tomata market
-
టమాట ధర ఢమాల్ : 7500 కిలోల టమాటాను తగులబెట్టిన రైతు
నిన్నటి దాకా సెంచరీ దాటేసి మంట మండించిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. 50 రూపాయలకు 5 కిలోల చొప్పున విక్రయిస్తున్నా డిమాండ్ లేని పరిస్థితి. ఈనేపథ్యంలో టమాట దిగుబడి బాగా వచ్చినా మార్కెట్లో సరియైన ధర లభించక పంటను తగుల బెట్టుకుంటున్నాడు రైతన్న.శివ్వంపేట(నర్సాపూర్): టమాటాకు మార్కెట్లో ధర లేకపోవడంతో ఒక రైతు పంటను తగులబెట్టాడు. మండల పరిధి నవాబుపేట గ్రామానికి చెందిన రవిగౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా పంటను సాగు చేస్తున్నాడు. ప్రస్తు తం పొలం నుంచి పంటను సేకరించి మార్కె ట్‌కు తరలిస్తే.. ఒక్కొక్క బాక్స్‌కు రూ.50 మించి ధర రావడం లేదు. రవాణాకు ఒక్కో బాక్స్‌కు రూ.30 పోగా రూ.20 వస్తున్నాయని, కూలీల డబ్బులు సైతం చేతికి అందడం లేదని రైతు వాపోయాడు. దీంతో గురువారం రెండు ఎకరాల్లోని 7500 కిలోల టమాటా పంటను తొలగించి తగులబెట్టాడు. ఇదే గ్రామంలో 25 మంది రైతులు సుమారు 60 నుంచి 70 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో వీరంతా తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొంది. -
భయపెడుతోన్న టమాట ధరలు.. సామాన్యులు కొనగలరా?
ఖమ్మం వ్యవసాయం: ఏ కూరగాయలు లేకపోతే కనీసం టమాట అయినా వండొచ్చుగా.. సాధారణంగా ప్రతీ మధ్య తరగతి కుటుంబాల్లో వినిపించే మాట ఇది. కానీ, ఇప్పుడు టమాట కూడా సామాన్యులకు భారంగా మారింది. ధర పైపైకి వెళ్తుండటంతో కూర వండుకోవడం కాదు కదా.. వాటిని కొనాలంటేనే భయమేస్తోంది. ఒక్కోసారి రూపాయికి కిలో చొప్పున అమ్మినా కొనేవారు లేక.. రోడ్లపై పారబోసే టమాట ధర ఇప్పుడు భయపెడుతోంది. స్థానికంగా పంట ఉత్పత్తి లేకపోవడంతో.. టమాట ధర వినియోగదారులను ఠారెత్తిస్తోంది. స్థానికంగా పంట ఉత్పత్తి లేకపోవడంతో ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం రైతు బజార్లలో కిలో రూ.10కి లభించిన టమాట, నేడు రూ.58 పైగానే పలుకుతోంది. రిటైల్ మార్కెట్లు, వ్యాపార దుకాణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రూ.70 నుంచి రూ.80 వరకు కూడా విక్రయిస్తున్నారు. యాసంగి పంటగా నవంబర్, డిసెంబర్ నెలల్లో సాగు చేసిన పంట ఏప్రిల్ నెలతో ముగిసింది. ఖమ్మం పరిసర మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో సాగు చేసిన టమాటను ఖమ్మం నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లో, రైతుబజార్లలో విక్రయిస్తుంటారు. ఏప్రిల్ వరకు స్థానికంగా పండిన టమాట పంట విక్రయానికి వచ్చింది. ప్రస్తుతం స్థానికంగా పంట ఉత్పత్తి లేదు. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో షేడ్నెట్లలో టమాటను సాగు చేస్తున్నారు. స్థానికంగా పంట లేకపోవడంతో ధరకు రెక్కలొచ్చాయి. రైతు బజార్లలో ఏప్రిల్ 5వ తేదీ వరకు కిలో రూ.10కి లభించిన టమాట ఆ నెల చివరి వారానికి రూ. 34కు చేరింది. మే ఆరంభానికి రూ. 44కు చేరగా, ప్రస్తుతం రూ.58పైగా పలుకుతోంది. ధర పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు టమాట వినియోగానికి దూరమవుతున్నారు. ఈ ధరలు జూన్, జూలై వరకు ఉంటాయని ఉద్యాన అధికారులు, హోల్‌సేల్ వ్యాపారులు, ఉద్యాన రైతులు పేర్కొంటున్నారు. చదవండి: అమెరికా టు కరీంనగర్.. సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోనే రెండో బ్రాంచి -
ముంచేస్తున్న.. జాక్‌పాట్
– మదనపల్లె మార్కెట్లో జాక్‌పాట్ వేలం పాటలు – రోజుకు రూ.75 వేల వరకు నష్టపోతున్న టమాట రైతులు – గొప్పల కోసం పోయి చేతులు కాల్చుకుంటున్న వైనం – కళ్లప్పగించి చూస్తున్న అధికారులు మదనపల్లె మార్కెట్లో జాక్‌పాట్ వేలం పాట టమాట రైతును నిలువునా ముంచేస్తోంది. రోజుకు కొన్ని టన్నుల వరకు వ్యాపారులు ఉచితంగా దండుకుంటున్నారు. ధర కూడా పెద్దగా ఇవ్వడంలేదు. దీంతో రోజుకు రూ.75 వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత మార్కెట్ అధికారులు, సిబ్బంది పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. మదనపల్లె : మదనపల్లె టమాట మార్కెట్లో జాక్‌పాట్ వేలం రాజ్యమేలుతోంది. గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు అధిక ధర పేరుతో రైతులను బోల్తాకొట్టిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక టమాట మార్కెట్‌కు రోజుకు 500 నుంచి 550 టన్నుల కాయలు వస్తున్నాయి. 50 క్రేట్లు ఒక టన్ను. జాక్‌పాట్ వేలం ప్రకారం వ్యాపారుడు ఇందులో ఐదు క్రేట్లు ఉచితంగా పొందుతాడు. మిగిలిన 45 క్రేట్లకే ధర చెల్లిస్తాడు. ఈ లెక్కన 500 టన్నులకు 250 క్రేట్లు పోతున్నాయి. స్థానిక మార్కెట్లో క్రేట్ యావరేజ్‌గా రూ.300 నుంచి రూ.320 వరకు పలుకుతోంది. ఈ లెక్కన రోజుకు రూ.75 వేల నుంచి రూ.80 వేల వరకు రైతు నష్టపోవాల్సి వస్తోంది. దోచుకోవడమే పని వాస్తవానికి ఒక క్రేట్‌కు కాయలను తలసరిగా మాత్రమే వేసి బాక్సుపై బాక్సు ఉంచి వేలం పాట నిర్వహించాలి. జిల్లాలోని చాలా మార్కెట్లలో ఇలానే వేలం పాట నిర్వహిస్తుంటారు. తలసరిగా కాయలు వేస్తే ఒక క్రేట్‌కు 28 నుంచి 30 కిలోలు పడుతాయి. కానీ మదనపల్లెలో అలా జరగడం లేదు. వ్యాపారులు క్రేట్‌పైన రాశుల్లా కాయలను పోసి వేలం నిర్వహిస్తున్నారు. తద్వారా ఒక క్రేట్‌కు దాదాపు 7 కిలోల కాయలు అదనంగా ఉంటున్నాయి. ఈలెక్కన కొన్ని టన్నుల వరకు వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. గొప్పలకు పోయి.. రైతులు చాలా మంది గొప్పలకుపోయి నష్టాల్లో కూరుకుపోతున్నారు. సాధారణంగా జాక్‌పాట్ వేలంలో రైతులకు అదనపు ధర చెల్లిస్తామని వ్యాపారులు మభ్యపెడుతుంటారు. దీంతో కొందరు రైతులు వారితో కుమ్మక్కై కాయలు వారికే విక్రయిస్తుంటారు. కానీ బయట మార్కెట్లతో పోల్చితే రైతుకు సాధారణ ధరే దక్కుతుంటుంది. ఇది తెలియక చాలా మంది రైతులు నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది.