కలిసి రండి...తిరుపతిని ఐటీ హబ్ చేద్దాం
తిరుచానూరు: తిరుచానూరు రోడ్డులోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)లో మంగళవారం సాయంత్రం ఐటీ నిపుణులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందన్నారు. ఈ ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒక్కటే మార్గం అని ఆ దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లల్లో హైదరాబాదుకు దీటుగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడను ఐటీ హబ్‌లుగా మారుస్తామన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఐటీ అసోసియేషన్(టిటా) ప్రతినిధులు, ఇతర ఐటీ నిపుణులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఎటువంటి సౌకర్యాలు, వసతులు, ప్రోత్సాహం ఇవ్వకుంటే ఐటీ రంగం ఎలా అభివృద్ధి సాధిస్తుందని ప్రశ్నించారు.
కొత్త కంపెనీలను నెలకొల్పేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇదివరకే నెలకొల్పిన సంస్థల అభివృద్ధికిపన్నులో రాయితీ, ఇతరత్రా సౌకర్యాలు, వెసలుబాటు కల్పించాలని కోరారు. చిన్న కంపెనీలని తమకు టీటీడీ, యూనివర్సిటీ, ఎస్పీడీసీఎల్లో అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టే ఐటీ ప్రాజెక్టుల్లో తమకు అవకాశం కల్పించాలని, తద్వారా మరికొందరికి ఉద్యోగావకాశాలు కల్పించగలమని చెప్పారు. అలాగే పబ్లిక్ ప్రయివేటు కంపెనీలు, స్థానిక యూనివర్సిటీలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఐటీ రంగం మరింత అభివృద్ధి అవుతుందన్నారు. పీహెచ్డీ నుంచి పుట్టుకొచ్చిందే గూగుల్ అని ఉదాహరణగా పేర్కొన్నారు. ఎస్టీపీఐలోని సృజన్ టెక్నాలజీస్ సంస్థ అధినేత లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎస్టీపీఐకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం, రాయితీలు అందకపోవడంతో ఇక్కడ సంస్థలను నెలకొల్పేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు.
తిరుపతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని విదేశాల నుంచి వచ్చిన తనలాంటి ఎన్ఆర్ఐలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదన్నారు. వీటిపై స్పందించిన మంత్రి గతాన్ని మరిచిపోవాలని, అపార అవగాహన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు. ఐటీ రంగాన్ని ఈ ప్రభుత్వం బలోపేతం చేస్తుందని, కొత్తగా స్థాపించే ఐటీ సంస్థలకు అనేక రాయితీలు, వసతులు అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే పెద్దపెద్ద కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో పాటు పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఐటీఈ అండ్ సీ శాఖ జేడీ ప్రతాప్, ఎస్టీపీఐ(హైదరాబాదు) డెప్యూటీ డెరైక్టర్ వరప్రసాద్, తుడా కార్యదర్శి డాక్టర్ కే.మాధవీలత, ఇండస్ట్రీస్ జీఎం రామలింగేశ్వరరాజు, టిటా అధ్యక్ష, ఉపాధ్యక్షులు హరి మురళీధర్, జీ.గిరిధర్, కార్యదర్శి ఆర్.వంశీకృష్ణ, కే.రాజశేఖర్, కే.రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.
రూ.15వేల కోట్లతో ఐటీ పార్కు
రేణిగుంట: జిల్లాలో 300 ఎకరాల్లో రూ.15 వేల కోట్లతో ఐఐటీ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కులో రూ.4.7 కోట్లతో 5.2 ఎకరాల్లో నిర్మించిన ఐటీ ఐఆర్ ఇంకుబేషన్ సెంటర్‌ను మంగళవారం సాయంత్రం బొజ్జల గోపాలకృష్ణారెడిడ్డితో కలసి ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ విభజన తర్వాత 2020 నాటికి ఐటీ, ఐఆర్ రంగంలో రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులకు పెట్టుబడుల్లో రాయితీలతోపాటు సింగిల్‌విండో పద్ధతుల్లో 4 వారాల్లో అనుమతులు ఇస్తామన్నారు. జిల్లాలో 300 ఎకరాల్లో రూ.15 వేల కోట్లతో ఐఐటీ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. రేణిగుంట సమీపంలోని ఐటీ పార్కులో 140 ఎకరాలకు గాను 70 ఎకరాల్లో 6 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు.