Ticketless Travellers
-
టికెట్ లేని ప్రయాణికులపై రూ.300 కోట్లు వసూలు.. 90% యువతే
ముంబై: ముంబైకర్లకు లైఫ్లైన్గా సేవలందిస్తున్న లోకల్ రైళ్లలో టికెటు లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గతేడాదికాలంలో టికెటు లేకుండా ప్రయాణిస్తున్న 46.32 లక్షల మందిని పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా రూ.300 కోట్లకుపైగా జరిమాన వసూలు చేశారు. ఇందులో ఒక్క ముంబై రీజియన్లోనే 19.57 లక్షల మందిని పట్టుకోగా వారి నుంచి రూ.108 కోట్లు జరిమాన వసూలు చేశారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరోపక్క ఇదే తరహాలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోవడంతో లోకల్ రైళ్ల ఆదాయానికి భారీ నష్టాన్ని కలగజేస్తున్నారు. ముంబైలో లోకల్ రైళ్లలో నిత్యం సుమారు 70 నుంచి75 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. అందులో 70% ప్రయాణికులు సీజన్ పాస్ హోల్డర్లుంటారు. మిగతావారు టికెట్ తీసుకుని లేదా టికెట్ లేకుండా ప్రయాణించే వారుంటారు. 2022–23 ఆర్థికక సంవత్సరంలో సెంట్రల్ రైల్వే టీసీలు దాడులుచేసి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 46.32 లక్షల మందిని పట్టుకున్నారు. ఇందులో 20 మంది టీసీలు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు రూ.కోటికిపైనే జరిమాన వసూలు చేశారు. డి.కుమార్ అనే టీసీ 22,847 మందిని పట్టుకుని రూ.2.11 కోట్లు జరిమాన వసూలుచేసి అగ్రస్థానంలో నిలిచారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని పట్టుకునేందుకు రైల్వే టీసీలు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సాయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంటారు. అందులో పెద్ద సంఖ్యలో పట్టుబడుతుంటారు. పట్టుబడిన వారిలో 90% యువతీ యువకులే ఉన్నారు. టీసీలను దూరం నుంచి చూపి తప్పించుకుని పారిపోయిన వారి సంఖ్య కూడా దాదాపు ఇంతే సంఖ్యలో ఉంటుంది. వీరంతా టీసీలకు చిక్కితే రైల్వేకు భారీగా అదనంగా ఆదాయం రావడం ఖాయమని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
టికెట్ లేని ప్రయాణికులకు 1.7 లక్షల జరిమానా
టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న 480 మంది ప్రయాణికుల నుంచి రైల్వే అధికారులు 1.7 లక్షల రూపాయలను అపరాధ రుసుంగా వసూలు చేశారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ రాకేష్ అరోన్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా మొత్తం స్టేషన్ను తమ అదుపులోకి తసీఉకుని, బయటకు వెళ్లే మార్గాలన్నింటినీ భద్రతా సిబ్బంది మూసేశారు. టికెట్లు లేని, అక్రమ ప్రయాణాలకు సంబంధించి 410 కేసులు, బుక్ చేయని లగేజికి సంబంధించి 65 కేసులు, రైల్వే ప్రాంగణాల్లో చెత్త వేసినందుకు 8 కేసులు నమోదుచేశారు. మొత్తం అందరి నుంచి జరిమానాగా 1.70 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ తనిఖీలలో 36 మంది టికెట్ చెకింగ్ సిబ్బంది, 15 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 15 మంది జీఆర్పీ సిబ్బంది, 14 మంది స్కౌట్లు, గైడ్లు పాల్గొన్నారు. మొత్తం 10 ఎక్స్ప్రెస్ రైళ్లు, 16 ప్యాసింజర్ రైళ్లు, 81 డెము, డీహెచ్ఎంయు, ఎంఎంటీఎస్ రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.