'రాష్ట్ర ఉద్యోగులకు అండగా ఉంటా'
► టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రామయ్య
ఖమ్మంసహకారనగర్: తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో తమవంతు కృషి చేస్తామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు పి.రామయ్య అన్నారు. ఆదివారం నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద ఆ సంఘం నగరశాఖ సమావేశం జరిగింది. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య మాట్లాడుతూ జిల్లా విభజన తర్వాత జరిగే బదిలీల్లో అందరికీ న్యాయం చేసేలా చూస్తామన్నారు.
ఇళ్ల స్థలాలు అందరికీ ఇప్పించేందుకు కృషి చేస్తానని, విద్యార్హత ఉన్న 4వ తరగతి సిబ్బందికి పదోన్నతులు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన మహిళలకు క్రీడలు నిర్వహించాలని తీర్మానించారు. నగరశాఖ అధ్యక్షుడు వట్టికొండ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు వెంకన్న, నాయకులు చావా నారాయణరావు, వెంకటరమణ, ప్రసాద్, కృష్ణవేణి, భాగ్యమ్మ, అక్కమ్మ, సుగుణారావు పాల్గొన్నారు.