యోగనృసింహుడు
సాక్షి,తిరుమల:
వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు బుధవారం మలయప్పస్వామి ధ్యానముద్రలోని యోగ నృసింహస్వామి రూపంలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. దుష్టజన శిక్షణ, శిష్టజన రక్షణ, ధర్మ పరిరక్షణపై తాను నృసింహ రూపాన్ని ధరించానని స్వామి ఈ వాహనం ద్వారా సంకేతం ఇస్తారు. యోగ శాస్త్రంలో సింహం శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భవ బంధములనే ప్రపంచ మాయను దాటి ముక్తిని పొందడానికి యోగసాధన ఒక్కటే మార్గమని సింహ వాహన సేవలో యోగముద్ర రూపం ద్వారా స్వామి తెలియజేస్తారు. తొలుత ఆలయ రంగనాయక మంటపంలో ఉత్సవరులకు విశేష సమర్పణ చేసిన తరువాత ఆలయం వెలుపల వాహన మంటపంలోకి వేంచేపు చేశారు. పుష్పమాలలు, విశేషమైన ఆభరణాలతో ఉత్సవమూర్తిని అలంకరించారు. భక్తుల గోవింద నామాలు, మంగళవాయిద్యాలు, పండితుల వేదఘోష మధ్య వాహన సేవ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సాగింది. సింహవాహనంపై యోగముద్రలో ఆశీనులైన స్వామి దివ్యమంగళరూపాన్ని దర్శించి భక్తకోటి తన్మయత్వం పొందారు. వాహన సేవ ముందు కళాకారుల వేషధారణలు, కోలాటాలు, చెక్కభజనలు, భజన బృందాలు సంగీత, గాన, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్, బోర్డు సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, భానుప్రకాష్‌రెడ్డి, డీపీ అనంత్ పాల్గొన్నారు.