బయటపడ్డ భద్రతా లోపం
న్యూఢిల్లీ: ఢిల్లీ జంతుప్రదర్శనశాలలో మంగళవారం జరిగిన దుర్ఘటన సందర్శకులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పొరబాటున తెల్లపులి ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి పడ్డ యువకుడిని పులి బలితీసుకోవడంతో జూలో భద్రత చర్చనీ యాంశమైంది. నిజానికి ఎన్‌క్లోజర్‌లోకి యువకుడు పడిన తర్వాత దాదాపు రెండుమూడు నిమిషాలపాటు పులి అతని జోలికి వెళ్లలేదు. అయితే బయటివారి కేకలు, అరుపులు విన్నా కూడా ఘటనాస్థలానికి సెక్యూరిటీ గార్డులు చేరుకోవడంలో తీవ్రమైన జాప్యం జరిగిందని, చేరుకున్నవారి వద్ద కూడా ట్రాంక్విలైజర్ గన్స్, వాకీటాకీల వంటి పరికరాలేమీ లేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఉండి ఎందుకు? అని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు.
కూరమృగాలు ఉంటున్న ఎన్‌క్లోజర్ ఎత్తు కూడా చాలా తక్కువగా ఉందని, దీంతోనే యువకుడు అందులోకి పడిపోయాడని చెబుతున్నారు. మరి క్రూరమృగాలు ఉంటున్న ఎన్క్లోజర్ల వద్ద భద్రతను అధికారులు గాలికొదిలేశారా? అని నిలదీస్తున్నారు. నిజానికి ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే జూకు వచ్చే ప్రతి సందర్శకుడు తనవద్ద ఉన్న కెమెరా, సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో కూడా సందర్శకులకు ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం జూ అధికారులపై ఉంది. అయినప్పటికీ ఎన్క్లోజర్ల ఎత్తు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సందర్శకులు ఆరోపిస్తున్నారు. ఎన్‌క్లోజర్ ఎత్తు ఎక్కువగా ఉంటే ప్రమాదం జరిగేది కాదంటున్నారు.
బాలుడు అరుపులు విని తాను పులి ఉన్న ఎన్‌క్లోజర్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లానని, కానీ అప్పటికే అతను పులి నోట చిక్కి మెకలికలు తిరిగి పోతున్నాడని హిమాన్షు అనే ప్రత్యక్షసాక్షి చెప్పారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు తాము మొసళ్లను చూస్తుండగా హఠాత్తుగా అరుపులు వినిపించాయని, తాము వెళ్లి చూసేసరికి కొందరు పిల్లలు పులి ఎన్‌క్లోజర్‌లోకి కట్టెపుల్లలు, రాళ్లు విసరడం కనిపించిందని, దగ్గరకు వెళ్లి చూస్తే ఓ యువకుణ్ని పులి నోటకరిచి పట్టుకొని ఉండడం కనిపించిందని హిమాన్షు చెప్పారు. ఆ వ్యక్తి బాధతో మెలికలు తిరుగుతూ దాదాపు పావు గంటసేపు బాధపడడ్డాడని, అయినా అతణ్ని రక్షించే సాహసం ఎవరూ చేయలేదన్నాడు.
పులి ఉన్న ఎన్‌క్లోజర్ రెయిలింగ్ ఎక్కువ ఎత్తులో ఉందని, అతడు పొరపాటున లోపలికి పడిఉంటాడని హిమాన్షు చెప్పాడు. ఎన్‌క్లోజర్‌లో పడిన వెంటనే పులి అతని మీదకు దాడి చేయలేదని, పులి సమీపంలో నిలబడినప్పుడు ఆ యువకుడు ముడుచుకుని కూర్చుని రెండు చేతులతో దండం పెట్టడం చూశామని, అయితే పులి దృష్టిని మళ్లించడం కోసం ఎన్‌క్లోజర్ బయటనున్న కొందరు కట్టెపుల్లలు, రాళ్లు ఎన్‌క్లోజర్‌లోకి విసిరారని , రెండు నిమిషాలపాటు చూస్తూ నిలబడిన పులి ఈ చేష్టలతో రెచ్చిపోయి పంజా విసిరి యువకునిపై దాడిచేసిందని, యువకుణ్ని నోట కరచుకుని కాసేపు నిలబడిందని, ఆ తరువాత తలపట్టుకుని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్లిందని ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించిన బిట్టూ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.సెక్యూరిటీ గార్డులు ఆలస్యంగా వచ్చారన్నాడు.
అకతాయి చేష్టలే కారణం...
జూకు వచ్చేవారి ఆకతాయితనం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని జూ అధికారులు చెబుతున్నారు. మంగళవారం జరిగిన ఘటన కూడా యువకుడి ఆకతాయితనం వల్లే జరిగిందని చెబుతున్నారు. పులికి బలైన యువకుడిని మక్సూద్గా గుర్తించామని చెబుతున్నారు. ఎన్‌క్లోజర్ ఎక్కి ఫొటో తీయాలనే అత్యుత్సాహమే అతని ప్రాణాలు తీసిందంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఎన్‌క్లోజర్‌లోకి పడిన తర్వాత కూడా పులి అతణ్ని ముట్టలేదని, అయితే బయటివారు పులిని తరిమేందుకు కర్రలు, రాళ్లతో కొట్టే ప్రయత్నం చేయడంతో రెచ్చిపోయిన పులి అతనిపై దాడి చేందని, ఈ సమయంలో సందర్శకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి, అధికారులకు సమాచారం అందించి ఉంటే యువకుడి ప్రాణాలను కాపాడే అవకాశముండేదని చెబుతున్నారు.
సింహం కరుణించింది...
ఆరేళ్లక్రితం కూడా ఢిల్లీ జూలో ఇటువంటి ఘటనే జరిగింది. తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. అయితే అతను పడిన విషయాన్ని గమనించిన సింహం అతని వద్దకు వచ్చి.. ఏమీ చేయకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు కూడా పులి వదిలి పెడుతుందని భావించినా బయటివారు దానిని రెచ్చగొట్టడంతో యువకుడు బలికాక తప్పలేదని జూ అధికారులు చెప్పారు.