణ్మయి త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. అనంతరం హార్మోనియం విధ్వాంసుడు కాకరపర్తి అప్పారావును ఘనంగా సన్మానించారు. తొమ్మిదేళ్లుగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్న ఇంద్రగంటి త్యాగరాజును పలువురు అభినందించారు. కార్యక్రమంలో వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, యనమండ్ర సూర్యనారాయణ, విశ్రాంత ప్రధానార్చకులు నాగాభట్ల సత్యనారాయణ, వ్రత పురోహితులు చామర్తి కన్నబాబు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు గాడేపల్లి నాని, కందర్ప శ్రీరామచంద్రమూర్తి, ఇంద్రగంటి నరసింహమూర్తి, బుర్రకథ కళాకారుడు మడిపల్లి వెంకట్రావు, పలువురు సంగీతాభిమానులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement