మాధవరం ఇంటిని ముట్టడించిన 'కార్యకర్తలు'
హైదరాబాద్: టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు మండిపడుతున్నారు. అందులోభాగంగా కూకట్పల్లిలోని ఆయన నివాసాన్ని ఆదివారం టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో మాధవరం ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు. దాంతో పోలీసులు భారీగా సంఖ్యలో అక్కడికి చేరుకుని... కార్యకర్తలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. దీంతో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి మాధవరం కృష్ణారావు టీడీపీ టికెట్ పై గెలుపొందారు. అయితే శనివారం ఆయన టీడీపీకి రాజీనామా చేసి ... టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణలో శాసనమండలికి సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న విషయం విదితమే.