Tirupati Express
-
తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
భైరవపట్నం/మండవల్లి (కైకలూరు): పూరి– తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పూరి–తిరుపతి రైలు (17479) ఉదయం 5.47 గంటలకు కైకలూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అయితే మండవల్లి మండలం భైరవపట్నం గ్రామసమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. దీనిని గమనించిన రైల్వే కీమెన్ ఇంజన్‌లోని డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రైలును భైరవపట్నం గ్రామసమీపంలోనే నిలిపివేశారు. అనంతరం కైకలూరు నుంచి రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విరిగిన పట్టాకు మరమ్మతులు చేపట్టారు. తర్వాత 6.30 గంటలకు రైలు బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ భైరవపట్నం గ్రామం వద్ద పట్టా విరగడం గమనార్హం. కాగా, రైలు నిలిపివేయడంతో భీమవరం–విజయవాడ లైన్లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. -
నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’
చిన్న చిత్రాల జాబితాలో విడుదలైనా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కురిపించిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రానికి రీమేక్‌గా కన్నడలో రూపొందించిన ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత శైలేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆయన కుమారుడు సుమంత్, నటి కృతి కర్బంద హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విష్ణువర్థన్, చారులతా వంటి రీమేక్‌లను అందించిన దర్శకుడు పీ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కుమారుడు సుమంత్‌ను ఎలాగైనా సరే శాండల్‌వుడ్‌లో స్టార్‌ని చేయాలనే లక్ష్యంతో శైలేంద్రబాబు ఈ చిత్ర నిర్మాణానికి, ప్రచారానికి ఎక్కువగానే ఖర్చు పెట్టారని గాంధీనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా సాధించే విజయం పైనే సుమంత్ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది సినీవిశ్లేషకుల అభిప్రాయం. -
‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’లో..!
ఇంకొన్నాళ్ల పాటు నా ప్రయాణం తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లోనే అంటున్నారు కృతి కర్భందా. వచ్చే నెల 3న సుమన్ శైలేంద్రతో కలిసి ఆమె ఈ రైలు ప్రయాణం చేయబోతున్నారు. వీళ్లతో పాటు అశోక్, బుల్లెట్ ప్రకాష్, వీణా సుందర్, సాధు కోకిల తదితర తారలు కూడా తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో వెళతారు. విషయం ఏంటంటే.. సందీప్‌కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రం కన్నడంలో ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ పేరుతో రీమేక్ కానుంది. సుమన్ శైలేంద్ర, కృతి జంటగా పొన్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇటీవలే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చూశాననీ, చాలా నచ్చిందని కృతి తెలిపారు. ఇదిలా ఉంటే ఈ రీమేక్‌తో పాటు తెలుగు ‘కిక్’ రీమేక్ ‘సూపరో రంగా’లో కూడా ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు రీమేక్స్‌లో నటించడం థ్రిల్లింగ్‌గా ఉందని, ‘కిక్’లో ఇలియానా, ‘వెంకటాద్రి...’లో రకుల్ నటనను అనుకరించకుండా నా శైలిలో యాక్ట్ చేస్తానని కృతి తెలిపారు.