గీతకార్మికుల ఎక్స్‌గ్రేషియా పెంపునకు కృషి
- అబ్కారీ శాఖ మంత్రి పద్మారావుగౌడ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని అబ్కారీ, మద్యనిషేధ శాఖ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికుల కుటుంబాలకు సోమవారం రవీంద్రభారతిలో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గీత కార్మికులకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడి రూ. 2 లక్షలు నుంచి రూ. 5 లక్షలు పెంచేందుకు కృషిచేస్తానన్నారు.
ఎక్స్‌గ్రేషియా 15 రోజుల నుంచి 30 రోజుల్లో బాధితుల చేతికి అందేలా చేస్తామన్నారు. కల్లు దుకాణాలు తెరవడంతో నగరంలో 50 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. కల్లు దుకాణాల్లో పనిచేసే వారికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. తాటి, ఈత చెట్లకు పన్ను విధానం రద్దు చేయాలని చెప్పారు. వీరికోసం ఓ సంక్షేమ బోర్డు అవసరమన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ తాటి చెట్టు డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం టీఆర్ఎస్ పార్టీకి దక్కేలా గీత కార్మికులందరూ అండగా నిలవాలన్నారు.
త్వరలో ఈ కార్మికుల సమస్యలపై ప్రధానిని కలవనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులపై గతంలోలాగా తెలంగాణ పాలనలో దౌర్జన్యాలు ఉండవని తెలిపారు. ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గీతకార్మికుల కోసం ఒకేసారి రూ. 7.70 కోట్లు మంజూరు చేశారన్నారు. దీనివల్ల 3,236 మంది గీత కార్మికులకు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి వచ్చిన బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాజలింగంగౌడ్, రెవెన్యూ విభాగం ప్రభుత్వ కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ టి.ప్రసాద్, అదనపు కమిషనర్ ఎంఎంఎ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు.