మదనపల్లె మార్కెట్‌కు వచ్చిన టమాటా
ముంచేస్తున్న.. జాక్‌పాట్
Published Thu, Sep 22 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
– మదనపల్లె మార్కెట్‌లో జాక్‌పాట్ వేలం పాటలు
– రోజుకు రూ.75 వేల వరకు నష్టపోతున్న టమాట రైతులు
– గొప్పల కోసం పోయి చేతులు కాల్చుకుంటున్న వైనం
– కళ్లప్పగించి చూస్తున్న అధికారులు
మదనపల్లె మార్కెట్‌లో జాక్‌పాట్ వేలం పాట టమాట రైతును నిలువునా ముంచేస్తోంది. రోజుకు కొన్ని టన్నుల వరకు వ్యాపారులు ఉచితంగా దండుకుంటున్నారు. ధర కూడా పెద్దగా ఇవ్వడంలేదు. దీంతో రోజుకు రూ.75 వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత మార్కెట్ అధికారులు, సిబ్బంది పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
మదనపల్లె : మదనపల్లె టమాట మార్కెట్‌లో జాక్‌పాట్ వేలం రాజ్యమేలుతోంది. గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు అధిక ధర పేరుతో రైతులను బోల్తాకొట్టిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక టమాట మార్కెట్‌కు రోజుకు 500 నుంచి 550 టన్నుల కాయలు వస్తున్నాయి. 50 క్రేట్లు ఒక టన్ను. జాక్‌పాట్ వేలం ప్రకారం వ్యాపారుడు ఇందులో ఐదు క్రేట్లు ఉచితంగా పొందుతాడు. మిగిలిన 45 క్రేట్లకే ధర చెల్లిస్తాడు. ఈ లెక్కన 500 టన్నులకు 250 క్రేట్లు పోతున్నాయి. స్థానిక మార్కెట్‌లో క్రేట్ యావరేజ్‌గా రూ.300 నుంచి రూ.320 వరకు పలుకుతోంది. ఈ లెక్కన రోజుకు రూ.75 వేల నుంచి రూ.80 వేల వరకు రైతు నష్టపోవాల్సి వస్తోంది.
దోచుకోవడమే పని
వాస్తవానికి ఒక క్రేట్‌కు కాయలను తలసరిగా మాత్రమే వేసి బాక్సుపై బాక్సు ఉంచి వేలం పాట నిర్వహించాలి. జిల్లాలోని చాలా మార్కెట్లలో ఇలానే వేలం పాట నిర్వహిస్తుంటారు. తలసరిగా కాయలు వేస్తే ఒక క్రేట్‌కు 28 నుంచి 30 కిలోలు పడుతాయి. కానీ మదనపల్లెలో అలా జరగడం లేదు. వ్యాపారులు క్రేట్‌పైన రాశుల్లా కాయలను పోసి వేలం నిర్వహిస్తున్నారు. తద్వారా ఒక క్రేట్‌కు దాదాపు 7 కిలోల కాయలు అదనంగా ఉంటున్నాయి. ఈలెక్కన కొన్ని టన్నుల వరకు వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు.
గొప్పలకు పోయి..
రైతులు చాలా మంది గొప్పలకుపోయి నష్టాల్లో కూరుకుపోతున్నారు. సాధారణంగా జాక్‌పాట్ వేలంలో రైతులకు అదనపు ధర చెల్లిస్తామని వ్యాపారులు మభ్యపెడుతుంటారు. దీంతో కొందరు రైతులు వారితో కుమ్మక్కై కాయలు వారికే విక్రయిస్తుంటారు. కానీ బయట మార్కెట్లతో పోల్చితే రైతుకు సాధారణ ధరే దక్కుతుంటుంది. ఇది తెలియక చాలా మంది రైతులు నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది.
Advertisement