కలెక్టర్‌ కదిలిపోయాడు | Tamil Nadu Sisters Who Lost Rs 40K In Note Ban Get Monthly Pension | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ కదిలిపోయాడు

Published Sun, Dec 8 2019 12:01 AM | Last Updated on Sun, Dec 8 2019 12:01 AM

Tamil Nadu Sisters Who Lost Rs 40K In Note Ban Get Monthly Pension - Sakshi

తంగమ్మాళ్, రంగమ్మాళ్‌లతో కలెక్టర్‌ విజయ్‌ కార్తికేయన్‌

మూడో మనిషికి తెలియకుండా కష్టం సుఖం చెప్పుకున్నట్లే.. డబ్బు దాచుకున్న రహస్యం ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ మధ్యే ఉంచుకున్నారు. ఆ దాచుకున్న డబ్బు కూడా బతకడానికి కాదు. చనిపోతే అంత్యక్రియల కోసం!

తంగమ్మాళ్, రంగమ్మాల్‌ అక్కాచెల్లెళ్లు. తంగమ్మాల్‌ వయసు 78. రంగమ్మాళ్‌ వయసు 75. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఆ ఇద్దరే ఉంటారు. పిల్లలు వెళ్లిపోయారు. పిల్లల పిల్లలు రావడం మానేశారు. వాళ్లుండేది చిన్న ఊరు. తమిళనాడులోని పల్లాడం దగ్గరి పూమలూర్‌. తిరుప్పూర్‌ జిల్లా. వీళ్లను చూసేవాళ్లు లేరు. చేసేవాళ్లూ లేరు. ఎవరికి ఎవరూ ఉండరని ఒంట్లో కాస్త ఓపిక ఉన్నప్పుడే వీళ్లు గ్రహించినట్లున్నారు. పొలానికి కూలి పనికి వెళ్లినప్పుడు వచ్చే నూరూ నూటాయాభై రూపాయల్లోనే ఇద్దరూ తమ కోసం కొంత దాచుకున్నారు. దాచుకున్నది బ్యాంకులో కాదు. బొడ్లో దోపుకునే చిన్న సంచిలో కొంత, అల్యూమినియం డబ్బాలో కొంత, బియ్యం బస్తాల్లో కొంత!  కొడుకులు తాగుబోతులు.

డబ్బుందంటే లాగేసుకుంటారు. అందుకే మూడో మనిషికి తెలీకుండా.. కష్టం సుఖం చెప్పుకున్నట్లే.. డబ్బు దాచుకున్న రహస్యం ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ మధ్యే ఉంచుకున్నారు. ఆ దాచుకున్న డబ్బు కూడా బతకడానికి కాదు. చనిపోతే అంత్యక్రియల కోసం! ఈ మధ్య తంగమ్మాళ్‌కి జబ్బు చేసింది. వైద్యానికి డబ్బు లేదు. ‘అంత్యక్రియల డబ్బు’ను బయటికి తీయక తప్పలేదు. ఇద్దరి దగ్గరా కలిపి 46 వేల రూపాయల వరకు జమ అయ్యాయి. ఇరవై ఏళ్లుగా తినీ తినకా దాచిన మొత్తం అది. అక్కవి 22 వేలు, చెల్లెలివి 24 వేలు. ‘‘నా డబ్బు కూడా తీసేస్కో అక్కా. నీ ఆరోగ్యం కంటే ఎక్కువా’’ అని చెల్లి అంది. అక్కకు కన్నీళ్లు ఆగలేదు. చెల్లిని ఆప్యాయంగా హత్తుకుంది. ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లారు.

ఓ మోస్తరు ఆసుపత్రిలోనైనా ముందే డబ్బు కట్టించుకుంటున్నారుగా ఇప్పుడు. అడ్వాన్సుగా కొంత కట్టబోయారు. ఆ నోట్లను చూసి ఆసుపత్రివాళ్లు ‘ఇవి చెల్లవు’ అనేశారు. పాత వెయ్యినోట్లు, ఐదొందల నోట్లు అవి! మూడేళ్ల క్రితం ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లు!! అచేతనంగా నిలబడిపోయారు తంగమ్మాళ్, రంగమ్మాళ్‌. వాళ్లకా రద్దు సంగతి తెలీదు. పాత నోట్లు తప్ప చిల్లిగవ్వ లేదు వాళ్ల దగ్గర. ఉన్నా, ఆ చిల్లి గవ్వయినా ఈ కాలంలో ఎందుకు చెల్లుతుంది! విషయం కలెక్టర్‌ వరకు వెళ్లింది. చెల్లని నోట్లను చెల్లుబాటు చేయడం నేరం కదా, అందుకు వెళ్లింది. ఇక ఇక్కడి నుంచి ఈ స్టోరీ మీకు కొంత సంతోషాన్నిస్తుంది. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనుకునేలానూ చేస్తుంది.

తిరుప్పూరు జిల్లా కలెక్టర్‌ కె.విజయ్‌ కార్తికేయన్‌. వాళ్ల కథ విని ఆ యువ కలెక్టర్‌ కదిలిపోయాడు. పాత నోట్ల మాట తర్వాత అని, వెంటనే ఆ అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేశాడు. వృద్ధాప్యపు పెన్షన్‌ మంజూరుకు తక్షణం ఒక లెటర్‌ తయారు చేయించి పైకి పంపాడు. పెరుందురై మెడికల్‌ కాలేజీకీ ఒక లేఖ రాస్తూ.. వీళ్లద్దరికీ ఉచిత వైద్యం అందజేయాలని విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాతే.. వీళ్ల దగ్గరున్న పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇవ్వండని జిల్లా బ్యాంకుకు సిఫారసు చేశాడు. అమాయకులున్న చోట మంచివాళ్లూ ఉంటారు. అమాయకులు, మంచివాళ్ల వల్లే ఈ ప్రపంచంపై మనకింకా నమ్మకం మిగిలి ఉంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement