‘ఔటర్’పై అధునాతన ‘టోల్’ వ్యవస్థ
20 జంక్షన్లలో టీఎంఎస్ ఏర్పాటు
రూ.75 కోట్లతో 18 నెలల్లో పూర్తి
నేడు ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్ : నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆటోమేటిక్ టోల్ వ్యవస్థ ‘టోల్ మేనేజ్మెంట్ సిస్టం (టీఎంఎస్)’ మరో ఒకటిన్నర సంవత్సరాల్లో అందుబాటులోకి రానుంది. రూ. 75 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఏర్పాట్లు చేస్తోంది. టీఎంఎస్ టెండర్‌పై కోర్టు వివాదం ఇటీవలే సమసిపోవడంతో శుక్రవారం ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నారు. ఇది గ్లోబల్ టెండర్ అయినందున ఎన్నికల కోడ్ దీనికి వర్తించదని, అయినా.. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొన్నాకే అధికారికంగా ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని విధాలా అర్హత సాధించిన సంస్థకు పనులను అప్పగించి 18 నెలల్లో పూర్తిచేసే లక్ష్యంతో ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనందర్ కుమార్ చర్యలు చేపట్టారు.హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డుపై 20 జంక్షన్లలో టోల్ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
మొత్తం 180 లేన్లలో 23 వరకు ఎలక్ట్రానిక్స్ టోల్ కలెక్షన్ లేన్స్ ఉంటాయి. మిగతా 157 లేన్లలో మాన్యువల్, టచ్ అండ్ గో వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. ఫైనాన్షియల్ బిడ్‌లో అర్హత సాధించిన ఏజెన్సీ (ఎల్-1)కి టెండర్ ఖారారు చేస్తారు. ఆ సంస్థ గడువులోగా ఔటర్‌పై అత్యాధునిక టోల్ గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టీఎంఎస్ డిజైన్, విడిభాగాలు అమర్చుడం, సమర్ధ నిర్వహణ, నాణ్యత ప్రమాణాల పరిరక్షణ బాధ్యతలను ఆ సంస్థే చేపట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా టోల్ బూత్‌లు, బూమ్ బారియర్స్, కంప్యూటర్ సర్వర్లు, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఆటోమేటిక్ వెహికల్ క్లాసిఫయర్ కం కౌంటర్, టోల్ ఆడిట్, సమాచార వ్యవస్థ, జనరేటర్లు, విద్యుత్ వంటి ఏర్పాట్లను కూడా ఆ సంస్థే చేయాలి.
హమ్మయ్య ... ఎట్టకేలకు
ఔటర్ రింగ్ రోడ్డుపై టీఎంఎస్ ఏర్పాటుకు మూడేళ్ల కిందటే హెచ్‌జీసీఎల్ శ్రీకారం చుట్టింది. అప్పట్లో ఈ ప్రాజెక్టు కోసం 6 విదేశీ సంస్థలు పోటీ పడ్డాయి. హెచ్‌జీసీఎల్ చేసిన షార్ట్ లిస్ట్‌లో ఐఆర్డిఐ- ఐఆర్డిఎస్ఏ కన్సార్షియా (కెనడా), హిటాచీ (జపాన్), టెల్వెంట్ ఎల్ అడ్ టి (స్పెయిన్), ఎల్‌ఎస్‌ఐఎస్-ఆర్ఐటి కన్సార్షియం (కొరియా), ఇఫ్‌కాన్ ఏజీ (ఆస్టియా), తోషిబా- ఇటోచు కన్సార్షియం తోషిబా కార్పొరేషన్ (జపాన్)లు ఎంపికయ్యాయి. సాంకేతిక అర్హతల పరిశీలనలో (టెక్నికల్ ఎవాల్యుయేషన్‌లో) ఎల్‌ఎస్‌ఐఎస్-ఆర్ఐటి కన్సార్షియం, హిటాచీ సంస్థలు అర్హత సాధించాయి.
అయితే, టెక్నికల్ ఎవాల్యుయేషన్ సరిగా చేయలేదని, మళ్లీ పరిశీలించాలంటూ ఇఫ్‌కాన్ సంస్థ కోర్టుకెళ్లి సింగిల్ బెంచిలో గెలిచింది. దీనిపై హెచ్ఎండీఏ అప్పీల్‌కు వెళ్లినా ఫలితం లేకపోయింది. మళ్లీ సాంకేతిక అర్హతలను పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. దీంతో టెక్నికల్ కమిటీ గతంలో తిరస్కరించిన సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకొంది. దీనిపై ఎల్‌ఎస్‌ఐఎస్ సంస్థ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కోర్టు నుంచి స్టే తెచ్చింది. హైకోర్టు ఈ నెల 10 ఎల్‌ఎస్‌ఐఎస్ సంస్థ వాదనను తోసిపుచ్చుతూ కేసు కొట్టేసింది. దీంతో టీఎంఎస్ టెండర్ ఫైనాన్షియల్ బిడ్ తెరిచేందుకు మార్గం సుగమమైంది.