స్నేహం కోసమే హత్య
తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో చోటుచేసుకున్న పరువు హత్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డులో వందలాది మంది సమక్షంలో సినీ పక్కీలో హతమార్చి దర్జాగా ఉడాయించిన నిందితుల్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, కూతురి కోసం ఓ తండ్రి అనుభవిస్తున్న మనోవేదనకు చలించే తామీ హత్య చేసినట్టుగా నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.
సాక్షి, చెన్నై : ఉడుమలైలలో ఆదివారం నడిరోడ్డులో సాగిన ప్రేమ కులచిచ్చు పరువు హత్య ఘాతకం గురించి తెలిసిందే. వందలాది మంది చూస్తుండగా రోడ్డును దాటుతున్న దంపతులపై జరిగిన ఈ ఘాతుకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో కౌశల్య తండ్రి చిన్నస్వామి ఈ ఘాతకానికి సూత్రదారి అని తేలింది. అయితే న డిరోడ్డులో అందరూ చూస్తుండగా హత్యలు చేయడంలో తాము దిట్టా అని చాటుకునే విధంగా నరరూప రాక్షసుల్లా వ్యవహరించి, దర్జాగా మోటారు బైక్ ఎక్కి ఉడాయించిన ఆ నిందితుల కోసం పోలీసులు తీవ్ర వేట సాగించారు. తిరుప్పూర్‌లో తమ పథకం అమలు కావడంతో నిందితులు మోటార్ సైకిల్‌పై దిండుగల్‌కు ఉడాయించారు.
వీరి కోసం ప్రత్యేక బృందాలు తనిఖీలు ముమ్మరం చేయగా, సోమవారం అర్ధరాత్రి నిందితుల్ని పళని సమీపంలోని ఓ గ్రామంలో పోలీసులు చుట్టుముట్టారు. వీరిలో మణిగండన్, మదన్, సెల్వకుమార్, జగదీశన్ అని గుర్తించా రు. వీరంతా దిండుగల్‌కు చెందిన వారే. వీరిలో మణిగండన్ మినహా తక్కిన వాళ్లంతా నేరగాళ్లే. అయితే మణిగండన్ చిన్నస్వామికి సన్నిహితుడని విచారణలో తేలింది. చిన్నస్వామి పడుతున్న వేదనను చూసిన మణిగండన్ తనకు సన్నిహితులైన మదన్, సెల్వకుమార్, జగదీశన్‌ల ద్వారా కౌశల్యను బుజ్జగించే యత్నం చేసినట్టు, పలు మార్లు శంకర్‌ను బెదిరించినట్టు తెలిసింది. శంకర్‌కు నగదు ఆశ చూపించి కౌశల్య నుంచి దూరం చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఈ నలుగురు చిన్న స్వామిని సంప్రదించి పథకం రచించా రు.
స్నేహం కోసం అన్నట్టుగా చిన్నస్వా మి పడుతున్న వేదనను చూసే, తాము శంకర్‌ను కడతేర్చామని, అడ్డొచ్చిన కౌశల్యను కూడా కడతేర్చే యత్నం చేశామని, ఆమె గాయాలతో తప్పించుకున్న ట్టు పోలీసులకు వాంగ్ములం ఇచ్చారు. చిన్నస్వామితో ఉన్న స్నేహం కోసం పరువు హత్య చేశామంటూ నిందితులు పేర్కొంటున్నా, వారి నుంచి నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని ఉండడం బట్టి చూస్తే, కిరాయికే పథకం అమలు చేసినట్టు స్పష్టం అవుతోంది. వీరిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.
భద్రత నడుమ అంత్యక్రియలు :
పోస్టుమార్టం అనంతరం శంకర్ మృతదేహాన్ని స్వగ్రామం తిరుప్పూర్ మడత్తుకులం కుమర తంగచావడికి పోలీసులు తీసుకెళ్లారు. మృతదేహాన్ని నేరుగా శ్మశా న వాటిక కు తరలించే యత్నం చేయడం వివాదానికి దారి తీసింది. శంకర్ ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ఒత్తిడి తెచ్చినా పోలీసు ముందు జాగ్రత్త చర్యగా, శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా మృతదేహాన్ని శ్మశానంకు తరలించే యత్నం చేశారు. ఈ సమయంలో వాగ్యుద్ధం, ఆందోళనలు బయలుదేరాయి. ఎట్టకేలకు సోమవారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు బంధువులు, ఆప్తుల్ని బుజ్జగించి మృతదేహానికి అంత్యక్రియల్ని పోలీసులు జరిపించారు.
సర్వత్రా ఆగ్రహం :
హత్య దృశ్యాలు వాట్సాప్, సోషల్ మీడియాల్లో ప్రత్యక్షం కావడంతో పరువు హత్యలపై రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. కులాంతర వివాహాల కారణంగా జరుగుతున్న ఈ పరువు హత్యల్ని నిరోధించాలని డిమాండ్ చేశాయి. ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే నేత విజయకాంత్, వీసీకే నేత తిరుమావళవన్ ఈ హత్యలపై మండిపడుతూ, గతం పునరావృతం కాకుండా ఇకనైనా చర్యలు వేగవంతం చేయాలని పట్టుబట్టాయి. ఇన్నాళ్లు కులాంతర వివాహాల్ని వ్యతిరేకిస్తూ వచ్చిన పీఎంకే అధినేత రాందాసు ఎన్నికల నేపథ్యంలో మాట మార్చడం గమనార్హం. ప్రేమ వివాహాలకు తాము వ్యతిరేకం కాదు అని, పరువు హత్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.