Tiryani
-
అంగన్వాడీ సెంటర్లో ఆమ్లెట్ దొంగలు!
సాక్షి, కొమరంభీం ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాణి మండలం పరిధిలోని ఓ అంగన్వాడీ సెంటర్లో ‘ఆమ్లెట్ దొంగలు’ హల్ చేశారు. గంభీరావుపేట్ గ్రామపంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో వీరంగం సృష్టించారు. అంగన్వాడీ కేంద్రానికి ఉన్న తాళాన్ని పలగొట్టి కేంద్రం లోపలికి ప్రవేశించి.. అక్కడే ఉన్న గుడ్లను, వంట పాత్రలు ఉపయోగించి ఉపయోగించి ఆమ్లెట్లు వేసుకున్నారు. గర్భిణీలకు, పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా ఇచ్చే గుడ్లను వాడేశారు. ఈ తరుణంలో నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ఆ ఆగంతకులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇది తాగుబోతుల పనేనని గ్రామస్తులు భావిస్తున్నారు. -
మావోయిస్టులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్!
సాక్షి, అసిఫాబాద్: కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసు బలగాల నుంచి మావోయిస్టు దళ సభ్యులు తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. దీంతో తప్పించుకున్న మావోయిస్టుల గురించి 25 స్పెషల్ పార్టీ పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేస్తూ అడవి మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. 15 పోలీస్ పార్టీలతో గ్రామాలను తనిఖీ చేస్తూ గ్రామాల్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారిపై నిఘా ఉంచి పరిశీలిస్తున్నారు. మరో 20 పోలీస్ పార్టీలతో ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని ప్రదేశాల్లో విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నార్త్ జోన్ ఐజీ ఈ కూంబింగ్ ఆపరేషన్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. (మన్యంలో అలజడి..) మావోయిస్టులకు సహకరించిన కోవ అనంతరావు నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని గురువారం జైలుకు పంపించారు. ఈ క్రమంలో మావోయిస్టులకు సహాయం చేసిన వారిని గుర్తించి వారిపై నిఘా పెట్టారు. మావోల గురించి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి తగిన బహుమతులు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టుల గురించి నార్త్ జోన్ ఐజీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఉత్తరాన ఉలికిపాటు..!) -
మన్యంలో అలజడి..
సాక్షి, ఆసిఫాబాద్: ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం గుండాల అటవీ ప్రాంతంలో దళ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో విస్తృతంగా పోలీసు ప్రత్యేక బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో మావోయిస్టుల జాడ కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన దళ సభ్యులు పోలీసు బలగాల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయం కుమురం భీం జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణువారియర్ ధ్రువీకరించారు. (జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు) తప్పించుకున్న వారిలో సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు మైలవరపు అడెల్లు అలియాస్ భాస్కర్, కేబీఎం (కుమురం భీం మంచిర్యాల ఏరియా) సభ్యుడు వర్గేష్ కోయ అలియాస్ మంగులుతో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్‌లో విప్లవ సాహిత్యం, మావోయిస్టు యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికాలు, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్లు, పాలిథిన్ కార్పెట్స్ లభ్యమయ్యాయి. రూ.20లక్షల రివార్డు ఉన్న మైలారపు అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం కాగా, వర్గేష్ ది చత్తీస్ఘడ్ ప్రాంతం. ఈయనపై రూ.5లక్షల రివార్డు ఉంది. పక్కా సమాచారంతో దాడులు.. గత రెండు నెలలుగా కుమురం భీం జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్, తిర్యాణి అటవీ ప్రాంతంలో కేబీఎం దళ సభ్యులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసు శాఖకు అందింది. దీంతో స్పెషల్ పార్టీతో పాటు స్థానిక పోలీసులతో రాత్రింబవళ్లు అడవుల్లో జల్లెడ పడుతున్నా రు. గత నెల 28న దళ సభ్యులకు అన్నం పెట్టివస్తున్న ఓ వ్యక్తిని ఆసిఫాబాద్ మండలం మోవాడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానిక ఆదివాసీల గూడాలపై, సానుభూతి పరులపై మరింత దృష్టి సారించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాల రాకను పసిగట్టి అక్కడి నుంచి మావోలు తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మంగీ, గుండాల, ఉట్ల పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వారు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అడవుల్లోనే మకాం.. కరోనా సంక్షోభంలో పోలీసు యంత్రాంగం బిజీగా ఉన్న సమయంలో మహారాష్ట్ర సరిహద్దుల నుంచి జిల్లాలోకి మా వోలు అడుగుపెట్టినట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇన్నాళ్లు చత్తీస్‌గడ్‌లోని దండాకారణ్యంలో ఉన్న దళం మళ్లీ స్థానికంగా పట్టుపెంచుకునేందుకే వచ్చినట్లు పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక యువతను ఉద్యమబాట పట్టించేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. పట్టుపెంచుకునేందుకేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మిలిటెంట్ దాడులకు ప్రసిద్ధిగాంచిన మంగీ దళం పూర్తిగా కనుమరుగైంది. 2016లో దళ సభ్యుడు ఆత్రం శోభన్ అలియాస్ చార్లెస్ పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత ఇక్కడ మావోల అలజడి కనిపించలేదు. జిల్లా పునర్విభన తర్వాత మంచిర్యాల కుమురం భీం ఏరియా (కేబీఎం)కి సారథ్యం వహిస్తూ.. స్థానికంగా పట్టున్న మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్‌తో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి బండి ప్రకాశ్, అలియాస్ ప్రభాత్‌తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తమ ఉనికిని చాటేందుకు మావోలు ఓ దాడికి కూడా యత్నించినట్లు సమాచారం. ఇటీవలే గిరిజన ప్రాంతంలో యువతీ యువకులు అదృశ్యమైన సంఘటనలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వీరంతా ఉద్యమబాట పట్టారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. -
తుపాకీ మిస్ ఫైర్
తుపాకీ మిస్ ఫైర్ అయిన ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుమురం భీం జిల్లా తిర్యాణి పోలీస్ స్టేషన్లో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం చౌటపెల్లికి చెందిన కిరణ్‌కుమార్ కొంత కాలంగా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ సెంట్రీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 4:50 గంటల సమయంలో చేతిలో ఉన్న ఎస్ఎల్ఆర్ తుపాకీని గుడ్డతో తుడుస్తుండగా ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది. దీంతో తూటా కిరణ్‌కుమార్ ఎడమ దవడ నుంచి తలలోకి దూసుకెళ్లింది. స్టేషన్లో సిబ్బంది గమనించి వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కిరణ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏఎస్పీ సుధీంద్ర పరిశీలించారు. – తిర్యాణి (ఆసిఫాబాద్) -
కాలువలో పడ్డ ఆటో: ముగ్గురికి తీవ్రగాయాలు
తిర్యాని (ఆదిలాబాద్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలో పడింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం రాంపల్లి శివారులో సోమవారం చోటుచేసుకుంది. రాంపల్లి నుంచి తిర్యాని వెళ్తున్న ప్రయాణికుల ఆటో రోడ్డు పక్కన ఉన్న ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలో పడటంతో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తిర్యాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వ్యాను బోల్తా : 15 మందికి గాయాలు
తిర్యాణి: ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యాను బోల్తాపడిన ఘటనలో 9 మంది విద్యార్థులు సహా 15 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని తిర్యాణి మండలం, సంగిడి మాదర ఆశ్రమ పాఠశాలకు వెళ్లేందుకు 9 మంది విద్యార్థులు కేరేగూడ గ్రామంలో బొలేరో వ్యాను ఎక్కారు. ఈ వ్యాన్ కేరేగూడ గ్రామం నుంచి కందుల బస్తాలతో అసిఫాబాద్‌కు బయల్దేరగా... విద్యార్థులు ఆ బస్తాలపైకి ఎక్కి కూర్చున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ వ్యాను రాఘవాపూర్ గ్రామం సమీపంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 9 విద్యార్థులతో సహా డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రలను తిర్యాణిలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అభివృద్ధికిప్రణాళిక లే కీలకం
తిర్యాణి : గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలే కీలకమని కలెక్టర్ డాక్టర్ జగన్మోహన్ అన్నారు. తిర్యాణి మండలం కన్నెపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్వరాజ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు- మన ప్రణాళిక చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం ఆర్టికల్ 73 ప్రకారం గ్రామసభలకు చ ట్టబద్ధత కల్పిస్తోందని, దీని ప్రకారం గ్రామసభలో తీర్మానం చేసే పనులను తప్పకుండా చేపడతామని చెప్పారు. చిన్నారులంతా బడికి వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు. ఇటీవల వర్షాభావ పరిస్థితులతో విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేస్తుందని చెప్పారు. అనంతరం డీఈవో, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణరెడ్డి మన ఊరు, మన ప్రణాళికలో భాగంగా గ్రామస్తులకు అవసరమైన పనుల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. గ్రామస్తులు వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. కాగా, తిర్యాణి నుంచి 3 ఇంక్లైన్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, రోడ్డు మరమ్మతు చేపట్టి పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోకి మార్చాలని ఎంపీపీ హన్మాండ్ల లక్ష్మి కలెక్టర్‌ను కోరారు. ఉట్నూర్ ఆర్డీవో రాంచంద్ర య్య, గ్రామ సర్పంచ్ దుస్స మధుకర్, తిర్యాణి సింగిల్ విండో చైర్మన్ చుంచు శ్రీనివాస్, మాజీ సర్పంచులు వెడ్మ సోము, చంచు దుర్గయ్య, వైద్యాధికారి కిరణ్, ట్రాన్స్‌కో ఏఈ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాయెంగి మల్లేశ్, నాయకులు జగదీశ్, ముత్యం రాజయ్య, వార్డు సభ్యులు, గ్రామైక్య సంఘాల మహిళలు పాల్గొన్నారు. బోగస్ రేషన్‌కార్డులపై దృష్టి రెబ్బెన : జిల్లాలో కుటుంబాలకు మించి ఉన్న బోగస్ రేషన్ కార్డులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం రెబ్బెన తహశీల్దా ర్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని భూసమస్యలు, రేషన్‌కార్డుల వివరాల ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు కార్డులు అందించేందుకు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో జరి గే అవినీతిని అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. వేలిముద్రలు సరిగా వేయలేనివారు, రెండు చేతులు కోల్పోయిన వికలాంగులకు సెల్ఫ్ డిక్లరేషన్‌పై మ్యాన్వల్ పద్ధతిలో పింఛన్ అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో మొదట్లో విత్తనాలు వేసి నష్టపోయిన రైతుల కోసం సోయా, పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు విత్తినవాటి లో సుమారు 70 శాతం విత్తనాలు మొలకెత్తినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాంచంద్రయ్య ఉన్నారు.