Tiruppur district
-
టీషర్ట్స్ దాచి అడ్డంగా దొరికిపోయాడు
టీ.నగర్ : తిరుపూర్ సమీపంలో తాను పనిచేస్తున్న ఓ కంపెనీ నుంచి వేల రూపాయల విలువైన టీ షర్ట్‌లను దుస్తుల్లో దాచి చోరీ చేసిన వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. తిరుపూర్ జిల్లా పెరుమానల్లూర్ సమీపంలోని నేతాజీ అపేరెల్ పార్క్‌లో అనేక ఎక్స్పోర్ట్ బనియన్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. వీటిలో బయటి రాష్ట్రాలకు చెందిన అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులోని ఒక ఎక్స్పోర్ట్ సంస్థలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఒకడు పనిచేస్తున్నాడు. కాగా ఈ ఘటన జరిగిన రోజున ఆ వ్యక్తి తన విధులు ముగించుకుని కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో గేట్ వద్ద ఉన్న వాచ్‌మన్‌కు అతనిపై అనుమానం ఏర్పడింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానం చెప్పాడంతో వాచ్‌మన్ అతని వద్ద తనిఖీలు జరిపాడు. తను వేసుకున్న షర్ట్ లోపల టీషర్టులను ధరించినట్లు గుర్తించాడు. ప్యాంట్లో కూడా కొన్ని షర్ట్‌లను దాచుకున్నాడు. ఈ విధంగా మొత్తం 40 టీషర్ట్లను దాచినట్లు తెలిసింది. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న సంస్థ నిర్వాహకులు కార్మికుడిని హెచ్చరించి, ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
టీషర్ట్స్ దాచి దొరికిపోయాడు
-
కలెక్టర్ కదిలిపోయాడు
మూడో మనిషికి తెలియకుండా కష్టం సుఖం చెప్పుకున్నట్లే.. డబ్బు దాచుకున్న రహస్యం ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ మధ్యే ఉంచుకున్నారు. ఆ దాచుకున్న డబ్బు కూడా బతకడానికి కాదు. చనిపోతే అంత్యక్రియల కోసం! తంగమ్మాళ్, రంగమ్మాల్ అక్కాచెల్లెళ్లు. తంగమ్మాల్ వయసు 78. రంగమ్మాళ్ వయసు 75. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఆ ఇద్దరే ఉంటారు. పిల్లలు వెళ్లిపోయారు. పిల్లల పిల్లలు రావడం మానేశారు. వాళ్లుండేది చిన్న ఊరు. తమిళనాడులోని పల్లాడం దగ్గరి పూమలూర్. తిరుప్పూర్ జిల్లా. వీళ్లను చూసేవాళ్లు లేరు. చేసేవాళ్లూ లేరు. ఎవరికి ఎవరూ ఉండరని ఒంట్లో కాస్త ఓపిక ఉన్నప్పుడే వీళ్లు గ్రహించినట్లున్నారు. పొలానికి కూలి పనికి వెళ్లినప్పుడు వచ్చే నూరూ నూటాయాభై రూపాయల్లోనే ఇద్దరూ తమ కోసం కొంత దాచుకున్నారు. దాచుకున్నది బ్యాంకులో కాదు. బొడ్లో దోపుకునే చిన్న సంచిలో కొంత, అల్యూమినియం డబ్బాలో కొంత, బియ్యం బస్తాల్లో కొంత! కొడుకులు తాగుబోతులు. డబ్బుందంటే లాగేసుకుంటారు. అందుకే మూడో మనిషికి తెలీకుండా.. కష్టం సుఖం చెప్పుకున్నట్లే.. డబ్బు దాచుకున్న రహస్యం ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ మధ్యే ఉంచుకున్నారు. ఆ దాచుకున్న డబ్బు కూడా బతకడానికి కాదు. చనిపోతే అంత్యక్రియల కోసం! ఈ మధ్య తంగమ్మాళ్‌కి జబ్బు చేసింది. వైద్యానికి డబ్బు లేదు. ‘అంత్యక్రియల డబ్బు’ను బయటికి తీయక తప్పలేదు. ఇద్దరి దగ్గరా కలిపి 46 వేల రూపాయల వరకు జమ అయ్యాయి. ఇరవై ఏళ్లుగా తినీ తినకా దాచిన మొత్తం అది. అక్కవి 22 వేలు, చెల్లెలివి 24 వేలు. ‘‘నా డబ్బు కూడా తీసేస్కో అక్కా. నీ ఆరోగ్యం కంటే ఎక్కువా’’ అని చెల్లి అంది. అక్కకు కన్నీళ్లు ఆగలేదు. చెల్లిని ఆప్యాయంగా హత్తుకుంది. ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లారు. ఓ మోస్తరు ఆసుపత్రిలోనైనా ముందే డబ్బు కట్టించుకుంటున్నారుగా ఇప్పుడు. అడ్వాన్సుగా కొంత కట్టబోయారు. ఆ నోట్లను చూసి ఆసుపత్రివాళ్లు ‘ఇవి చెల్లవు’ అనేశారు. పాత వెయ్యినోట్లు, ఐదొందల నోట్లు అవి! మూడేళ్ల క్రితం ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లు!! అచేతనంగా నిలబడిపోయారు తంగమ్మాళ్, రంగమ్మాళ్. వాళ్లకా రద్దు సంగతి తెలీదు. పాత నోట్లు తప్ప చిల్లిగవ్వ లేదు వాళ్ల దగ్గర. ఉన్నా, ఆ చిల్లి గవ్వయినా ఈ కాలంలో ఎందుకు చెల్లుతుంది! విషయం కలెక్టర్ వరకు వెళ్లింది. చెల్లని నోట్లను చెల్లుబాటు చేయడం నేరం కదా, అందుకు వెళ్లింది. ఇక ఇక్కడి నుంచి ఈ స్టోరీ మీకు కొంత సంతోషాన్నిస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకునేలానూ చేస్తుంది. తిరుప్పూరు జిల్లా కలెక్టర్ కె.విజయ్ కార్తికేయన్. వాళ్ల కథ విని ఆ యువ కలెక్టర్ కదిలిపోయాడు. పాత నోట్ల మాట తర్వాత అని, వెంటనే ఆ అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేశాడు. వృద్ధాప్యపు పెన్షన్ మంజూరుకు తక్షణం ఒక లెటర్ తయారు చేయించి పైకి పంపాడు. పెరుందురై మెడికల్ కాలేజీకీ ఒక లేఖ రాస్తూ.. వీళ్లద్దరికీ ఉచిత వైద్యం అందజేయాలని విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాతే.. వీళ్ల దగ్గరున్న పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇవ్వండని జిల్లా బ్యాంకుకు సిఫారసు చేశాడు. అమాయకులున్న చోట మంచివాళ్లూ ఉంటారు. అమాయకులు, మంచివాళ్ల వల్లే ఈ ప్రపంచంపై మనకింకా నమ్మకం మిగిలి ఉంటోంది. -
స్నేహం కోసమే హత్య
తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో చోటుచేసుకున్న పరువు హత్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డులో వందలాది మంది సమక్షంలో సినీ పక్కీలో హతమార్చి దర్జాగా ఉడాయించిన నిందితుల్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, కూతురి కోసం ఓ తండ్రి అనుభవిస్తున్న మనోవేదనకు చలించే తామీ హత్య చేసినట్టుగా నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. సాక్షి, చెన్నై : ఉడుమలైలలో ఆదివారం నడిరోడ్డులో సాగిన ప్రేమ కులచిచ్చు పరువు హత్య ఘాతకం గురించి తెలిసిందే. వందలాది మంది చూస్తుండగా రోడ్డును దాటుతున్న దంపతులపై జరిగిన ఈ ఘాతుకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో కౌశల్య తండ్రి చిన్నస్వామి ఈ ఘాతకానికి సూత్రదారి అని తేలింది. అయితే న డిరోడ్డులో అందరూ చూస్తుండగా హత్యలు చేయడంలో తాము దిట్టా అని చాటుకునే విధంగా నరరూప రాక్షసుల్లా వ్యవహరించి, దర్జాగా మోటారు బైక్ ఎక్కి ఉడాయించిన ఆ నిందితుల కోసం పోలీసులు తీవ్ర వేట సాగించారు. తిరుప్పూర్‌లో తమ పథకం అమలు కావడంతో నిందితులు మోటార్ సైకిల్‌పై దిండుగల్‌కు ఉడాయించారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు తనిఖీలు ముమ్మరం చేయగా, సోమవారం అర్ధరాత్రి నిందితుల్ని పళని సమీపంలోని ఓ గ్రామంలో పోలీసులు చుట్టుముట్టారు. వీరిలో మణిగండన్, మదన్, సెల్వకుమార్, జగదీశన్ అని గుర్తించా రు. వీరంతా దిండుగల్‌కు చెందిన వారే. వీరిలో మణిగండన్ మినహా తక్కిన వాళ్లంతా నేరగాళ్లే. అయితే మణిగండన్ చిన్నస్వామికి సన్నిహితుడని విచారణలో తేలింది. చిన్నస్వామి పడుతున్న వేదనను చూసిన మణిగండన్ తనకు సన్నిహితులైన మదన్, సెల్వకుమార్, జగదీశన్‌ల ద్వారా కౌశల్యను బుజ్జగించే యత్నం చేసినట్టు, పలు మార్లు శంకర్‌ను బెదిరించినట్టు తెలిసింది. శంకర్‌కు నగదు ఆశ చూపించి కౌశల్య నుంచి దూరం చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఈ నలుగురు చిన్న స్వామిని సంప్రదించి పథకం రచించా రు. స్నేహం కోసం అన్నట్టుగా చిన్నస్వా మి పడుతున్న వేదనను చూసే, తాము శంకర్‌ను కడతేర్చామని, అడ్డొచ్చిన కౌశల్యను కూడా కడతేర్చే యత్నం చేశామని, ఆమె గాయాలతో తప్పించుకున్న ట్టు పోలీసులకు వాంగ్ములం ఇచ్చారు. చిన్నస్వామితో ఉన్న స్నేహం కోసం పరువు హత్య చేశామంటూ నిందితులు పేర్కొంటున్నా, వారి నుంచి నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని ఉండడం బట్టి చూస్తే, కిరాయికే పథకం అమలు చేసినట్టు స్పష్టం అవుతోంది. వీరిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. భద్రత నడుమ అంత్యక్రియలు : పోస్టుమార్టం అనంతరం శంకర్ మృతదేహాన్ని స్వగ్రామం తిరుప్పూర్ మడత్తుకులం కుమర తంగచావడికి పోలీసులు తీసుకెళ్లారు. మృతదేహాన్ని నేరుగా శ్మశా న వాటిక కు తరలించే యత్నం చేయడం వివాదానికి దారి తీసింది. శంకర్ ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ఒత్తిడి తెచ్చినా పోలీసు ముందు జాగ్రత్త చర్యగా, శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా మృతదేహాన్ని శ్మశానంకు తరలించే యత్నం చేశారు. ఈ సమయంలో వాగ్యుద్ధం, ఆందోళనలు బయలుదేరాయి. ఎట్టకేలకు సోమవారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు బంధువులు, ఆప్తుల్ని బుజ్జగించి మృతదేహానికి అంత్యక్రియల్ని పోలీసులు జరిపించారు. సర్వత్రా ఆగ్రహం : హత్య దృశ్యాలు వాట్సాప్, సోషల్ మీడియాల్లో ప్రత్యక్షం కావడంతో పరువు హత్యలపై రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. కులాంతర వివాహాల కారణంగా జరుగుతున్న ఈ పరువు హత్యల్ని నిరోధించాలని డిమాండ్ చేశాయి. ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే నేత విజయకాంత్, వీసీకే నేత తిరుమావళవన్ ఈ హత్యలపై మండిపడుతూ, గతం పునరావృతం కాకుండా ఇకనైనా చర్యలు వేగవంతం చేయాలని పట్టుబట్టాయి. ఇన్నాళ్లు కులాంతర వివాహాల్ని వ్యతిరేకిస్తూ వచ్చిన పీఎంకే అధినేత రాందాసు ఎన్నికల నేపథ్యంలో మాట మార్చడం గమనార్హం. ప్రేమ వివాహాలకు తాము వ్యతిరేకం కాదు అని, పరువు హత్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.