సమయం కేటాయింపుపై సభలో గందరగోళం
వైఎస్ఆర్సీపీ సభ్యులకు సమయం కేటాయించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. కనీసం రెండు నిమిషాల సమయం ఇవ్వాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. అయితే సమయం ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించడంతో సభలో గందరగోళం నెలకొంది. మొత్తం 175 సీట్లలో నాలుగు సీట్లను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైనారిటీలకు ఇచ్చారని, ఆ నలుగురూ గెలిచి సభలోకి వచ్చామని జలీల్‌ఖాన్ అన్నారు. ఏపీలో వక్ఫ్ బోర్డు పెడతారా.. లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టంచేయాలని వైఎస్ జగన్ కోరారు. దీనిపై తమ సభ్యులు ప్రశ్నలు అడిగేందుకు సమయం ఇవ్వాలన్నారు.
ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయం ఇదేనని, గతంలో హైదరాబాద్‌లో హజ్ హౌస్ ఉందని, ఇప్పుడు రాష్ట్ర విభజన కారణంగా ఎక్కడకు వెళ్లాలో అర్థం కావట్లేదని జలీల్ ఖాన్ అన్నారు. ఏపీలో వక్ఫ్ బోర్డు ఎప్పుడు పెడతారని ప్రశ్నించారు. అలాగే మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలుచేస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలని కోరారు.
మైనారిటీల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, మైనార్టీ, బీసీ సబ్‌ప్లాన్‌పై ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ఈ ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమాధానమిచ్చారు.